త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shooting in Canada | కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయుల దుర్మరణం

Shooting in Canada | కెనడాలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు కాల్పులకు బలయ్యారు. బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే నగరంలో వాల్‌మార్ట్‌ స్టోర్‌ వెలుపల ఈ నెల 15న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన గగన్‌ప్రీత్‌ (గారీ) రేహల్‌ (23), సుఖ్‌జీత్‌ కౌర్‌ (24) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

P

International | Published On Nov 21, 2026, 6.44 pm IST

Shooting in Canada | కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయుల దుర్మరణం
Advertisement
  • వాల్‌మార్ట్‌ స్టోర్‌ బయట పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులు
  • మృతులు గగన్‌ప్రీత్‌ రేహల్‌, సుఖ్‌జీత్ కౌర్‌గా గుర్తింపు
  • పక్కా ప్రణాళికతోనే దాడి.. ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కోణంలో దర్యాప్తు
  • ఘటనాస్థలికి సమీపంలో దగ్ధమైన కారు..
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు

Shooting in Canada | కెనడాలో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు కాల్పులకు బలయ్యారు. బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే నగరంలో వాల్‌మార్ట్‌ స్టోర్‌ వెలుపల ఈ నెల 15న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దుండగులు పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన గగన్‌ప్రీత్‌ (గారీ) రేహల్‌ (23), సుఖ్‌జీత్‌ కౌర్‌ (24) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని, పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌తో సంబంధం ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

లక్ష్యంగా చేసుకునే కాల్పులు

పోలీసుల ఇంటిగ్రేటెడ్‌ హోమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (ఐహెచ్‌ఐటీ) మృతులను గగన్‌ప్రీత్‌ రేహల్‌, సుఖ్‌జీత్‌ కౌర్‌గా గుర్తించింది. వీరిద్దరూ సమీపంలోని డెల్టా టౌన్‌షిప్‌లో నివసిస్తున్నట్లు వెల్లడించింది. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. గగన్‌ప్రీత్‌ గతంలో ఆయుధాలకు సంబంధించిన కేసుల్లో పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. సుఖ్‌జీత్‌కు కెనడాలో పరిచయాలు చాలా తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఈ ఘటనను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడిగా పోలీసులు భావిస్తున్నారు. ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌తో సంబంధాలున్నాయా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. అయితే దాడికి పాల్పడినవారు ఎవరన్నది, బాధితులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నది ఇంకా వెల్లడించలేదు.

ఘటనాస్థలికి సమీపంలో కారు దగ్ధం

కాల్పుల ఘటనకు సంబంధించి మరో కీలక ఆధారంగా దగ్ధమైన కారును పోలీసులు గుర్తించారు. రాత్రి 10.51 గంటలకు ఘటనాస్థలికి సమీపంలో ఓ కారు దగ్ధమైనట్లు సమాచారం అందింది. ఈ వాహనానికి కాల్పుల ఘటనతో సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఈ కారును ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. కారు పూర్తిగా దగ్ధమవడంతో దాని ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఐహెచ్‌ఐటీ అధికారి సార్జెంట్‌ ఫ్రీడా ఫాంగ్‌ మాట్లాడుతూ.. కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. దాడికి గల కారణాలు, నిందితుల వివరాలు, బాధితులను లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. దగ్ధమైన కారు సహా ఘటనకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement