త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Fraud | సోదరుడి వాయిస్‌తో ఫోన్‌ కాల్‌.. ఉపాధ్యాయురాలికి టోకరా..!

Cyber  Fraud | ఆధునిక యుగంలో రోజురోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హవా కొనసాగుతున్నది. అదే సమయంలో సైబర్‌ నేరాలు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నిత్యం ఎక్కడో చోట ఎంతో మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటూనే ఉన్నారు.

P

National | Published On Jan 13, 2026, 7.05 am IST

Cyber Fraud | సోదరుడి వాయిస్‌తో ఫోన్‌ కాల్‌.. ఉపాధ్యాయురాలికి టోకరా..!
Advertisement
  • ఏఐ వాయిస్‌ క్లోనింగ్‌ ఉపయోగించి మోసం
  • ఫ్రెండ్‌ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాడంటూ రూ.లక్ష లూటీ
  • అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..

Cyber  Fraud | ఆధునిక యుగంలో రోజురోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హవా కొనసాగుతున్నది. అదే సమయంలో సైబర్‌ నేరాలు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తున్నది. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. నిత్యం ఎక్కడో చోట ఎంతో మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటూనే ఉన్నారు. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఏదో విధంగా సైబర్‌ నేరగాళ్లు జనాలను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. తాజాగా ఏఐ వాయిస్‌ మాడ్యులేషన్‌ టెక్నాలజీని ఉపయోగించి ఓ ఉపాధ్యాయురాలికి టోకరా వేశారు.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది. ఆమెకు ఓ కాల్‌ వచ్చింది. ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడగా సోదరుడి వాయిస్‌ వినిపించింది. వాయిస్‌లో ఎక్కడా తేడా లేకపోవడంతో ఆమె తన తమ్ముడిగానే భావించింది. తన స్నేహితుడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాడని, అతనికి సహాయం కావాలని కోరాడు. తమ్ముడు చెప్పింది విని ఆమె భావోద్వేగానికి గురై అతను చెప్పిన అకౌంట్‌కు రూ.లక్ష బదిలీ చేసింది. కొంత సేపటి తర్వాత మహిళ తన సోదరుడికి మళ్లీ ఫోన్‌ చేసి వివరాలు మళ్లీ ఆరా తీసే ప్రయత్నం చేసింది. అప్పుడు తనకు కాల్‌ వచ్చింది సోదరుడి నుంచి కాదని, సైబర్‌ నేరగాళ్ల బారినపడ్డానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఏఐతో వాయిస్‌ క్లోనింగ్‌ని ఉపయోగించి ఒక వ్యక్తి వాయిస్‌ను సృష్టించవచ్చని.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న టూల్స్‌ సహాయంతో కొద్ది సెకన్లలోనే వాయిస్‌ను తయారు చేయొచ్చని సైబర్‌ నిపుణులు పేర్కొంటున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికైనా గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను పట్టించుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు పంపే ముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని చెప్పారు. ఇలాంటి కాల్స్‌ వస్తే మొదట తమ వద్ద ఉన్న మొబైల్‌ నంబర్‌కు కాల్‌ చేయాలని, కుటుంబంలోని వ్యక్తులు సీక్రెట్‌ కోడ్‌ను వాడాలని.. అత్యవసర పరిస్థితుల్లో కాల్‌ చేసిన వ్యక్తిని కోడ్‌ అడగాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఎవరైనా సీక్రెట్‌ కోడ్‌ చెప్పకపోతే ఫేక్‌ కాల్‌గా భావించాలని చెబుతున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రొఫైల్‌ను లాక్‌ చేయాలని, అపరిచితులకు మీ ఫొటోలు, వీడియోలు చూసేందుకు యాక్సెస్‌ ఇవ్వొద్దని సూచిస్తున్నారు. వీడియోలో ఉన్న మీ వాయిస్‌ నేరగాళ్లకు ఆయుధంగా మారుతుందన్నారు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో తమ కుటుంబీకులు ఫోన్‌ చేస్తే వారిని గుర్తు పట్టేందుకు.. వారికి సంబంధించిన ఏవైనా ప్రశ్నలు కానీ, చిన్ననాటి విషయాలు కానీ, నిన్న ఇంట్లో ఏం వడుకున్నావ్‌.. నీకు ఇష్టమైంది ఏంటీ? ఇలా వ్యక్తిగత ప్రశ్నలు అడగాలని సూచించారు. సైబర్‌ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ 1930కి కాల్‌ చేయాలని చెప్పారు. లేదంటే www.cybercrime.gov.inలో మీ ఫిర్యాదు చేయడంతో పాటు ఆ వివరాలను బ్యాంకుకు సైతం తెలియజేయాలని.. దాంతో లావాదేవీలను రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. డిజిటల్‌ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement