త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bangkok | బ్యాంకాక్ టూర్‌కి ప్లాన్ చేస్తున్నారా? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి

48 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ మునిగిపోయింది. నగరవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించగా, ఎయిర్‌పోర్టులకు వెళ్లే ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ అయింది.

J

International | Published On Sep 26, 2026, 8.21 pm IST

Bangkok | బ్యాంకాక్ టూర్‌కి ప్లాన్ చేస్తున్నారా? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి

సంక్షిప్త సారాంశం

రెండ్రోజుల్లోనే దాదాపు 300 మి.మీ వర్షపాతం నమోదు కావడంతో బ్యాంకాక్‌లోని మొత్తం 50 జిల్లాలను డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు. నడుము లోతు నీటిలో ప్రధాన రహదారులు మునిగిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రజల కోసం 200 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సువర్ణభూమి, డాన్ ముయాంగ్ విమానాశ్రయాలు నడుస్తున్నప్పటికీ, పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డు మార్గాలకు బదులు రైల్వే లింక్‌లు వాడాలని సూచించారు. సహాయం కోసం థాయ్ టూరిస్ట్ హెల్ప్‌లైన్లు 1155, 1672 అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించారు.

Advertisement
  • వరద గుప్పిట్లో బ్యాంకాక్
  • నగరవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటన
  • విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు కీలక సూచనలు

Bangkok | త్రినేత్ర న్యూస్ : తీవ్ర అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 48 గంటల్లోనే దాదాపు 300 మిల్లీమీటర్ల మేర కుండపోత వర్షం కురవడంతో నగరం మొత్తం జలమయమైంది. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో బ్యాంకాక్ గవర్నర్ చద్‌చర్ట్ సిట్టిపుంట్ (Chadchart Sittipunt) నగరంలోని మొత్తం 50 జిల్లాలను ‘డిజాస్టర్ జోన్’ (విపత్తు ప్రాంతం)గా ప్రకటిస్తూ అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రధాన రహదారులైన పెట్చాబురి రోడ్డు వంటి మార్గాలు నడుము లోతు నీటిలో మునిగిపోవడంతో కార్లు, వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యావసరాల కోసం నీళ్లలోనే నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాల్వల పరిసరాల ప్రజలకు హెచ్చరికలు.. 200 షెల్టర్లు ఏర్పాటు

తూర్పు బ్యాంకాక్‌లో పరిస్థితి మరింత విషమంగా ఉంది. ప్రధాన డ్రైనేజీ నెట్‌వర్క్, కాలువల పక్కన నివసించే ప్రజలు తమ వస్తువులు, సామాగ్రిని వెంటనే పైఅంతస్తులకు తరలించాలని అధికారులు ఆదేశించారు. నిరాశ్రయులైన బాధితుల కోసం స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లలో 200కు పైగా తాత్కాలిక సహాయక శిబిరాలను (Shelters) తెరిచారు. థాయ్ ఆర్మీ రంగంలోకి దిగి మొబైల్ కిచెన్లు ఏర్పాటు చేసి ఆహార పంపిణీ, సహాయక చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా రోడ్డు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలు చాలావరకు నిలిచిపోయాయి.

Bangkok Declared Disaster Zone: Severe Flooding Hits City and Airport Transit

విమాన ప్రయాణికులకు అడ్వైజరీ: విమానాశ్రయాలకు వెళ్లేవారు ఇవి గుర్తుంచుకోండి

బ్యాంకాక్‌లో ఉన్న లేదా అక్కడికి వెళ్లాలనుకుంటున్న టూరిస్టుల కోసం విమానయాన నియంత్రణ సంస్థ (CAAT), విదేశీ ఎంబసీలు ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేశాయి.

ఫ్లైట్స్ పరిస్థితి: సువర్ణభూమి (Suvarnabhumi), డాన్ ముయాంగ్ (Don Mueang) అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రస్తుతానికి తెరిచే ఉన్నాయి. అయితే వర్షాల కారణంగా కొన్ని విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణానికి బయల్దేరే ముందే ఎయిర్‌లైన్స్ ద్వారా మీ ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలి. టికెట్లను రీషెడ్యూల్ చేసుకోవడానికి లేదా క్రెడిట్ రూపంలో మార్చుకోవడానికి విమానయాన సంస్థలు వెసులుబాటు కల్పిస్తున్నాయి.

రోడ్డు ప్రయాణాలు వద్దు: ఎయిర్‌పోర్టులకు వెళ్లే రహదారులన్నీ తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు, వరద నీటితో నిండిపోయాయి. అందువల్ల క్యాబ్‌లు లేదా కార్లలో కాకుండా ఎయిర్‌పోర్ట్ రైల్ లింక్ (Rail Links) ద్వారా ప్రయాణించాలని, ప్రయాణ సమయానికి కనీసం 2-3 గంటల అదనపు సమయాన్ని కేటాయించుకోవాలని అధికారులు సూచించారు.

ఎమర్జెన్సీ నంబర్లు: అత్యవసర సహాయం లేదా రోడ్ సైడ్ అసిస్టెన్స్ కోసం టూరిస్ట్ పోలీస్ హెల్ప్‌లైన్ 1155 లేదా టూరిజం కాల్ సెంటర్ నంబర్ 1672కు కాల్ చేయవచ్చు.

వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇంకా కొనసాగనున్న వర్షాలు

రాబోయే రోజుల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కొనసాగుతాయని థాయ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పూర్తిగా ఆగిపోయినా, నిలిచిన వరద నీరంతా దిగిపోవడానికి కనీసం 2 నుంచి 3 రోజుల సమయం పడుతుందని నగర పాలక సంస్థ తెలిపింది.

వరదల దృష్ట్యా రవాణా మంత్రిత్వ శాఖ 24 గంటల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి హై-క్లియరెన్స్ వాహనాలతో ప్రజలను తరలిస్తోంది. సెప్టెంబర్ 27 వరకు ఎక్స్‌ప్రెస్‌వే టోల్ ఛార్జీలను రద్దు చేయడంతో పాటు రైల్వే స్టేషన్లలో ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ 28, 29 తేదీల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) వెసులుబాటు కల్పిస్తూ సివిల్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement