త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Theatre | 22 నిమిషాలు ఆల‌స్యంగా సినిమా ప్రారంభం.. థియేట‌ర్‌కు రూ. 75 వేలు జ‌రిమానా

Hyderabad Theatre | హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఓ థియేట‌ర్‌కు హైద‌రాబాద్ వినియోగ‌దారుల క‌మిష‌న్ భారీ షాకిచ్చింది. సినిమాను 22 నిమిషాలు ఆల‌స్యంగా ప్ర‌ద‌ర్శించినందుకు స‌ద‌రు థియేట‌ర్‌కు రూ. 75 వేల జ‌రిమానా విధించింది.

S

Hyderabad | Published On Sep 29, 2026, 7.45 am IST

Hyderabad Theatre | 22 నిమిషాలు ఆల‌స్యంగా సినిమా ప్రారంభం.. థియేట‌ర్‌కు రూ. 75 వేలు జ‌రిమానా
Advertisement

Hyderabad Theatre | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఓ థియేట‌ర్‌కు హైద‌రాబాద్ వినియోగ‌దారుల క‌మిష‌న్ భారీ షాకిచ్చింది. సినిమాను 22 నిమిషాలు ఆల‌స్యంగా ప్ర‌ద‌ర్శించినందుకు స‌ద‌రు థియేట‌ర్‌కు రూ. 75 వేల జ‌రిమానా విధించింది.

అస‌లు ఏం జ‌రిగిందంటే..?

2025 జూన్ నెల‌లో ఓ యువ‌కుడు కుబేర సినిమా చూసేందుకు రెండు టికెట్లు బుక్ చేసుకున్నాడు. త‌న స్నేహితుడితో క‌లిసి రాత్రి 10.35 గంట‌ల‌కు షోకు వెళ్లాడు. ఐదు నిమిషాల ముందే అంటే 10.30 గంట‌ల‌కు త‌మకు కేటాయించిన సీట్ల‌లో వారిద్ద‌రూ కూర్చున్నారు. అయితే సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందు వ‌చ్చే ప్ర‌క‌ట‌న‌ల‌ను 22 నిమిషాల పాటు థియేట‌ర్ యాజ‌మాన్యం ప్ర‌ద‌ర్శించింది. దీంతో సినిమా 10.52 గంట‌ల‌కు తెర‌పై ప్లే అయింది. ఇక సినిమా వీక్షించిన అనంత‌రం వారిద్ద‌రూ ఇంటికి వెళ్లేసరికి తెల్లారి 3 గంట‌లు అయింది.

దీంతో త‌న‌కు క‌లిగిన అసౌక‌ర్యం, స‌మ‌యం వృథాపై బాధిత యువ‌కుడు హైద‌రాబాద్ వినియోగ‌దారుల క‌మిష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి పిటిష‌న్‌ను విచారించిన క‌మిష‌న్.. థియేట‌ర్ తీరుప‌ట్ల తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. సినిమా ప్రారంభానికి ముందు ప్ర‌క‌ట‌న‌లు కేవ‌లం 2 నిమిషాల‌కే ప‌రిమితం కావాల‌ని కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ నిబంధ‌న‌ల్లో స్ప‌ష్టంగా పేర్కొన్న‌ట్లు క‌మిష‌న్ తెలిపింది. అది కూడా ప‌బ్లిక్ అవేర్‌నెస్ ప్ర‌క‌ట‌న‌లు అయి ఉండాలి. కానీ థియేట‌ర్‌లో 22 నిమిషాల పాటు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు ప్రసారం చేయ‌డం వీక్ష‌కుడి స‌మ‌యాన్ని వృథా చేసిన‌ట్లే అని క‌మిషన్ అభిప్రాయ‌ప‌డింది.

ఈ మేర‌కు స‌ద‌రు థియేట‌ర్‌కు రూ. 75 వేలు జ‌రిమానా విధిస్తున్న‌ట్లు క‌మిష‌న్ తీర్పు చెప్పింది. ఇందులో 25 వేలు బాధిత యువ‌కుడికి చెల్లించాల‌ని ఆదేశించింది. ఇలాంటి ఘ‌ట‌న‌లు నరావృతం కాకుండా ఉండేందుకు మరో రూ. 50,000 లను జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని థియేటర్ యాజ‌మాన్యాన్ని ఆదేశించింది.

Advertisement
Advertisement