త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Miyapur Software Engineer Death | కట్నం దాహానికి టెకీ బలి.. మియాపూర్‌లో భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్త అదనపు కట్నం వేధింపులు తాళలేక ఇషిత యాదవ్ అనే 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

J

Hyderabad | Published On Apr 2, 2026, 10.00 pm IST

Miyapur Software Engineer Death | కట్నం దాహానికి టెకీ బలి.. మియాపూర్‌లో భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

సంక్షిప్త సారాంశం

సోషల్ మీడియాలో పరిచయమై ఐదేళ్లుగా ప్రేమించుకున్న జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, తన స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి కోసం పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త నీరజ్ బన్సాల్ పెట్టే చిత్రహింసలు భరించలేక ఇషిత యాదవ్ (26) మియాపూర్‌లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Miyapur Software Engineer Death | త్రినేత్ర.న్యూస్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన కొన్ని నెలలకే ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం తేవాలంటూ భర్త పెట్టిన చిత్రహింసలు భరించలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

సోషల్ మీడియా పరిచయం.. ఐదేళ్ల ప్రేమ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఇషిత యాదవ్ (26), మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్‌కు 2020లో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ దాదాపు ఐదేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 20న పాట్నాలో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ రంగంలోనే పనిచేస్తుండటంతో, పెళ్లి తర్వాత వీరు హైదరాబాద్‌కు మకాం మార్చారు. మియాపూర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు.

స్టార్టప్ పేరుతో కట్నం వేధింపులు

కొత్త కాపురం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగింది. అయితే, ఇటీవల నీరజ్ బన్సాల్ ఓ కొత్త స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. ఆ కంపెనీలో పెట్టుబడుల కోసం పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ ఇషితపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. డబ్బులు తేకపోవడంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి.

ఫ్యాన్‌కు ఉరివేసుకుని

భర్త వేధింపులు రోజురోజుకూ శృతి మించడంతో ఇషిత తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం సాయంత్రం అపార్ట్‌మెంట్‌లోని హాల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతున్న భార్యను చూసిన నీరజ్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

భర్త అదుపులో.. కొనసాగుతున్న దర్యాప్తు

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఇషిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. భర్త వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని ఇషిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు నీరజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement