BJP Protest | ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. అరాచకాన్ని తరిమికొట్టాలి
BJP Protest | కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీకి వ్యతిరేకంగా బీజేపీ సైతం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండి కూటమి ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనికి కౌంటర్‌గా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని తరిమికొట్టండి అనే నినాదంతో ఆందోళనలు నిర్వహించింది.
- ఇండియా కూటమి ర్యాలీకి పోటీగా బీజేపీ నిరసన
- దేశవ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు
- 1984 సిక్కుల ఊచకోత బాధితులకు సంఘీభావంగా ఢిల్లీలో ప్రదర్శన..
- కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన అమిత్ షా
- దేశంలో అరాచకం సృష్టించే కుట్ర పన్నుతున్నారని నడ్డా ఆరోపణలు
- 1984లో ప్రజాస్వామ్య హత్య జరగలేదా? అని ప్రశ్నించిన ఢిల్లీ సీఎం రేఖ
- ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందన్న నితిన్ నబిన్
BJP Protest | కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీకి వ్యతిరేకంగా బీజేపీ సైతం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండి కూటమి ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీనికి కౌంటర్‌గా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని తరిమికొట్టండి అనే నినాదంతో ఆందోళనలు నిర్వహించింది. ఢిల్లీలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు చేపట్టారు. ముఖ్యంగా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు సంఘీభావంగా ఢిల్లీలోని హరినగర్ బస్ డిపో నుంచి తిలక్‌నగర్ మెట్రో స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖాగుప్తా, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా సహా పలువురు నేతలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. 1984 అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన సిక్కుల స్మారకంగా నేతలు తలకు నల్ల రిబ్బన్లు ధరించారు నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి సైతం బీజేపీ నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించారు. సిక్కు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ప్రదర్శనలో నినాదాలు చేశారు.
సిక్కులపై దారుణాలకు ఏం సమాధానం చెబుతరు : రేఖా గుప్తా, ఢిల్లీ సీఎం
ఈ సందర్భంగా సీఎం రేఖాగుప్తా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు 1984లో సిక్కులపై జరిగిన దారుణాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వేలాది మంది సిక్కు సోదరులు, సోదరీమణులు ఈ రోజు న్యాయం కోసం కాంగ్రెస్‌ను నిలదీస్తున్నారని అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నించారు. దేశంలో అరాచకాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
అల్లర్లు కాదు.. ఊచకోత : హర్దీప్ పూరీ, కేంద్రమంత్రి
1984లో ఢిల్లీలో సిక్కులపై జరిగిన హింసను సాధారణ అల్లర్లుగా అభివర్ణించలేమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. అది ముందస్తు ప్రణాళికతో జరిగిన మారణకాండ అని, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరంగా అభివర్ణించారు. అధికారిక లెక్కల ప్రకారం ఢిల్లీలోనే 2,733 మంది సిక్కులు హత్యకు గురయ్యారని గుర్తుచేశారు. అప్పటి హింసను ప్రజాగ్రహం వల్ల అకస్మాత్తుగా చెలరేగిన ఘటనగా చిత్రీకరించడం వాస్తవం కాదన్నారు. 1984లో హింస మొదలైన సమయంలో తాను జెనీవాలో ఉన్నానని, ఢిల్లీలోని తన తల్లిదండ్రులను హిందూ మిత్రులు కాపాడారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఈ ఘటనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని, సిక్కు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో ఇండియా కూటమి ర్యాలీ నిర్వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రాహుల్ గాంధీ తన సలహాదారులతో కలిసి ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సూచించారు.
సిక్కుల ఊచకోత రోజునే కాంగ్రెస్ ర్యాలీనా? : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,
1984 సిక్కుల ఊచకోత జరిగిన రోజునే ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సభ సిక్కు బాధితుల గాయాలపై కారం చల్లినట్లుగా ఉందని విమర్శించారు. నవంబర్ 1, 2, 3 తేదీల్లో ర్యాలీ నిర్వహించవద్దని ముందుగానే కోరినా కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. చండీగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. 