త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | పదేళ్లలో కానిది.. రెండేళ్లలో చేసి చూపించాం: మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అభివృద్ధిని రెండేళ్లలో చేసి చూపించామని, ఈ ఫలితాలే దానికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు.

J

Hyderabad | Published On Feb 14, 2026, 9.00 pm IST

Revanth Reddy | పదేళ్లలో కానిది.. రెండేళ్లలో చేసి చూపించాం: మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
Advertisement

Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినందుకు మంత్రులందరినీ అభినందించారు.

సమిష్టి కృషితోనే విజయం

అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని సీఎం పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యకర్తల కష్టమే ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని ఆయన వ్యాఖ్యానించారు.

పదేళ్లు వర్సెస్ రెండేళ్లు

గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేయలేని పనులను, తమ ప్రజా ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసి చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. "గత రెండేళ్లలో మనం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రజల్లో మనపై నమ్మకాన్ని పెంచాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆ నమ్మకానికి నిదర్శనం," అని సీఎం మంత్రులతో అన్నారు.

అదే స్ఫూర్తితో ముందుకు

ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాబోయే ఏ ఎన్నికల్లోనైనా ఇదే స్ఫూర్తితో, పట్టుదలతో పనిచేయాలని మంత్రులకు సూచించారు.

ఆదర్శ మున్సిపాలిటీలే లక్ష్యం

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement