త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Feel The Jail | రేప‌టి నుంచే ‘ఫీల్ ది జైల్’ : తెలంగాణ జైళ్ల శాఖ‌

Feel The Jail | హైదరాబాద్‌లోని చంచల్‌గూడ (Chanchalguda) జైలు ఆవ‌ర‌ణ‌లో 'ఫీల్ ది జైల్' అనే సరికొత్త కార్య‌క్ర‌మం రేప‌టి నుంచే ప్రారంభం కానుంది. సంద‌ర్శ‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధ‌మైంది. స్వేచ్ఛ విలువను తెలియజేయడం, నేరాల వల్ల కలిగే పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడం దీని ప్ర‌ధాన ఉద్దేశం.

S

Hyderabad | Published On May 11, 2026, 12.59 pm IST

Feel The Jail | రేప‌టి నుంచే ‘ఫీల్ ది జైల్’ : తెలంగాణ జైళ్ల శాఖ‌
Advertisement
  • ప్ర‌క‌టించిన తెలంగాణ జైళ్ల శాఖ‌
  • దేశంలో ఐదో మ్యూజియంగా అందుబాటులోకి
  • ప్ర‌జ‌ల్లో, యువ‌త‌లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే దీని ప్ర‌ధాన ఉద్దేశం

Feel The Jail | త్రినేత్ర‌.న్యూస్: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ (Chanchalguda) జైలు ఆవ‌ర‌ణ‌లో 'ఫీల్ ది జైల్' అనే సరికొత్త కార్య‌క్ర‌మం రేప‌టి నుంచే ప్రారంభం కానుంది. సంద‌ర్శ‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు చలగూడలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (SICA)లో జైలు మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ జైళ్ల శాఖ సగర్వంగా ప్రకటించింది. అండమాన్ అండ్ నికోబార్, అలీపూర్ (కోల్‌క‌తా), బెంగళూరు (కర్ణాటక), గోవా జైలు మ్యూజియంల తర్వాత దేశంలో ఐదో జైలు మ్యూజియంగా ఇది నిలిచింది. స్వేచ్ఛ విలువను తెలియజేయడం, నేరాల వల్ల కలిగే పరిణామాలపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడం దీని ప్ర‌ధాన ఉద్దేశం.

సౌమ్య మిశ్రా, ఎన్.మురళీబాబు ప్ర‌త్యేక చొర‌వ‌..

పరిపాలన చరిత్ర తెలుసుకోవ‌డం, పరివర్తనను సంరక్షించుకోవ‌డం, ప్రదర్శించడం వంటివి ఈ జైలు మ్యూజియం ద్వారా అవ‌గ‌త‌మ‌వుతాయి. ఇదివర‌కే సంగారెడ్డిలో ఒక మ్యూజియం ఉన్న‌ప్ప‌టికీ అది కొన్నేళ్ల క్రితం కుప్పకూలింది. దీంతో డీజీ ప్రిజన్స్ అండ్‌ సీఎస్ డాక్టర్ సౌమ్య మిశ్రా, సీనియర్ అధికారులు ఎన్.మురళీబాబు క‌లిసి ఐజీ జైళ్ల సహకారంతో ఈ నూత‌న కార్య‌క్ర‌మాన్ని చంచ‌ల్‌గూడ‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆధునిక ప‌ద్ధ‌తుల‌తో పునరుద్ధరించడంలో జైళ్ల శాఖ‌ డీఐజీలు డాక్టర్ డి.శ్రీనివాస్ ఎం. సంపత్, హైదరాబాద్ సెంట్రల్ ప్రిజన్ సూపరింటెండెంట్ ఎన్ శివకుమార్ గౌడ్ చొర‌వ తీసుకున్నారు.

పాత కాల‌పు సంకెళ్లు..

పాత కాలం నాటి శిక్షల నుంచి ఆధునిక జైలు సంస్కరణల వరకు జరిగిన పరిణామాలను ఇక్కడ చూడవచ్చు. సంకెళ్లు, చేనేత యంత్రాలు, పురాతన జైలు గదులను కళ్లకు కట్టినట్లు ప్రదర్శనలో ఉంచారు. కోర్టు విచారణలు, ములాఖత్‌లు ఎలా ఉంటాయో ఆడియో-విజువల్స్ ద్వారా వివరిస్తారు. ఆధునికంగా, నిర్మాణాత్మక మ్యూజియంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ జైలు మ్యూజియంలో ప్ర‌త్య‌క్ష అనుభవాల‌ను ఆస్వాదించొచ్చు. థీమాటిక్ పెయింటింగ్స్, ఇన్స్టాలేషన్లు, క్యూరేటెడ్ ఎగ్జిబిట్ల ద్వారా, మ్యూజియం చారిత్రక నేరాలు, శిక్షా పద్ధతులను స్పష్టంగా చిత్రీకరించారు.

బ‌య‌ట‌కొస్తే రూ.1000 జ‌రిమానా..

రూ. 500 ఫీజు చెల్లించి ఎవరైనా 24 గంటల పాటు రియల్ లైఫ్ ఖైదీగా జైలు జీవితాన్ని స్వయంగా అనుభవించవచ్చు. లోపలికి వెళ్లాక స్మార్ట్‌ఫోన్లు, పర్సులు వంటివి మ‌న ద‌గ్గ‌ర ఉంచుకోవ‌డానికి అనుమతించరు. ఈ టైమ్‌లో ఖద్దరు దుస్తులు ధరించి, నేలపై పడుకుంటూ, జైలు భోజనమే తినాల్సి ఉంటుంది. ఒకవేళ 24 గంటలు పూర్తికాకముందే మధ్యలో బ‌య‌ట‌కు రాద‌ల‌చుకుంటే రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. స్వేచ్ఛ విలువల‌ను, నేరాల పర్యవసానాలను ప్రజలకు ప్ర‌యోగాత్మ‌కంగా తెలియజెప్పే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేసిన‌ట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.

బుకింగ్ ఇలా చేసుకోండి..

ఇది సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్ర‌తి ఆదివారం సెలవు దినంగా నిర్ణ‌యించారు. ప్రస్తుతం ఈ 'ఫీల్ ది జైల్' కార్యక్రమానికి ఎలాంటి ఆన్‌లైన్ పోర్టల్ లేదు. ఆసక్తి ఉన్నవారు ఒక రోజు ముందే జైలు అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించి బుక్ చేసుకోవాలి. వెళ్లేటప్పుడు ఆధార్ లేదా ఓటర్ ఐడీ కార్డ్ (విదేశీయులైతే పాస్‌పోర్ట్) తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
సంప్రదించాల్సిన నంబర్లు: 040-24527846, 040-24528877.

Advertisement
Advertisement