త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Konda Surekha | వ‌ర్షాలు స‌మృద్ధిగా కుర‌వాలి.. గోల్కొండ‌లో ఆకాంక్షించిన మంత్రి కొండా సురేఖ‌

Minister Surekha | గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.

S

Hyderabad | Published On Jul 16, 2026, 3.30 pm IST

Minister Konda Surekha | వ‌ర్షాలు స‌మృద్ధిగా కుర‌వాలి.. గోల్కొండ‌లో ఆకాంక్షించిన మంత్రి కొండా సురేఖ‌
Advertisement

Minister Surekha | త్రినేత్ర‌.న్యూస్ : గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఉత్సవ వేదిక వద్దకు చేరుకున్న మంత్రికి అర్చకులు మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ శివసత్తులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సాంస్కృతిక కళాకారుల కోరిక మేరకు మంత్రి సురేఖ ఈరగోల చేతిలో ధరించి, వారిని ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆషాడ బోనాల ఉత్సవాల బుక్‌లెట్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి సురేఖ ఆవిష్కరించారు. జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున రూ. 11 లక్షల చెక్కును ఇరువురు మంత్రులు కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందన్నారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో హైదరాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొన్నదని అన్నారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల సమర్పణతో ఎల్ నినో ప్రభావం తగ్గి, భూతల్లి శాంతించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు.

సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రథమ ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద దేవాలయాతో పాటు, చిన్న చిన్న దేవాలయాలకు కూడా నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆషాడ బోనాల ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సంతోషంగా అమ్మవార్లను దర్శించుకుని వెళ్ళేలా సకల ఏర్పాట్లను చేసినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, సాంస్కృతిక శాఖ డైరక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement