త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

City Crime | మైనర్‌ బాలిక అక్రమ రవాణా కేసులో 8 మంది అరెస్ట్‌.. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు

City Crime | మైనర్‌ బాలికను అపహరించి, అక్రమంగా వ్యభిచార గృహానికి తరలించిన కేసులో ఎనిమిది మంది నిందితులను టోలిచౌకి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అత్యాచారం, పోక్సో, అనైతిక రవాణా నిరోధక చట్టాల కింద నమోదైన ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించినట్లు టోలిచౌకి డివిజన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సయ్యద్‌ ఫియాజ్‌ తెలిపారు.

P

Hyderabad | Published On Oct 10, 2026, 10.00 pm IST

City Crime | మైనర్‌ బాలిక అక్రమ రవాణా కేసులో 8 మంది అరెస్ట్‌.. 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
Advertisement

City Crime | మైనర్‌ బాలికను అపహరించి, అక్రమంగా వ్యభిచార గృహానికి తరలించిన కేసులో ఎనిమిది మంది నిందితులను టోలిచౌకి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అత్యాచారం, పోక్సో, అనైతిక రవాణా నిరోధక చట్టాల కింద నమోదైన ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించినట్లు టోలిచౌకి డివిజన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సయ్యద్‌ ఫియాజ్‌ తెలిపారు. నిందితుల నుంచి ఆరు సెల్‌ఫోన్లు, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. సెప్టెంబర్‌ 2న షేక్‌ ఆతిఫ్‌ అనే నిందితుడు మైనర్‌ బాలికను తన ఆటోలో టోలిచౌకి నుంచి అపహరించి, పథకం ప్రకారం అత్తాపూర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆఫ్రీన్‌ అలియాస్‌ సనా, సమ్రీన్‌ బేగం అనే ఇద్దరు మహిళలకు అప్పగించాడు. ఆహారం, వసతి కల్పిస్తామని నమ్మించిన వారు బాలికను అత్తాపూర్‌లోని పిల్లర్‌ నంబర్‌ 200 సమీపంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సబియా బేగంకు అప్పగించారు. ఇందుకు రూ.30 వేలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ మొత్తాన్ని ఆతిఫ్‌, సనా, సమ్రీన్‌ పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

బలవంతంగా వ్యభిచారంలోకి..

బాలికను తన వద్ద ఉంచుకున్న సబియా బేగం బలవంతంగా వ్యభిచారంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. తనను విడిచిపెట్టాలని బాలిక వేడుకున్నా పట్టించుకోకుండా పలువురితో లైంగిక దోపిడీకి పాల్పడేలా చేసినట్లు వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు ఎండీ నదీమ్‌, ఎండీ కైఫుద్దీన్‌, అలీ బిన్‌ అక్రమ్‌ కస్టమర్లను తీసుకురావడం, వసతి కల్పించడం వంటి పనుల్లో సహకరించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌ 5న బాలిక ఎట్టకేలకు ఆ వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు వివరించడంతో వారు టోలిచౌకి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు షేక్‌ ఆతిఫ్‌, సబియా బేగం, మహమ్మద్‌ హాజీమియా, ఆఫ్రీన్‌ అలియాస్‌ సనా, సమ్రీన్‌ బేగం, ఎండీ నదీమ్‌, ఎండీ కైఫుద్దీన్‌, అలీ బిన్‌ అక్రమ్‌ని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపరిచారు.

అక్రమ సంపాదనే లక్ష్యం

మైనర్‌ బాలికలను అక్రమంగా తరలించి, లైంగిక దోపిడీకి గురిచేస్తూ డబ్బు సంపాదించడమే నిందితుల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. బాలికలకు ఆహారం, వసతి కల్పిస్తామని నమ్మించి వ్యభిచార గృహాలకు తరలించి, డబ్బులు పంచుకున్నట్లు గుర్తించారు. నిందితుల పాత్ర, ఆర్థిక లావాదేవీలపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీపీ సయ్యద్‌ ఫియాజ్‌ వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా గోల్కొండ జోన్‌ డీసీపీ రాఘవేందర్‌ రెడ్డి పర్యవేక్షణలో, టోలిచౌకి డివిజన్‌ ఏసీపీ సయ్యద్‌ ఫియాజ్‌ మార్గదర్శకత్వంలో ఇన్‌స్పెక్టర్‌ ఎల్ రమేశ్‌ నాయక్‌, అదనపు ఇన్‌స్పెక్టర్‌ బలరాజ్‌, ఎస్‌ఐ ఎస్ రవికుమార్‌, సిబ్బంది ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు.

Advertisement
Advertisement