త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amir Hamza Shot in Lahore | లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై లాహోర్‌లో కాల్పులు.. పరిస్థితి విషమం

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ 'లష్కరే తోయిబా' (LeT) సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై లాహోర్‌లో గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

J

International | Published On Apr 16, 2026, 8.43 pm IST

Amir Hamza Shot in Lahore | లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై లాహోర్‌లో కాల్పులు.. పరిస్థితి విషమం

సంక్షిప్త సారాంశం

లాహోర్‌లోని ఓ న్యూస్ ఛానల్ ఆఫీస్ ముందు లష్కరే తోయిబా కీలక నేత అమీర్ హమ్జాపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. గత ఏడాది మే నెలలో కూడా హమ్జా ఇంటి ముందు ఇలాగే కాల్పులు జరిగాయి. ఈ దాడి తర్వాత అతడికి భద్రత పెంచారు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హాఫీజ్ సయీద్‌తో కలిసి 1985-86 సమయంలో లష్కరే తోయిబా సంస్థను స్థాపించాడు. 2005లో బెంగళూరులోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)'పై జరిగిన ఉగ్రదాడికి ఇతడే ప్రధాన సూత్రధారి అని భావిస్తున్నారు. కాశ్మీర్ వెలుపల జరిగిన అతిపెద్ద లష్కరే దాడుల్లో ఇదొకటి.

Advertisement

Amir Hamza Shot in Lahore | త్రినేత్ర.న్యూస్ : పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో మరో ఉగ్రవాదిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ 'లష్కరే తోయిబా' (LeT) సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన అమీర్ హమ్జా (66)పై కాల్పులు జరిగాయి. లాహోర్‌లోని ఒక న్యూస్ ఛానెల్ కార్యాలయం బయట దుండగులు అతడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన హమ్జాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హమ్జాపై ఇలా దాడి జరగడం ఏడాది వ్యవధిలో ఇది రెండోసారి. గత ఏడాది మే నెలలో కూడా లాహోర్‌లోని అతడి నివాసం వద్దే గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన అతనికి, ఆ తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం భద్రతను మరింత పెంచినట్లు వార్తలు వచ్చాయి.

ఎవరీ అమీర్ హమ్జా?

మే 10, 1959న పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాన్‌వాలాలో జన్మించిన హమ్జా.. అఫ్గాన్ జిహాద్‌లో చురుగ్గా పాల్గొన్నాడు. 1985-86 ప్రాంతంలో మరో ఉగ్రవాది హాఫీజ్ సయీద్‌తో కలిసి 'లష్కరే తోయిబా'ను స్థాపించాడు. లష్కరేలో సయీద్ తర్వాత అత్యంత కీలకమైన, రెండో అతిపెద్ద నాయకుడిగా హమ్జాకు పేరుంది.

లష్కరే అనుబంధ సంస్థలు, చారిటబుల్ ట్రస్టులు, యూనివర్సిటీ ట్రస్టులకు సంబంధించి హమ్జా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. ఉగ్రవాద సంస్థ కోసం నిధులు సేకరించడం, యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లించడం, సంస్థ ప్రచార విభాగాలను చూసుకోవడం ఇతడి ప్రధాన పనులు.

భారత్‌లో ఉగ్రదాడులకు సూత్రధారి

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఉగ్రవాద కార్యకలాపాలతో హమ్జాకు సంబంధాలు ఉన్నాయి. 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) ప్రాంగణంలో జరిగిన ఉగ్రదాడికి హమ్జా ప్రధాన వ్యూహకర్త అని భారత దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. కాశ్మీర్ వెలుపల లష్కరే తోయిబా చేసిన తొలి అతిపెద్ద దాడుల్లో బెంగళూరు దాడి ఒకటి.

పుస్తకాలు, పత్రికలతో ప్రచారం

లష్కరే తోయిబా భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో హమ్జా అత్యంత చురుగ్గా వ్యవహరించేవాడు. తన ఉపన్యాసాలతో యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించేవాడు. ఉగ్ర సంస్థకు చెందిన వీక్లీ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా పనిచేస్తూ ఎన్నో వ్యాసాలు రాశాడు. 2022లో 'ఖాఫిలా దావత్ ఔర్ షహదత్' అనే పుస్తకంతో పాటు మరికొన్ని ఉగ్రవాద భావజాల పుస్తకాలను రచించాడు.

అయితే, 2018లో లష్కరే ఫైనాన్షియల్ సంస్థలపై (జమాత్-ఉద్-దావా, ఫలాహ్-ఏ-ఇన్సానియత్ తదితర) గ్లోబల్ ఆంక్షలు విధించడంతో.. హమ్జా తెలివిగా మాతృ సంస్థ నుంచి దూరమయ్యాడు. ఆ తర్వాత 'జైష్-ఏ-మంఖఫా' పేరుతో ఒక కొత్త గ్రూపును ప్రారంభించి కాశ్మీర్ కేంద్రంగా నిధుల సేకరణ, ఉగ్రవాద ప్రచార కార్యక్రమాలను సాగించినట్లు సమాచారం.

ఉగ్రవాద సంస్థలకు నిధుల సమీకరణ, రిక్రూట్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన అమీర్ హమ్జాను.. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ కూడా గ్లోబల్ టెర్రరిస్ట్‌ (Global Terrorist) జాబితాలో చేర్చింది.

Advertisement
Advertisement