త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monsoon Hair Fall | వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలుతోందా?.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న ఈ ‘హోమ్‌మేడ్ క్యాండీ’తో హెయిర్ ఫాల్‌ని అరికట్టండి!

వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలుతోందా? ఖరీదైన షాంపూలు పక్కనపెట్టి, పోషకాహార నిపుణులు సూచిస్తున్న ఈ 'హోమ్‌మేడ్ నట్ క్యాండీ'ని రోజూ ఒక్కటి తిని చూడండి.

J

Health | Published On Jul 21, 2026, 11.55 pm IST

Monsoon Hair Fall | వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలుతోందా?.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న ఈ ‘హోమ్‌మేడ్ క్యాండీ’తో హెయిర్ ఫాల్‌ని అరికట్టండి!

సంక్షిప్త సారాంశం

వర్షాకాలంలో జుట్టు రాలడానికి వాతావరణ మార్పులతో పాటు పోషకాహార లోపం కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. పైపైన రాసే షాంపూలు, సీరమ్స్ కంటే మనం తీసుకునే డైట్ జుట్టు ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు, బాదం, ఖర్జూరంతో ఇంట్లోనే తయారుచేసే క్యాండీతో హెయిర్ ఫాల్ అరికట్టవచ్చు. న్యూట్రిషనిస్ట్ పాలక్ నాగ్‌పాల్ ఈ ప్రత్యేకమైన 'హెయిర్ ఫాల్ మాన్‌సూన్ క్యాండీ' రెసిపీని షేర్ చేశారు.

Advertisement

Monsoon Hair Fall | త్రినేత్ర.న్యూస్ : వర్షాకాలం (Monsoon) రాగానే చాలా మందికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య జుట్టు రాలడం (Hair fall). వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల హెయిర్ ఫాల్ పెరగగానే.. వెంటనే మనం షాంపూలు, హెయిర్ సీరమ్స్ (Hair serums) మార్చేస్తుంటాం. అయితే, సమస్యకు పరిష్కారం మనం వాడే ప్రొడక్ట్స్‌లో కాకుండా, మనం తినే ఆహారంలో ఉందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ (Nutritionist) పాలక్ నాగ్‌పాల్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. జుట్టు రాలడాన్ని అరికట్టి.. కురులు బలంగా పెరిగేలా చేసే ఒక అద్భుతమైన 'హోమ్‌మేడ్ క్యాండీ' (Homemade Candy) రెసిపీని ఆమె షేర్ చేశారు.

జుట్టు రాలడానికి అసలు కారణం ఇదే..

వర్షాకాలంలో గాలిలో తేమ (Humidity), ఒత్తిడి, పోషకాల లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. "రాత్రికి రాత్రే ఏ ఆహారం కూడా జుట్టు రాలడాన్ని ఆపలేదు. కానీ.. హెల్తీ ఫ్యాట్స్, ప్రొటీన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న మంచి డైట్ (Diet) తీసుకుంటే జుట్టు కుదుళ్ల నుంచి బలంగా తయారవుతుంది," అని పాలక్ చెబుతున్నారు. కేవలం హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌పై ఆధారపడే బదులు పోషకవిలువలున్న గింజలతో తయారు చేసే ఆహారం జుట్టుకు చాలా మేలు చేస్తుందని ఆమె వివరిస్తున్నారు.

'హెయిర్ ఫాల్ మాన్‌సూన్ క్యాండీ'లోని పోషకాలు ఇవే

ఈ ప్రత్యేకమైన క్యాండీలో వాడే పదార్థాలు ఇవే

ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె గింజలు): వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తల చర్మాన్ని (Scalp) ఆరోగ్యంగా ఉంచుతాయి.

గుమ్మడి గింజలు (Pumpkin seeds): జుట్టుకు అత్యంత అవసరమైన 'జింక్' ఇందులో లభిస్తుంది.

నువ్వులు (Sesame seeds): క్యాల్షియం, ఐరన్, హెల్తీ ఫ్యాట్స్ అందిస్తాయి.

బాదం, పిస్తా (Almonds & Pistachios): విటమిన్ E, ప్రొటీన్ దొరుకుతాయి. ఇవి బయోటిన్ (Biotin) ఉత్పత్తికి సాయపడతాయి.

నానబెట్టిన చియా సీడ్స్ (Chia seeds): ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందిస్తాయి.

ఖర్జూరం (Dates): సహజమైన తీపిని ఇవ్వడమే కాకుండా.. ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లను ఇస్తుంది.

నెయ్యి (Ghee): హెల్తీ ఫ్యాట్స్ అందిస్తూ, ఈ మిశ్రమాన్ని ముద్దగా చేయడానికి సాయపడుతుంది.

క్యాండీ తయారీ విధానం (Recipe)

ప్యాన్‌లో ఒక టీస్పూన్ నెయ్యి వేడి చేసి, అందులో 12-15 గింజలు తీసిన సాఫ్ట్ ఖర్జూరాలను వేయాలి. అవి మరింత మెత్తగా అయ్యేలా 3-5 నిమిషాలు వేయించాలి.

పావు కప్పు చొప్పున ఫ్లాక్స్ సీడ్స్, పిస్తా, నువ్వులు, గుమ్మడి గింజలతో పాటు అర కప్పు బాదం పప్పులను తీసుకుని మిక్సీలో పొడి చేసుకోవాలి.

ఆ పొడిలో ముందుగా మెత్తగా చేసుకున్న ఖర్జూరం, ఒకటిన్నర టేబుల్ స్పూన్ నానబెట్టిన చియా సీడ్స్ వేసి మిశ్రమం అంతా కలిసేలా మళ్లీ మిక్సీ పట్టాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తటి పిండిలా కలుపుకుని.. చిన్న చిన్న క్యాండీలు (లడ్డూల్లా) చుట్టుకోవాలి.

వీటిని బటర్ పేపర్‌లో చుట్టి లేదా గాలి చొరబడని డబ్బాలో (Airtight container) పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.

బ్యాలెన్స్‌డ్ డైట్‌లో భాగంగా రోజూ ఒక క్యాండీ తినడం వల్ల కురులకు అవసరమైన పోషణ అంది.. వానాకాలంలో జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చని న్యూట్రిషనిస్ట్ పాలక్ నాగ్‌పాల్ సూచిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఈ రెసిపీని ట్రై చేయండి.

Advertisement
Advertisement