Interstate gang of thieves Arrested | కరెన్సీ నోట్లు కింద పడేస్తరు.. జనం నెట్టుకుంటుంటే ఫోన్‌లు కొట్టేస్తరు
Interstate gang of thieves Arrested | హైదరాబాద్‌లోని రద్దీ ప్రదేశాల్లో తమదైన రీతిలో స్నాచింగ్‌లు, మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కంచన్‌బాగ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, విడి భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
- అంతర్రాష్ట్ర మొబైల్ దొంగల ముఠా గుట్టురట్టు చేసిన కంచన్‌బాగ్ పోలీసులు
- ఆరుగురు నిందితుల అరెస్టు
- భారీగా మొబైల్ ఫోన్లు స్వాధీనం
Interstate gang of thieves Arrested | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని రద్దీ ప్రదేశాల్లో తమదైన రీతిలో స్నాచింగ్‌లు, మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కంచన్‌బాగ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అంబటి నరేష్ అలియాస్ కావటి నరేష్, బనాలా అరుణ్ కుమార్ అలియాస్ నాని, మేకల చిరంజీవి అలియాస్ చిరు, తోట సూరి అలియాస్ సురేష్ అలియాస్ సూర్య, తోట చందు, సందీప్ జైస్వాల్ (దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేసే వ్యక్తి) ను అరెస్ట్ చేసి, వారి నుండి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, విడి భాగాలను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం వెల్లడించారు.
గత నెల 15న సయ్యద్ నజీర్ అహ్మద్ అనే వ్యక్తి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఎమ్ఆర్ఎల్ (DMRL) ఎక్స్ రోడ్ సమీపంలో వెళ్తుండగా మోటార్ సైకిల్‌పై వచ్చిన అపరిచిత వ్యక్తులు 'శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్-5' మొబైల్ ఫోన్‌ను లాక్కొని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పక్కా సమాచారంతో దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగి, హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో వేర్వేరు చోట్ల ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో భాగమైన తోట వసంత్, శశి, ప్రేమ్ అనే మరికొందరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.

ఇదీ నిందితుల పాత నేరాల చరిత్ర..
ఇదివరకే అంబటి నరేష్ పై జగద్గిరిగుట్ట, ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్లలో 3 దొంగతనం కేసులు ఉన్నాయి. బనాలా అరుణ్ ఐజీ (జోగులాంబ గద్వాల), భువనగిరి టౌన్, శ్రీకాళహస్తి (ఆంధ్రప్రదేశ్), మార్కెట్ పీఎస్ (హైదరాబాద్), పటాన్‌చెరు (NDPS యాక్ట్), ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లలో మొత్తం 6 కేసులు, మేకల చిరంజీవిపై గుత్తి (అనంతపురం), నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్లలో 2 కేసులు, తోట సూరిపై ఆదిభట్ల (చీటింగ్ కేసు), జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో 2 కేసులు, తోట చందుపై చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో దొంగతనం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
చోరీలు చేస్తారిలా..
ఈ ముఠా సభ్యులు బస్సు స్టాప్‌లు, మార్కెట్‌లు, టిఫిన్ సెంటర్లు, ఆర్‌టీసీ బస్ స్టేషన్లు, రద్దీగా ఉండే రహదారులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు మోటార్ సైకిళ్లపై తిరుగుతూ, గ్రూపులుగా విడిపోయి పక్కా ప్లాన్‌తో దొంగతనాలకు పాల్పడతారు. రద్దీలో అమాయకులను, ముఖ్యంగా వృద్ధులను, బస్సు ప్రయాణికులను గుర్తిస్తారు. చుట్టుపక్కల పరిస్థితులను, పోలీసుల కదలికలను గమనిస్తుంటారు. దొంగతనం చేసే సమయంలో ముఖాలు కనిపించకుండా వార్తాపత్రికలు లేదా షాపింగ్ కవర్లను అడ్డుపెట్టుకుని, జేబుల్లోని లేదా హ్యాండ్‌బ్యాగుల్లోని మొబైల్ ఫోన్లను చాకచక్యంగా లాగేస్తారు. దొంగతనం జరిగిన వెంటనే నిందితులు పారిపోవడానికి బైక్‌లతో సిద్ధంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో బాధితుల దృష్టి మళ్లించడానికి వారి పక్కన కరెన్సీ నోట్లను కిందపడేసి, జనం నెట్టుకుంటున్నట్లు నటిస్తూ బస్సులు ఎక్కే సమయంలో మొబైల్స్ కొట్టేస్తుంటారు. వీరు ముఖ్యంగా ఐఫోన్, శాంసంగ్ ఫోల్డ్ సిరీస్, వన్ ప్లస్, వివో, ఒప్పో, రెడ్‌మి వంటి ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను లక్ష్యంగా చేసుకుంటారు అని పోలీసులు పేర్కొన్నారు.
దొంగిలించిన మొబైల్ ఫోన్లను నిందితులు మొదట రూ. 1,500 నుండి రూ. 2,000 లకే మొబైల్ షాపులకు లేదా రిసీవర్లకు అమ్మేవారు. వాటిని అద్దె ఇళ్లలో దాచి ఉంచి, ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ వివరాలను తుడిచేసి, సిమ్ కార్డులు మార్చి తక్కువ ధరలకే అవసరమున్న వారికి విక్రయించేవారు. కొన్ని ఫోన్లను విడిభాగాలుగా విడదీసి మొబైల్ రిపేర్ షాపులకు అమ్మేవారు అని డీసీపీ చెప్పారు.
వివిధ బ్రాండ్లకు చెందిన 132 బ్యాటరీలు, మదర్ బోర్డులు లేని 172 మొబైల్ బాడీలు, 73 కెమెరా విడిభాగాలు, 14 స్మార్ట్‌ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ పౌచ్‌లు, దొంగిలించిన ఫోన్ల రికార్డులు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ముఠాను పట్టుకున్న కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.
రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్సు స్టాప్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లలో ప్రయాణించేటప్పుడు ప్రజలు తమ మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. ఖరీదైన ఫోన్లను షర్ట్ జేబుల్లో లేదా సులభంగా లాక్కోవడానికి వీలుండే చోట్ల ఉంచవద్దని కోరారు. ఏదైనా దొంగతనం లేదా స్నాచింగ్ జరిగినా, లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే డయల్ 100 కి గానీ, సమీప పోలీస్ స్టేషన్‌కు గానీ సమాచారం అందించాలన్నారు. సరైన బిల్లులు, పత్రాలు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ కొనవద్దని ప్రజలను హెచ్చరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




