త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gujarat Fire | అహ్మదాబాద్‌లో ప‌టాకులు ఫ్యాక్ట‌రీలో ప్ర‌మాదం.. ఎనిమిది మంది మృతి.. పీఎం మోదీ సంతాపం

Gujarat Fire | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెహ్మద్‌పురా ప్రాంతంలోని ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, భారీ పేలుడు జ‌రిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది గాయ‌ప‌డ్డారు. మెహ్మద్‌పురాలో ఉన్న టాలెంట్ ఫైర్‌వర్క్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.

P

National | Published On Jul 18, 2026, 6.57 pm IST

Gujarat Fire | అహ్మదాబాద్‌లో ప‌టాకులు ఫ్యాక్ట‌రీలో ప్ర‌మాదం.. ఎనిమిది మంది మృతి.. పీఎం మోదీ సంతాపం
Advertisement

Gujarat Fire | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెహ్మద్‌పురా ప్రాంతంలోని ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, భారీ పేలుడు జ‌రిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది గాయ‌ప‌డ్డారు. మెహ్మద్‌పురాలో ఉన్న టాలెంట్ ఫైర్‌వర్క్స్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. కర్మాగారంలో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలకు మంటలు అంటుకోవడంతో పేలుళ్లు జ‌రిగాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక్క‌సారిగా భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప్రమాదం తర్వాత కర్మాగార‌ చుట్ట‌ప‌క్క‌ల భారీగా పొగ క‌మ్మేసింది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియ‌రాలేదు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఐదు కంటే ఎక్కువ ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

జేపీసీ క్రైమ్ బ్రాంచ్ అధికారి శరద్ సింఘాల్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో 15 మంది పనిచేస్తున్నారని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ ఫ్యాక్టరీ ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనపై బీఎన్ఎస్‌లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులను ఎవరినీ వదిలిపెట్టబోమని అధికారులు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఫ్యాక్ట‌రీని ఎలా నిర్వ‌హిస్తున్నారు? అన్న కోణంలో విచారిస్తున్న‌ట్లుగా పోలీసు వ‌ర్గాలు తెలిపాయి. అయితే, ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌ధాన‌మంత్రి జాతీయ నిధి నుంచి ఒక్కొక్క‌రికి రూ.2ల‌క్ష‌లు ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు రూ.20వేల స‌హాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు.

Advertisement
Advertisement