BJP-Congress Alliance | అసలు మహారాష్ట్ర రాజకీయాలు అంటేనే ఎవ్వరికీ అర్థం కావు. పేరుకు ఒక్క పార్టీ కానీ వర్గాలు మాత్రం వేరుగా ఉంటాయి. పార్టీ నేతల వర్గాల పేరుతో రాష్ట్రంలో వింత రాజకీయాలు జరుగుతుంటాయి. తాజాగా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మరోసారి ఈ రాష్ట్రం రాజకీయాలు నివ్వెరపరుస్తున్నాయి. థానె జిల్లాలోని అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ రాజకీయాలు రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారాయి. అసలు కాంగ్రెస్ పార్టీనే దేశంలో ఉండొద్దు.. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని వినిపిస్తున్న బీజేపీ.. లోకల్‌గా మాత్రం అదే కాంగ్రెస్‌తో జతకట్టింది. దీంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ కలయికపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయింది. నిబంధనలు ఉల్లంఘించి బీజేపీతో జతకట్టినందుకు స్థానిక నాయకత్వంపై సస్పెన్షన్ వేటు వేసింది. అసలేం జరిగింది? అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 27 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, మెజారిటీకి కేవలం 4 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో షిండే సేనను అధికారానికి దూరం చేసే లక్ష్యంతో బీజేపీ (14), కాంగ్రెస్ (12), ఎన్సీపీ-అజిత్ పవార్ వర్గం (4) మరియు ఒక స్వతంత్ర అభ్యర్థి కలిసి "అంబర్‌నాథ్ వికాస్ అఘాడీ" పేరుతో కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమి బలం 32కు చేరడంతో బీజేపీకి చెందిన తేజశ్రీ కరంజులే మున్సిపల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీరియస్ - 12 మంది కార్పొరేటర్ల సస్పెన్షన్ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా బీజేపీతో చేతులు కలపడాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. అంబర్‌నాథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ పాటిల్‌తో పాటు ఎన్నికైన 12 మంది కార్పొరేటర్లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బ్లాక్ కాంగ్రెస్ కార్యవర్గాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫడ్నవీస్ స్పందన "ఇది ఆమోదయోగ్యం కాదు" అంటూ ఈ పరిణామంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. "కాంగ్రెస్, ఎంఐఎం (AIMIM) పార్టీలతో ఎలాంటి పొత్తును బీజేపీ ఆమోదించదు. స్థానిక నాయకులు సొంతంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పు. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. వెంటనే ఆ కూటమిని రద్దు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. విమర్శల వెల్లువ బీజేపీ-కాంగ్రెస్ పొత్తుపై షిండే వర్గం విమర్శలు గుప్పించింది. అధికార దాహంతో బీజేపీ తన సిద్ధాంతాలను తాకట్టు పెట్టిందని, కాంగ్రెస్ రహిత భారత్ అన్న నినాదం ఏమైందని శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికర్ ప్రశ్నించారు. ఇది "అపవిత్ర కూటమి" అని ఆయన మండిపడ్డారు. మరోవైపు, అంబర్‌నాథ్‌ను అవినీతి రహితంగా మార్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని స్థానిక బీజేపీ నేతలు సమర్థించుకుంటున్నారు. మొత్తానికి అంబర్‌నాథ్ ఎపిసోడ్ మహారాష్ట్రలోని 'మహాయుతి' కూటమిలో అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.