త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Israel War 2026 | భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. టెహ్రాన్ ప్రతిదాడి

పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్, ఇరాన్‌లలో ఉన్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.

J

International | Published On Feb 28, 2026, 8.51 pm IST

Iran Israel War 2026 | భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. టెహ్రాన్ ప్రతిదాడి
Advertisement
  • ఇరాన్ క్షిపణుల వర్షం
  • యూఏఈ, ఖతార్, సౌదీలో భారీ పేలుళ్లు
  • ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ
  • 30కి పైగా లక్ష్యాలపై దాడులు

Iran Israel War 2026 | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియా మరోసారి తీవ్ర యుద్ధ వాతావరణంలో చిక్కుకుంది. అణు అంశంపై ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు చివరకు యుద్ధానికి దారితీశాయి. అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ శనివారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై దాడులు చేసింది. పెంటగాన్ ఈ దాడులకు "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" అని ఇజ్రాయెల్, "ఆపరేషన్ రోరింగ్ లయన్" అని నామకరణం చేశాయి. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో దౌత్యపరమైన పరిష్కారాల ఆశలు సన్నగిల్లి, మరోసారి తీవ్ర సైనిక ఘర్షణ మొదలైంది. శనివారం తెల్లవారుజామున టెహ్రాన్‌తో సహా పలు ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి.

https://x.com/flightradar24/status/2027647279897760138

ఖమేనీ లక్ష్యంగా దాడులు

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయం, ఇరాన్ అధ్యక్షుడి నివాసంతో సహా దాదాపు 30కి పైగా కీలక సైనిక, ప్రభుత్వ, అణు స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. దాడుల సమాచారంతో ఖమేనీని ముందస్తుగానే సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను సమర్థిస్తూ, ఇరాన్ దీర్ఘశ్రేణి క్షిపణుల ముప్పును అరికట్టడానికే ఈ ఆపరేషన్ అని తెలిపారు. "ఆయుధాలు వదలండి లేదా చావును ఎదుర్కోండి" అని ఆయన ఇరాన్ దళాలను హెచ్చరించారు. ఇరాన్ వల్ల ఉన్న "అస్తిత్వ ముప్పును" తొలగించడానికే ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.

https://x.com/KnightsOSINT/status/2027649521191158012

ఈ సంయుక్త దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ మహ్మద్ పాక్‌పూర్ మృతి చెందాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షీపణుల వర్షం కురిపించింది. తమ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ ఈ క్షిపణులను అడ్డుకుంటోందని, దేశవ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయని ఇజ్రాయెల్ మిలిటరీ ఎక్స్ వేదికగా తెలిపింది.

పాఠశాలపై దాడి.. 40 మంది విద్యార్థినుల మృతి

ఈ దాడుల్లో అత్యంత విషాదకర ఘటన దక్షిణ ఇరాన్‌లోని హార్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. మినాబ్ నగరంలోని 'షజారే తయ్యెబే' ప్రాథమిక బాలికల పాఠశాలపై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో కనీసం 40 మంది విద్యార్థులు మరణించారు, మరో 45 మంది గాయపడ్డారు. ఈ ప్రాంతంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్థావరం ఉండటంతో ఈ దాడులు జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇరాన్ ప్రతీకారం: గల్ఫ్ దేశాల్లో దాడులు

తమపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్, దాని మిత్ర పక్షాలైన హెజ్‌బొల్లా, హౌతీలు కలిసి తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగాయి. ఇజ్రాయెల్‌తో పాటు ఖతార్‌లోని అల్ ఉదీద్, కువైట్‌లోని అల్ సలేమ్, యూఏఈలోని అల్ దఫ్రా, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అబుదాబిలోని అల్ దఫ్రా ఎయిర్ బేస్, దోహాలోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్‌లను అమెరికా బలగాలు ఉపయోగిస్తున్నాయి. అబుదాబి, దుబాయ్‌లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. క్షిపణి శకలాలు పడి యూఏఈలో ఒకరు మరణించారు. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను, కార్యాలయాలను మూసివేసి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆసుపత్రుల్లోని రోగులను, శస్త్రచికిత్సలను అండర్‌గ్రౌండ్ బంకర్లకు తరలించారు. దుబాయ్‌లో కూడా పేలుళ్లు జరిగినట్లు అల్ జజీరా నివేదించింది. దీంతో గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. బెహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరగడంతో అక్కడ ఎమర్జెన్సీ సైరన్లు మోగాయి.

ట్రంప్ సంచలన ప్రకటన: "ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి"

టెహ్రాన్‌పై దాడులు జరిగిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌లో "మేజర్ కంబాట్ ఆపరేషన్స్" ప్రారంభించినట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఇరాన్ నుంచి అమెరికన్లను రక్షించడమే తమ లక్ష్యమన్నారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. "బయట చాలా ప్రమాదకరంగా ఉంది. ఎక్కడబడితే అక్కడ బాంబులు పడతాయి. ఇళ్లలోనే ఉండండి. మా పని పూర్తయ్యాక, మీ ప్రభుత్వాన్ని మీరే చేజిక్కించుకోండి. ఇన్నేళ్లుగా అమెరికా సాయం కోరారు, ఇప్పుడు నేను మీకు అండగా ఉన్నాను" అని పిలుపునిచ్చారు.

ఇజ్రాయెల్ ప్రధాని ఏమన్నారంటే..

ఇరాన్ వల్ల పొంచి ఉన్న ముప్పును తొలగించేందుకే ఈ సంయుక్త దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఈ దాడులు ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకునే పరిస్థితులను సృష్టిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌లో ఇంటర్నెట్ బంద్.. భారీ క్యూలు

దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో దాదాపు పూర్తిగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పెట్రోల్ బంకుల వద్ద జనాలు బారులు తీరారు. సురక్షిత ప్రాంతాల కోసం ప్రజలు నగరాలను వీడి వెళ్తున్నారు. ఇరాన్‌లోని ఓ పాఠశాలపై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో 24 మంది విద్యార్థులు మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

భారతీయులకు ఎంబసీ హెచ్చరిక

పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్, ఇరాన్‌లలో ఉన్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ (+972-54-7520711), ఈమెయిల్ (cons1.telaviv@mea.gov.in) ను కూడా విడుదల చేసింది.

అంతర్జాతీయ సమాజం స్పందన

రష్యా ఖండన: అమెరికా-ఇజ్రాయెల్ దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది పశ్చిమాసియాను వినాశనం వైపు నెడుతుందని, వెంటనే దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేసింది. ఐక్యరాజ్యసమితి సైతం అన్ని పక్షాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఈ దాడులను స్వతంత్ర దేశంపై జరిగిన 'కవ్వింపు లేని సాయుధ దురాక్రమణ'గా రష్యా అభివర్ణించింది.

లెబనాన్: తాము ఈ యుద్ధంలోకి లాగబడటానికి అంగీకరించబోమని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్ స్పష్టం చేశారు.

మధ్యవర్తిత్వానికి ఇండోనేషియా సిద్ధం: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో ప్రకటించారు.

పాకిస్థాన్: ఇరాన్‌పై దాడులను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. వెంటనే దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాలని కోరింది.

విమాన సర్వీసులు రద్దు.. అంతర్జాతీయ స్పందన

దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB), అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ (DWC) విమానాశ్రయాల్లో కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో సహా పలు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ తమ సర్వీసులను రద్దు చేశాయి.

Advertisement
Advertisement