త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arrest | బెంగ‌ళూరుకి పిలిచి క‌ల్పిత విజ‌య‌గాథలు చెప్పారు.. అందినకాడికి దోచుకుని క‌ట‌క‌టాల‌పాల‌య్యారు

Arrest | వ్యాపార లాభసాటి అవకాశాలు ఉన్నాయని నమ్మించి ఓ వ్య‌క్తిని బెంగళూరుకు పిలిపించి నిండా ముంచిన ఉదంత‌మిది. దుండ‌గులు చెప్పిన మాట‌లు విన్న బాధితుడు తీరా మోసపోయాన‌ని తెలుసుకొని పోలీసులను ఆశ్ర‌యించాడు.

S

Hyderabad | Published On Jul 23, 2026, 7.47 pm IST

Arrest | బెంగ‌ళూరుకి పిలిచి క‌ల్పిత విజ‌య‌గాథలు చెప్పారు.. అందినకాడికి దోచుకుని క‌ట‌క‌టాల‌పాల‌య్యారు
Advertisement
  • క్యూనెట్ పిర‌మిడ్ మోసం కేసులో గోవాలో ఐదుగురి అరెస్టు, ల‌గ్జ‌రీ కార్లు స్వాధీనం

త్రినేత్ర‌.న్యూస్‌: వ్యాపార లాభసాటి అవకాశాలు ఉన్నాయని నమ్మించి ఓ వ్య‌క్తిని బెంగళూరుకు పిలిపించి నిండా ముంచిన ఉదంత‌మిది. దుండ‌గులు చెప్పిన మాట‌లు విన్న బాధితుడు తీరా మోసపోయాన‌ని తెలుసుకొని పోలీసులను ఆశ్ర‌యించాడు. 318(4), 316(2) r/w 61(2) BNS, TSPDFE యాక్ట్ సెక్షన్లు 3 అండ్‌ 5, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధ) చట్టం, 1978లోని సెక్షన్లు 3, 4, 5 & 6, ఐటీ యాక్ట్ సెక్షన్ 66(D) కింద హైదరాబాద్ CCS, DD పోలీస్ స్టేషన్‌లో కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గోవాలో ఐదుగురు నిందితుల‌ను అరెస్టు చేసి ల‌గ్జ‌రీ కార్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. సర్దార్ శరణ్‌పాల్ సింగ్ హౌద‌రాబాద్‌, బెంగ‌ళూరులో జిమ్ ఏర్పాటు చేయ‌డానికి స్థ‌లం కోసం వెతుకుతున్నాడు. ఈ క్ర‌మంలో ఇత‌డికి కేరళ కోజికోడ్‌కు చెందిన‌ మహ్మద్ ఫవాజ్ అనే వ్య‌క్తి ఇన్‌స్టాలో ప‌రిచ‌య‌మ‌య్యాడు. త‌మ వ‌ద్ద వ్యాపార లాభ‌సాటి అవ‌కాశాలున్నాయ‌ని.. బెంగ‌ళూరు రావాల‌ని ఈనెల 9న శ‌ర‌ణ్‌పాల్‌కు చెప్పాడు. ఇది న‌మ్మి అత‌డు బెంగ‌ళూరుకు చేరుకున్నాడు. మహ్మద్ ఫవాజ్, అతని బృందం QNET (విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) సంస్థను అత‌డికి పరిచయం చేశారు. QNET సంస్థ 'QI గ్రూప్'తో అనుబంధం కలిగి ఉండి లగ్జరీ వస్తువుల వ్యాపారం చేస్తుందని తప్పుగా చిత్రీకరించారు. కల్పిత విజయగాథలు, వీడియో ప్రెజెంటేషన్లు చూపించడమే కాకుండా, ఒత్తిడి (Peer Pressure) తీసుకొచ్చారు. తప్పుడు నివేదికలతో రూ.7.50 లక్షలు పెట్టుబడి పెట్టించేలా ప్రేరేపించారు.

