త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET PG Student Suicide | కన్నవారికి కడుపుకోత: చదువుల ఒత్తిడి తట్టుకోలేక నీట్ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ హాస్టల్‌లో నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న డాక్టర్ యశ్విత ఆత్మహత్య చేసుకుంది. చదువుల ఒత్తిడితోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానాలు.

J

Hyderabad | Published On Aug 29, 2026, 6.55 pm IST

NEET PG Student Suicide | కన్నవారికి కడుపుకోత: చదువుల ఒత్తిడి తట్టుకోలేక నీట్ విద్యార్థిని ఆత్మహత్య
Advertisement
  • హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని అపరాజిత హాస్టల్‌లో విషాదం
  • నీట్ పీజీ (NEET PG) కోసం ప్రిపేర్ అవుతున్న కర్నూలుకు చెందిన యశ్విత ఆత్మహత్య
  • గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లోనే ఉంటూ కోచింగ్ తీసుకుంటున్న ఎంబీబీఎస్ విద్యార్థిని
  • పరీక్షల మానసిక ఒత్తిడి వల్లే విషం తాగి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల అనుమానం

NEET PG Student Suicide | త్రినేత్ర.న్యూస్ : ఉన్నత చదువులు చదివి డాక్టర్‌గా స్థిరపడాల్సిన ఓ యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది. హైదరాబాద్‌లోని (Hyderabad) ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో నీట్ పీజీ (NEET PG) కోచింగ్ తీసుకుంటున్న ఓ ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలుకు (Kurnool) చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె యశ్విత ఎంబీబీఎస్ పూర్తి చేసింది. పీజీ చేయాలన్న లక్ష్యంతో నీట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లోనే ఉంటూ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని అపరాజిత హాస్టల్‌లో ఉంటూ నిత్యం కోచింగ్ తీసుకుంటోంది.

అయితే, రోజూలాగే హాస్టల్ గదిలో ఉన్న యశ్విత.. శనివారం ఊహించని విధంగా విషం తాగి సూసైడ్ (Suicide) చేసుకుంది. తోటి విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండటం, సిలబస్ భారం పెరగడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి (Mental Stress) లోనై ఉంటుందని, ఆ క్రమంలోనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకుని ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

చేతికొచ్చిన ఏకైక కుమార్తె ఇలా అర్థాంతరంగా ప్రాణాలు తీసుకోవడంతో కర్నూలులో ఉన్న యశ్విత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement