త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Walking | భోజ‌నం చేశాక 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఎన్నో లాభాలు.. తేల్చి చెబుతున్న నిపుణులు..

Walking | చాలా మంది భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల బరువు పెరుగుతుందని నమ్ముతారు. ఇందులో కొంతవరకు నిజం ఉన్నప్పటికీ, భోజనం చేసిన తర్వాత నడవ‌డం వ‌ల్ల‌ కేవలం బరువు తగ్గడానికే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

S

Lifestyle | Published On Mar 9, 2026, 1.29 pm IST

Walking | భోజ‌నం చేశాక 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఎన్నో లాభాలు.. తేల్చి చెబుతున్న నిపుణులు..
Advertisement

Walking | చాలా మంది భోజనం చేసిన వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల బరువు పెరుగుతుందని నమ్ముతారు. ఇందులో కొంతవరకు నిజం ఉన్నప్పటికీ, భోజనం చేసిన తర్వాత నడవ‌డం వ‌ల్ల‌ కేవలం బరువు తగ్గడానికే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఎప్పుడైనా నడక ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు మితమైన వేగంతో నడక సాగించ‌డం మొత్తం ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఈ అలవాటును పోస్ట్‌ప్రాండియల్ వాక్ అని కూడా అంటారు. భోజనం తర్వాత కేవలం 10 నిమిషాలు వాకింగ్‌ చేయడం జీర్ణక్రియ, బరువు నియంత్రణ, మానసిక స్థితి, గుండె ఆరోగ్యం వంటి అనేక అంశాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. కాబట్టి భోజనం తర్వాత కొద్దిసేపు న‌డ‌వ‌డం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

గ్లూకోజ్ స్థాయిల నియంత్ర‌ణ‌కు..

భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేయ‌డం వ‌ల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీర కదలిక వల్ల పొట్ట‌, ప్రేగులు చురుకుగా పనిచేస్తాయి. దీంతో ఆహారం జీర్ణక్రియ వ్యవస్థలో వేగంగా కదులుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు న‌డక‌ సహాయపడుతుంది. భోజనం తర్వాత కొద్దిసేపు నడక వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. నడక వల్ల కండరాలు గ్లూకోజ్‌ను ఇంధనంగా వినియోగిస్తాయి. దీంతో భోజనం తర్వాత అకస్మాత్తుగా పెరిగే బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించవచ్చు. కేవలం 2 నుంచి 5 నిమిషాల తేలికపాటి కదలిక కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కార్బొహైడ్రేట్లు ఎక్కువగా తీసుకున్న తర్వాత ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

మాన‌సిక ఆరోగ్యానికి..

భోజ‌నం త‌రువాత వాకింగ్ బరువు నియంత్రణకు సహాయపడుతుంది. జిమ్‌లో చేసే వ్యాయామంతో పోలిస్తే తక్కువ కాలరీలు ఖర్చవుతున్నప్పటికీ, ప్రతి భోజనం తర్వాత నడక వల్ల శరీరంలో కాలరీల లోటు కొనసాగుతుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత మ‌ళ్లీ తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో ఈ చిన్న ప్రయత్నాలు బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే మానసిక స్థితి మెరుగుపడుతుంది. నడక సమయంలో శరీరం ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరుస్తాయి. అలాగే సెరొటోనిన్ స్థాయిలు పెరగడంతో కార్టిసోల్ తగ్గుతుంది. దీంతో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. భారమైన భోజనం చేసిన తర్వాత వచ్చే అసౌకర్యం లేదా భావోద్వేగాలతో తినే అలవాటును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం కోసం..

తిన్న త‌రువాత న‌డ‌వ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నడక వంటి తేలికపాటి శారీరక కదలిక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ట్రైగ్లిజ‌రైడ్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఈ సాధారణ అలవాటు దీర్ఘకాలిక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అలాగే మంచి నిద్రకు సహాయపడుతుంది. తేలికపాటి నడక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మంచి నిద్రకు దోహదపడుతుంది. సాయంత్రం సమయంలో కొద్దిసేపు నడక వ‌ల్ల శరీరంలోని సర్కేడియన్ రిథమ్‌ను సమతుల్యం చేస్తుంది. దీంతో త్వరగా నిద్రపోవడం, నిద్ర కొనసాగడం సులభమవుతుంది. మంచి నిద్ర మొత్తం ఆరోగ్యానికి అత్యంత అవసరం.

జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్‌..

న‌డ‌క వ‌ల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్‌) లేదా తరచూ కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవారికి భోజనం తర్వాత 10 నుంచి 15 నిమిషాల నడక వ‌ల్ల జీర్ణ సంబంధ అసౌకర్యాన్ని తగ్గించడంలో మందులకన్నా కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అలవాటును పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మంచి ఫలితాల కోసం కొన్ని సూచనలు కూడా పాటించాలి. రక్తంలో చక్కెర నియంత్రణకు భోజనం ముగిసిన వెంటనే లేదా గరిష్టంగా 30 నుంచి 60 నిమిషాల లోపు నడక ప్రారంభించడం మంచిది. ఈ సమయంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

ఈ సూచ‌న‌లు పాటించాలి..

తక్కువ నుంచి మితమైన వేగంతో నడవాలి. భోజనం చేసిన వెంటనే తీవ్రమైన వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పొట్ట‌ నుంచి కండరాలకు మళ్లి జీర్ణ‌ సమస్యలు లేదా యాసిడ్ రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి భోజనం తర్వాత కేవలం 10 నుంచి 15 నిమిషాలు నడక సాగిస్తే సరిపోతుంది. కొంతమందికి భోజనం చేసిన వెంటనే నడిచేటప్పుడు స్వల్ప జీర్ణ‌ అసౌకర్యం కలిగే అవ‌కాశాలు ఉంటాయి. ఇది తీసుకున్న ఆహారంపై శారీరక కదలిక ప్రభావం వల్ల జరుగుతుంది. అలాంటి సమస్యలు ఉంటే భోజనం తర్వాత 10 నుంచి 15 నిమిషాలు వేచి చూసి తర్వాత నడక ప్రారంభించడం మంచిది. అలాగే నడక వేగం మృదువుగా ఉండాలి. ఈ అలవాటును రోజువారీ జీవనశైలిలో చేర్చుకుంటే మొత్తం ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. కాబట్టి ఇక‌పై భోజనం పూర్తయ్యాక ఫోన్ తీసుకోవడానికి బదులు కొద్దిసేపు నడక సాగించ‌డం మంచిది.

Advertisement
Advertisement