1984లో ఢిల్లీలో వేలాది మంది సిక్కులను సజీవ దహనం చేశారని, అనేక కుటుంబాలను రోడ్డున పడేశారని గుర్తుచేశారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ‘పెద్ద చెట్టు కూలినప్పుడు భూమి కంపిస్తుంది’ అంటూ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ.. వేలాది మంది హత్యలను అలా ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. సిక్కుల ఊచకోతను భారత్, పంజాబ్ ఎప్పటికీ మరిచిపోవని స్పష్టం చేశారు. దీపావళి సమయంలో వ్యాపారానికి నష్టం జరుగుతుందని ఢిల్లీ వ్యాపారులు ర్యాలీ వాయిదా వేయాలని మూడుసార్లు ప్రెస్‌మీట్లు పెట్టి, లేఖలు రాసినా కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆరోపించారు. గత మూడు ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్‌కు రాబోయే మూడు ఎన్నికల్లోనూ అదే పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యానించారు. అబద్ధాలు ప్రచారం చేయడం, పార్లమెంట్‌ను అడ్డుకోవడం, వీధుల్లో రచ్చ చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఇదే తీరు కొనసాగిస్తే మరో ఐదేళ్లు ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుందని అన్నారు. సోనియాగాంధీ తన కుమారుడిని ప్రధాని చేయాలన్న కల నెరవేరలేదని, రాహుల్ గాంధీ జీవితాంతం మాక్ పార్లమెంట్‌లోనే ఉండాల్సి వస్తుందని సెటైర్లు వేశారు షా.
అల్లర్లు సృష్టించేందుకు కూటమి కుట్ర : జేపీ నడ్డా, కేంద్రమంత్రి
ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అరాచకం సృష్టించేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఆదివారం నిర్వహించిన కూటమి ర్యాలీ రాజకీయ నాటకమని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రాజకీయ విధానంలో అబద్ధాల ప్రచారం, వీధుల్లో అశాంతి సృష్టించడం, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, విదేశీ శక్తుల ప్రోద్బలంతో ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ఉన్నాయని ఆరోపించారు. నవంబర్ 1న ర్యాలీ నిర్వహించడం వెనుక సిక్కుల మనోభావాలను దెబ్బతీయడం, ఢిల్లీలో అశాంతి సృష్టించడం, పండుగల వేళ వ్యాపారుల ఉపాధికి గండికొట్టడం, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దెబ్బతీయడం లక్ష్యాలుగా ఉన్నాయని విమర్శించారు. ధన్‌తేరస్, దీపావళి, ఛఠ్ పూజ వేళ ర్యాలీ వాయిదా వేయాలని వ్యాపారులు కోరినా కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదన్నారు. విదేశాల్లో భారత్‌ను విమర్శించే రాహుల్.. దేశంలో ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. దేశం రాజ్యాంగం, ప్రజల తీర్పు ప్రకారమే నడుస్తుందని స్పష్టం చేశారు.
క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. నిరసనలేంటీ ? : నితిన్ నవీన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
సిక్కుల ఊచకోతకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సింది పోయి నిరసనలకు దిగడం ఏమిటని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రశ్నించారు. హర్యానాలోని రోహ్‌తక్‌లో కాంగ్రెస్ ఢిల్లీ ర్యాలీకి వ్యతిరేకంగా నిర్వహించిన బీజేపీ ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. 1984లో సిక్కుల ఊచకోత ఘటనపై రాహుల్ గాంధీ పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు అధికారం అప్పగించకపోవడంతోనే కాంగ్రెస్ రాజ్యాంగ సంస్థలపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ముందుగా కుటుంబ పాలనను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని హితవు పలికారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని తిరిగే కాంగ్రెస్.. ఆ రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘంపై విమర్శలు చేసే కాంగ్రెస్ చరిత్రలోనే ఎన్నికల అక్రమాలకు ఉదాహరణలు ఉన్నాయని, ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఓట్ల తొలగింపుపై చర్చకు తాము సిద్ధమని, చొరబాటుదారులకు హక్కులు కల్పించబోమని అన్నారు. విదేశీ శక్తుల ప్రోద్బలంతో దేశంలో అశాంతి సృష్టించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని, ప్రజల తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఎవరి వల్లా కాదని వ్యాఖ్యానించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Immortal Movie Review | రక్తం తాగే ఏలియన్ అందమైన అమ్మాయిగా మారితే - కయదు లోహర్ హారర్ మూవీ ఎలా ఉందంటే?
- ●KTR Adilabad Tour | ఆ రైతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున సాయం అందించిన కేటీఆర్
- ●CS Sanjay Jaju | పారిశ్రామిక అభివృద్ధికి రహదారి కనెక్టివిటీ కీలకం
- ●TG Oilfed | ఆయిల్‌పామ్‌లో టీజీ ఆయిల్‌ఫెడ్ సరికొత్త రికార్డు
- ●Grandparents' Day | తాతయ్యలు.. నానమ్మలతో చిన్నారుల సండే సందడి!
- ●Bigg Boss | బిగ్‌బాస్ షో లైవ్‌లో లవ్ ప్రపోజల్ - స్టేజ్‌మీద కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్ తల్లిదండ్రులు

Immortal Movie Review | రక్తం తాగే ఏలియన్ అందమైన అమ్మాయిగా మారితే - కయదు లోహర్ హారర్ మూవీ ఎలా ఉందంటే?

KTR Adilabad Tour | ఆ రైతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున సాయం అందించిన కేటీఆర్

CS Sanjay Jaju | పారిశ్రామిక అభివృద్ధికి రహదారి కనెక్టివిటీ కీలకం

TG Oilfed | ఆయిల్‌పామ్‌లో టీజీ ఆయిల్‌ఫెడ్ సరికొత్త రికార్డు