ఇంత‌టితో ఆగ‌కుండా వ్యాపారంలో సభ్యత్వం (Position) రిజర్వ్ చేసుకోవాల‌ని.. త్వరలో గోవాలో జరగబోయే లీడర్‌షిప్ ఈవెంట్‌కు ఎంట్రీ పొందడానికి వెంట‌నే రూ.30,000 డిపాజిట్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. వారి మాటలను నిజమని నమ్మిన శ‌ర‌ణ్‌పాల్ సింగ్‌ తన UPI ద్వారా మహ్మద్ ఫవాజ్ HDFC బ్యాంక్ ఖాతాకు రూ.25,000 బదిలీ చేశాడు. కేవ‌లం ఫోన్ కాల్స్‌, జూమ్ మీటింగ్‌లలోనే మాట్లాడాల‌ని.. ఈ వ్యాపార విష‌యాన్ని అత్యంత ర‌హ‌స్యంగా ఉంచాల‌ని చెప్పేవారు. ఈ నేప‌థ్యంలో తన భార్య,స్నేహితుడి సలహాతో మోసపోయాన‌ని గ్ర‌హించాడు. QNET సంస్థ మనీ సర్క్యులేషన్, పిరమిడ్ స్కీమ్ కార్యకలాపాలకు పాల్పడుతోందని తెలుసుకున్నాడు. ఈనెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

QNET / విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో అనుబంధం ఉన్న పలువురు నిందితులు, ప్రతినిధులు ఉత్తర గోవాలోని కాండోలిమ్‌లో జరగబోయే "Ocean 25th Anniversary" ఈవెంట్‌కు హాజరవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పోలీస్ టీమ్ గోవాకు వెళ్లింది. పోలీసుల రాకను గమనించిన కొందరు అనుమానితులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. మహ్మద్ ఫవాజ్, అశ్విన్ సురేష్ (పాలక్కాడ్, కేరళ), విను విను జాన్సన్ డిక్రూజ్ (తిరువనంతపురం, కేరళ), మనోజ్ రవీంద్రన్ నాయర్ సుబ్బలక్ష్మి (తిరువనంతపురం, కేరళ) వారిక్కోట్టుచాలిల్ శివరాజన్ బలరాజ్ (కల్పేట, కేరళ) అనే ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గోవాలోని మపుసా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని హైదరాబాద్‌కు తరలించేందుకు న్యాయస్థానం 'ట్రాన్సిట్ వారెంట్' (Transit Warrant) మంజూరు చేసింది అని పోలీసులు తెలిపారు.

మ‌రోవైపు నిందితుల నుంచి ఐదు సెల్‌ఫోన్లు, మూడు లగ్జరీ వాహనాలను, పలు కీలకమైన డిజిటల్ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప‌రారీలో ఉన్న సాను నాయర్‌, వైశాఖ్ నాయర్‌ల కోసం పోలీసులు ముమ్మ‌రంగా గాలిస్తున్నారు.

ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగ యువత, గృహిణులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మోసాల‌కు పాల్ప‌డుతుంటార‌ని పోలీసులు చెప్పారు. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లాభాలు వస్తాయని చెప్పి మోసం చేస్తార‌న్నారు. అటువంటి చట్టవిరుద్ధమైనద కార్య‌కలాపాల‌ను అప్ర‌మ‌త్త‌తో గుర్తించాలన్నారు. చట్టవిరుద్ధమైన స్కీమ్‌లలో తెలిసి లేదా తెలియక చేరినా, ప్రచారం చేసినా, ఈవెంట్‌లను నిర్వహించినా లేదా డబ్బులు వసూలు చేసినా 'ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధ) చట్టం, 1978' ప్రకారం క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చ‌రించారు. 'డయల్ 100' కి సమాచారం అందించాల‌ని కోరారు.

ఎస్‌ఐటీ (SIT) ఏసీపీ వై.హరీష్ కుమార్, EOW టీమ్-1 ఏసీపీ వి. నరసింహారెడ్డి మార్గదర్శకత్వంలో, హైదరాబాద్ CCS, DD డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. చైతన్య కుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఐలు రాఘవేందర్, సుధాకర్ రావు, ఎస్సైలు దేవా సురేష్, అనిల్ కుమార్, రాధిక తదితర బృందం ఈ కేసును ప‌ర్య‌వేక్షిస్తార‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు.

Advertisement
Advertisement