త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ఆకాశహర్మ్యాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదలందరికీ న్యాయం చేస్తాం : మంత్రి పొన్నం హామీ

హైదరాబాద్‌లోని నిరుపేదలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. సొంత స్థలం ఉన్నవారికి నిధులు, స్థలం లేనివారికి G+5 నుంచి G+10 అంతస్తుల్లో ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. నగరంలో ఇప్పటికే 4.22 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.

J

Hyderabad | Published On Feb 18, 2026, 6.36 pm IST

Ponnam Prabhakar | ఆకాశహర్మ్యాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదలందరికీ న్యాయం చేస్తాం : మంత్రి పొన్నం హామీ
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్న హైదరాబాద్ పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

సొంత జాగా ఉంటే నిధులు.. లేకుంటే ఇల్లు

పేదల ఇళ్ల మంజూరులో ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తోందని మంత్రి తెలిపారు. సొంత స్థలం ఉన్నవారు ఎల్1 కేటగిరీ కిందికి వస్తారని.. హైదరాబాద్‌లో సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్న సుమారు 4,800 మంది అర్హులైన పేదలకు రెండు పడకల గదుల ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. స్థలం లేనివారు ఎల్2 కేటగిరీ కిందికి వస్తారని సొంత స్థలం లేని పేదల నుంచి (L2 కింద) దాదాపు 4,22,000 పైగా దరఖాస్తులు వచ్చాయని మంత్రి వెల్లడించారు.

హైదరాబాద్ కోసం ప్రత్యేక ప్లాన్ (G+10 Model)

మహానగరంలో ఖాళీ స్థలాల కొరత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా జీ+5 నుంచి జీ+10 అంతస్తుల వరకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. మురికివాడల్లో కూడా 'ఇందిరమ్మ మోడల్ కాలనీలు' నిర్మిస్తామన్నారు.

పెండింగ్ 2BHKలపై ఆరా

నగరంలో ఇంకా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల (2BHK) పనులపై మంత్రి అధికారులను ప్రశ్నించారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను వెంటనే పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి? ఇంకా ఎంతమంది లబ్ధిదారులు మిగిలి ఉన్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అధికారుల తరపున జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాలను, సూచనలను మంత్రులు స్వీకరించారు.

Advertisement
Advertisement