త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sirens, Multiple Horns Cases | సైర‌న్, మ‌ల్టీ హార‌న్ల‌తో నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌.. 304 కేసులు న‌మోదు

Sirens, Multiple Horns Cases | హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా అమర్చుకున్న అనధికారిక సైరన్లు, మల్టీ టోన్ హారన్ల (Multi-tone horns) ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలపై 304 కేసులు న‌మోదు చేసిన‌ట్లు హైద‌రాబాద్ ట్రాఫిక్‌ జాయింట్ కమిషనర్ జోయ‌ల్ డేవిస్ తెలిపారు.

S

Hyderabad | Published On Oct 17, 2026, 7.24 pm IST

Sirens, Multiple Horns Cases | సైర‌న్, మ‌ల్టీ హార‌న్ల‌తో నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌.. 304 కేసులు న‌మోదు
Advertisement

Sirens, Multiple Horns Cases | త్రినేత్ర న్యూస్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా అమర్చుకున్న అనధికారిక సైరన్లు, మల్టీ టోన్ హారన్ల (Multi-tone horns) ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలపై 304 కేసులు న‌మోదు చేసిన‌ట్లు హైద‌రాబాద్ ట్రాఫిక్‌ జాయింట్ కమిషనర్ జోయ‌ల్ డేవిస్ తెలిపారు. ఈనెల 12 నుంచి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో మోటారు వాహనాల చట్టం (MV Act) నిబంధనలు ఉల్లంఘించి అక్రమ సైరన్లకు సంబంధించి 182 కేసులు, మల్టీ టోన్ హారన్లకు సంబంధించి 122 కేసులు నమోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. సీఎంవీఆర్ (CMVR) రూల్ 119 (2) - 1999 ప్రకారం అత్యవసర సేవలకు ఉపయోగించే ప్రామాణిక వాహనాలకు (Emergency Vehicles) తప్ప సాధారణ ప్రైవేట్ లేదా ఇతర వాహనాలపై ఎయిర్ హారన్లు, సైరన్లు (మల్టీ టోన్ హారన్లు) వాడటం పూర్తిగా నిషేధం. అలాగే మోటారు వాహనాల చట్టం 1988 - సెక్షన్ 190 (2) ప్రకారం రోడ్డు భద్రత, శబ్ద కాలుష్య నియంత్రణ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ప్రజా ప్రదేశాలలో వాహనాలు నడిపినా లేదా నడిపించేందుకు అనుమతించినా నేరం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు రూ. 1,000 జరిమానా విధిస్తాం.

జీరో టాలరెన్స్ విధానం..

ఇలాంటి ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ "జీరో టాలరెన్స్" (సహించేది లేదు) విధానాన్ని అవలంబిస్తోంది. అనధికారిక సైరన్లు, మల్టీ టోన్ హారన్ల వల్ల తీవ్ర శబ్ద కాలుష్యంతో పాటు ట్రాఫిక్ క్రమశిక్షణ దెబ్బతింటుంది. సాధారణ వాహనదారులు సదరు ప్రైవేట్ వాహనాలను అత్యవసర వాహనాలుగా పొరబడి ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల నిజమైన అంబులెన్సులు, ఫైర్ ఇంజన్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి.

హైదరాబాద్ నగరంలో సురక్షితమైన, క్రమశిక్షణతో కూడిన ప్రయాణ వాతావరణాన్ని కల్పించేందుకు, మోటారు వాహనాల చట్టాన్ని క‌చ్చితంగా అమలు చేసేందుకు రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ప్రత్యేక దాడులు క్రమం తప్పకుండా కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నగరంలోని వాహనదారులు, డ్రైవర్లు మోటారు వాహనాల చట్ట నిబంధనలకు లోబడి నడుచుకోవాలి. అనధికారిక సైరన్లు, మల్టీ టోన్ హారన్లను అమర్చుకోవడం లేదా ఉపయోగించడం వెంటనే స్వచ్ఛందంగా మానుకోవాలి. హైదరాబాద్ రోడ్లను సురక్షితంగా, ప్రశాంతంగా ఉంచడంలో పోలీసులకు సహకరించాలి అని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

Special Enforcement Drive

Advertisement
Advertisement