త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Student Murder Case | బీటెక్ విద్యార్థి హ‌త్య కేసులో కీల‌క విష‌యాలు.. కేసును ఛేదించిన పోలీసులు, 10 మంది అరెస్ట్‌

P

Hyderabad | Published On May 11, 2026, 9.01 pm IST

Student Murder Case | బీటెక్ విద్యార్థి హ‌త్య కేసులో కీల‌క విష‌యాలు.. కేసును ఛేదించిన పోలీసులు, 10 మంది అరెస్ట్‌
Advertisement

Student Murder Case | చిలుక‌ల‌గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో ఈ నెల 7న రాత్రి జరిగిన బీటెక్ విద్యార్థి బొమ్మన యవన్ అలియాస్ అఖిల్ (21) హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలు, ప్రేమ వ్యవహారం నేపథ్యంలో పక్కా పథకం ప్రకారం జరిగిన ఈ హత్యలో పాల్గొన్న 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సికింద్రాబాద్ జోన్ పోలీసులు తెలిపారు. డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు యవన్ ఒక యువతితో ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నాడనే విషయాన్ని ఆ యువతి కుటుంబ సభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 7న రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో నిందితులు మారణాయుధాలతో యవన్‌పై మెడ సహా ప‌లుచోట్ల విచక్షణారహితంగా దాడి చేశారు.

తీవ్ర గాయాల పాలైన యవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలుక‌ల‌గూడ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అరెస్ట‌యిన వారిలో అల్లబోయిన సాయి కిరణ్ అలియాస్ సాయి (27), రాజం పరమేశ్‌ కుమార్ యాదవ్ అలియాస్ డాన్ (19), రాజం వంశీ కృష్ణ అలియాస్ రాఖీ (19), రాజం మనీష్ అలియాస్ బిచ్చు (21), శ్రీగిరి రాహుల్ (22), కుచుల శివ నందన్ యాదవ్ (20), రాజం నరసింహ యాదవ్ (50), రాజం శ్రీశైలం యాదవ్ (48), రాజం మల్లేశ్‌ యాదవ్ అలియాస్ మల్లన్న (48)తో పాటు మ‌రో బాలుడిని కోర్టులో హాజ‌రుప‌రిచిన‌ట్లు తెలిపారు. ఏ3 వంశీకృష్ట‌ను ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా గుర్తించిన‌ట్లు పోలీసులు వివ‌రించారు.

యవన్, చంద్రిక మధ్య ఉన్న ప్రేమను ప్రధాన నిందితుడు సాయి కిరణ్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు విచారణలో తేలింది. చంద్రికను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో యవన్‌పై ద్వేషం పెంచుకొని.. మిగతా నిందితులతో కలిసి హత్యకు నాలుగు నుంచి ఐదు రోజుల ముందే మేడిబావిలో సమావేశమై పథకం రచించినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన పదునైన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ ర‌క్షిత కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ పౌరుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ప‌డేది లేద‌న్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని త్వరితగతిన అరెస్ట్ చేశామ‌న్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. కేసును శాస్త్రీయ పద్ధతిలో, పారదర్శకంగా దర్యాప్తు చేసి కోర్టులో గట్టి శిక్ష పడేలా చూస్తామ‌న్నారు. అసాంఘిక శక్తులు, హింసకు ప్రేరేపించే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని సిటీ పోలీసులు హెచ్చరించారు.

Advertisement
Advertisement