త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Breakfast Timing | బ్రేక్‌ఫాస్ట్ మానేసి నేరుగా లంచ్ చేస్తే.. మ‌ర‌ణ ముప్పు 29 శాతం అధికం.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

Breakfast Timing | ఉదయం అల్పాహారం ఆలస్యంగా చేయడం, అర్ధరాత్రి తర్వాత రాత్రి భోజనం చేయడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయ‌ని 31 వేల మందిపై నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తొలి భోజనం చేసేవారిలో మరణ ముప్పు 29 శాతం అధికంగా ఉండగా, హృదయ సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదం 46 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

S

Lifestyle | Published On Nov 25, 2026, 1.45 pm IST

Breakfast Timing | బ్రేక్‌ఫాస్ట్ మానేసి నేరుగా లంచ్ చేస్తే.. మ‌ర‌ణ ముప్పు 29 శాతం అధికం.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..
Advertisement

Breakfast Timing | ఉదయం అల్పాహారం ఆలస్యంగా చేయడం, అర్ధరాత్రి తర్వాత రాత్రి భోజనం చేయడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయ‌ని 31 వేల మందిపై నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తొలి భోజనం చేసేవారిలో మరణ ముప్పు 29 శాతం అధికంగా ఉండగా, హృదయ సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదం 46 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఆల‌స్యంగా భోజనం చేస్తే మ‌ర‌ణ ముప్పు ఎక్కువే..

రోజువారీ ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం చూపుతాయో మరో అధ్యయనం వెల్లడించింది. ఉదయం అల్పాహారం ఆలస్యంగా చేయడం, రాత్రి భోజనాన్ని అర్ధరాత్రి తర్వాత తీసుకోవడం వల్ల మరణ ముప్పు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 1999 నుంచి 2018 మధ్య అమెరికా జాతీయ ఆరోగ్య సర్వేలో పాల్గొన్న 40 ఏళ్లు పైబడిన 31 వేల మందికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించారు. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య తొలి భోజనం చేసేవారితో పోలిస్తే మధ్యాహ్నం 12 గంటల తర్వాత మొదటి భోజనం చేసేవారిలో మరణ ముప్పు 29 శాతం అధికంగా ఉన్నట్లు తేలింది. హృదయ సంబంధిత వ్యాధుల కారణంగా మరణించే ప్రమాదం ఏకంగా 46 శాతం పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య అల్పాహారం చేసేవారిలో మరణ ముప్పు 10 శాతం, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య చేసేవారిలో 19 శాతం అధికంగా నమోదైంది.

రాత్రి భోజ‌నం విష‌యంలోనూ ఇలాగే..

రాత్రి భోజనం విషయంలోనూ ఇలాంటి ధోరణి కనిపించింది. రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేసేవారిలో మరణ ముప్పు పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత భోజనం చేసేవారిలో మరణ ప్రమాదం 27 శాతం అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. 50 ఏళ్ల వయసులో వీరి అంచనా జీవితకాలం కూడా 2.35 సంవత్సరాలు తక్కువగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. అయితే రాత్రి 7 గంటలలోపు భోజనం చేసేవారిలోనూ 13 శాతం అధిక మరణ ముప్పు నమోదైనట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు గత 24 గంటల్లో తీసుకున్న ఆహారం, పానీయాలు, వాటిని తీసుకున్న సమయాలను నమోదు చేశారు. అనంతరం 2019 చివరి వరకు వారి మరణాల వివరాలను పరిశీలించారు. సగటున 8.6 సంవత్సరాల పరిశీలనా కాలంలో 7,129 మంది మరణించగా, వారిలో 2,259 మరణాలు హృదయ సంబంధిత వ్యాధులతో ముడిపడి ఉన్నాయి.

నిపుణులు ఏం చెబుతున్నారు..?

అయితే ఆలస్యంగా అల్పాహారం చేయడం లేదా అర్ధరాత్రి తర్వాత భోజనం చేయడం వల్లే నేరుగా మరణ ముప్పు పెరుగుతుందని ఈ అధ్యయనం నిరూపించలేదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఇది కేవలం ఆహారపు అలవాట్లు, మరణాల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించిన పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమే. నిద్రలేమి, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు, రాత్రి షిఫ్టుల్లో పనిచేయడం, ఇతర జీవనశైలి అలవాట్లు కూడా ఈ ఫలితాలపై ప్రభావం చూపి ఉంటాయ‌ని తెలిపారు. అలాగే పాల్గొన్నవారి ఆహారపు అలవాట్లను ప్రధానంగా ఒక్కరోజు తీసుకున్న ఆహార వివరాల ఆధారంగానే అంచనా వేయడం వల్ల దీర్ఘకాలిక ఆహారపు అలవాట్లను పూర్తిగా ప్రతిబింబించవని పరిశోధకులు వివరించారు.

Advertisement
Advertisement