త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Right Time to Add Ginger in Tea | టీలో అల్లం ఎప్పుడు వేయాలి? అల్లం టీ తాగితే కలిగే ప్రయోజనాలేంటి?

అల్లం టీ ఇష్టపడని వారుండరు. ఇది రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే టీలో అల్లం ఎప్పుడు వేస్తే దాని పూర్తి సారం మనకు అందుతుంది? రోజుకు ఎన్ని కప్పుల అల్లం టీ తాగొచ్చు? ఇమ్యూనిటీ పెంచే అల్లం టీ తయారీ విధానం, లాభాలు, నష్టాలు తెలుసుకుందాం రండి.

J

Lifestyle | Published On Feb 26, 2026, 6.43 pm IST

Right Time to Add Ginger in Tea | టీలో అల్లం ఎప్పుడు వేయాలి? అల్లం టీ తాగితే కలిగే ప్రయోజనాలేంటి?
Advertisement

Right Time to Add Ginger in Tea | త్రినేత్ర.న్యూస్ : ఉదయం నిద్ర లేవగానే లేదా సాయంత్రం వేళ అలసటగా ఉన్నప్పుడు వేడివేడిగా ఒక కప్పు అల్లం టీ పడితే ఆ కిక్కే వేరు. అల్లం టీ కేవలం మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం కలిగించడంలో దీనికి సాటి లేదు. అయితే, చాలామందికి అల్లం టీలో అల్లం సరిగ్గా ఏ సమయంలో వేయాలి? రోజుకు ఎన్నిసార్లు తాగాలి? అనే సందేహాలు ఉంటాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇమ్యూనిటీకి బూస్ట్

అల్లంలో 'జింజరాల్' (Gingerol) అనే సమ్మేళనంతో పాటు మరికొన్ని శక్తివంతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే అల్లంతో చేసే టీని క్రమం తప్పకుండా తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి (Immunity) అమాంతం మెరుగుపడుతుంది.

జీర్ణానికి మేలు.. జలుబు, దగ్గుకి చెక్

అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ (Digestion) మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇన్‌ఫ్లమేషన్ (వాపులు) ను తగ్గిస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడేవారికి అల్లం టీ ఒక న్యాచురల్ మెడిసిన్‌లా పని చేసి మంచి రిలీఫ్ ఇస్తుంది.

అల్లం టీ పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేయాలి? టీలో అల్లం ఎప్పుడు వేయాలి?

అల్లం టీ పూర్తి ప్రయోజనాలు దక్కాలంటే దాన్ని సరైన పద్ధతిలో తయారు చేయడం ముఖ్యం. ముందుగా గిన్నెలో నీటిని మరిగించి.. అందులో టీ పొడి వేయాలి. డికాషన్ మరుగుతున్నప్పుడు.. అల్లాన్ని కాస్త దంచి లేదా తురిమి అందులో వేయాలి. అల్లం సారం ఆ టీలో బాగా కలిసేలా మరిగించాలి. ఆ తర్వాతే ఆ టీలో పాలు పోయాలి. రుచికి సరిపడా చక్కెర లేదా బెల్లం వేసి కాస్త మరిగించాలి. కావాలంటే కాస్త పసుపు కూడా వేసుకోవచ్చు.

పాల కంటే ముందు మరుగుతున్న నీటిలోనే (డికాషన్) అల్లం వేసి మరిగించడం చాలా మేలు. పాలు ముందే పోసేసి ఆ తర్వాత అల్లం వేస్తే.. పాలు కాస్త విరిగినట్లుగా అనిపించొచ్చు, రుచి కూడా పాడవుతుంది.

ఎప్పుడు తాగొచ్చు? ఎంత తాగాలి?

అల్లం టీని ఉదయం, సాయంత్రం పూట తాగడం ఉత్తమం. రోజుకు గరిష్టంగా మూడు సార్ల వరకు ఈ టీని తీసుకోవచ్చు.

అతిగా తాగితే వచ్చే చిక్కులు ఇవే..

అల్లం టీ ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకు మించి తాగకూడదు. రోజులో మూడు కప్పులకు మించి అతిగా తాగితే.. ఎసిడిటీ (Acidity), కడుపులో మంటగా అనిపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మితంగా తాగి అల్లం టీ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

Advertisement
Advertisement