త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Milad-un-Nabi | మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు శాంతియుతంగా నిర్వ‌హించాలి

Milad-un-Nabi | హైద‌రాబాద్ నగరంలో ఈ నెల 26న నిర్వహించనున్న పవిత్ర మిలాద్‌-ఉన్‌-నబీ ఊరేగింపు (జులూస్‌)ను శాంతియుత, ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు.

S

Hyderabad | Published On Aug 22, 2026, 8.53 pm IST

Milad-un-Nabi | మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు శాంతియుతంగా నిర్వ‌హించాలి
Advertisement

Milad-un-Nabi | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ నగరంలో ఈ నెల 26న నిర్వహించనున్న పవిత్ర మిలాద్‌-ఉన్‌-నబీ ఊరేగింపు (జులూస్‌)ను శాంతియుత, ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో శనివారం ‘మర్కజ్‌ ఏ మిలాద్‌ జులూస్‌ కమిటీ’ ప్రతినిధులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రవక్త జన్మదినం శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని, ఆయన అందించిన శాంతి సందేశాన్ని చాటిచెప్పేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

గత మూడేళ్లుగా వినాయక నిమజ్జనాలు, మిలాద్‌ వేడుకలు ఒకే సమయంలో వచ్చినప్పటికీ.. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా తమ ర్యాలీలను వాయిదా వేసుకొని నగర పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించిన కమిటీ పెద్దలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే విధమైన సమన్వయం కొనసాగాలని ఆకాంక్షించారు.

ఊరేగింపు నిర్వహణకు సంబంధించి నిర్దేశిత సమయానికే ర్యాలీని ప్రారంభించి, నిర్ణీత గడువులోగా ముగించాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీజేలు, అధిక శబ్ద కాలుష్యం కలిగించే సౌండ్ సిస్టమ్స్‌పై పూర్తి నిషేధం ఉందని, కేవలం ఆధ్యాత్మిక వాతావరణానికే ప్రాధాన్యమివ్వాలని చెప్పారు.

మైనర్లు వాహనాలు నడపడం, బైక్‌లపై ట్రిపుల్ రైడింగ్ చేయడం, సైలెన్సర్లు తొలగించి చేసే ర్యాష్ డ్రైవింగ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. నిర్ణీత తేదీకి ముందే ఎలాంటి బైక్ ర్యాలీలకు అనుమతి లేదన్నారు.

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విద్యుత్ దీపాలంకరణల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించాలని, జెండాలు విద్యుత్ తీగలకు తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అన్నదాన కేంద్రాల వద్ద ట్రాఫిక్ స్తంభించకుండా వలంటీర్లు పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

అంతకుముందు పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ సీపీ బందోబస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. బోనాల ఉత్సవాల తరహాలోనే మిలాద్ వేడుకలను ప్రశాంతంగా పూర్తి చేసేలా క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ప్రధాన ఊరేగింపును డ్రోన్లు, సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ఊరేగింపు వాహనాలకు ముందస్తుగా స్టిక్కర్లు కేటాయిస్తున్నామని, అత్యవసర సమయాల్లో సంప్రదించేందుకు ప్రత్యేక సమన్వయ వాట్సాప్ గ్రూపు, హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేశామన్నారు

ఈ సమావేశంలో అద‌న‌పు సీపీ లా అండ్ ఆర్డ‌ర్ సౌత్ రేంజ్ త‌ప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయ‌ల్ డేవిస్, ట్రాఫిక్-3 డీసీపీ రాహుల్ హెగ్డే, చార్మినార్ జోన్ డీసీపీ ఖారే కిర‌ణ్ ప్ర‌భాక‌ర్, రాజేంద్ర‌న‌గ‌ర్ డీసీసీ శ్రీనివాస్, శంషాబాద్ డీసీపీ రాజేశ్, గోల్కొండ డీసీపీ రాఘ‌వేంద‌ర్ రెడ్డితో పాటు మర్కజ్ ఏ మిలాద్ జులూస్ కమిటీ క‌న్వీన‌ర్ మౌలానా హ‌ఫీజ్ ముజ‌ఫ‌ర్ హుస్సేన్ ఖాన్, జాయింట్ సెక్ర‌ట‌రీ మౌలానా స‌య్య‌ద్ అహ్మ‌ద్ ఉల్ హుస్సేనీ బాక్రీ, జాయింట్ క‌న్వీన‌ర్, మౌలానా స‌య్య‌ద్ అహ్మ‌ద్ ఉల్ హుస్సేనీ ఖాద్రీ, స‌భ్య‌లు డాక్ట‌ర్ షుజాయిద్దీన్ ఇప్తాఖారీ, మౌలానా స‌య్య‌ద్ హుస్సేనీ రిజ్వీ, మౌలానా స‌య్య‌ద్ అహ్మ‌ద్ మెయినుద్దీన్ ఖాద్రీ, మౌలానా స‌య్య‌ద్ న‌దీముల్లా హుస్సేనీ, మౌలానా షేక్ ఫ‌రీదుద్దీన్ జ‌హెద్, స‌య్య‌ద్ ర‌వూఫ్, ఆజాం ఖాన్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement