త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TV Awards | ఇక బుల్లితెర‌కు అవార్డులు

TV Awards | ఇక బుల్లితెర న‌టీన‌టుల ప్రతిభకు గుర్తింపు దక్కనుంది. టెలివిజన్ రంగానికి ప్రత్యేక అవార్డులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట అవార్డుల‌ను ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేస్తుంద‌ని సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ప్ర‌క‌టించారు.

P

Entertainment | Published On Jul 28, 2026, 4.28 pm IST

TV Awards | ఇక బుల్లితెర‌కు అవార్డులు
Advertisement
  • ప్ర‌తిభ‌కు ద‌క్క‌నున్న గుర్తింపు
  • అవార్డుల‌కు మాజీ ప్ర‌ధాని పీవీ పేరు సిఫార‌సు చేసిన క‌మిటీ
  • సీఎం దృష్టికి తీసుకెళ్తాన‌న్న మంత్రి కోమ‌టిరెడ్డి

TV Awards | ఇక బుల్లితెర న‌టీన‌టుల ప్రతిభకు గుర్తింపు దక్కనుంది. టెలివిజన్ రంగానికి ప్రత్యేక అవార్డులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట అవార్డుల‌ను ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేస్తుంద‌ని సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న టెలివిజన్ అవార్డుల రూపకల్పనలో తెలంగాణ సంస్కృతి, ప్రత్యేకత ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. టెలివిజన్ అవార్డుల కాన్సెప్ట్, మార్గదర్శకాలు, లోగో, అవార్డుల పేర్లు తదితర అంశాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఎండీ ముకుంద్‌రెడ్డి, టెలివిజన్ అవార్డుల కమిటీ ఛైర్మన్, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

అవార్డులకు ప్రత్యేక లోగో రూపకల్పన, ప్రముఖుల పేర్లతో అవార్డుల నామకరణం, వివిధ విభాగాలు, ఎంపిక విధానం, పురస్కారాల ప్రదానోత్సవ వేదికపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టెలివిజన్ అత్యధికంగా ప్రజలను అలరించే రంగ‌మ‌ని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువగా వీక్షిస్తారని అన్నారు. టెలివిజన్ రంగంలో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు, సామాజిక సందేశాలున్న సీరియళ్లు, కార్యక్రమాలు, చిన్నారుల కోసం నాణ్యమైన కంటెంట్ రూపొందించే వారిని ప్రోత్సహించేలా అవార్డులు ఉండాలని సూచించారు. టెలివిజన్ అవార్డులకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలన్న కమిటీ సభ్యుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. దేశ ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన బహుభాషా కోవిదుడైన పీవీ వంటి మహనీయుల పేర్లను పరిశీలించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

టెలివిజన్ అవార్డుల మార్గదర్శకాలు, లోగో, పేర్ల ప్రతిపాదనలను త్వరగా సిద్ధం చేసి సమర్పించాలని కమిటీని ఆదేశించారు. రాష్ట్రంలో తొలిసారిగా అందజేయనున్న ఈ అవార్డులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడంతో పాటు, విజేతల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే అవార్డుల ప్రదానోత్సవానికి రెండు, మూడు వేదికల ఎంపికపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎఫ్‌డీసీ ఎండీకి సూచించారు. సమావేశంలో వచ్చిన అన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించిన అనంతరం టెలివిజన్ అవార్డులపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement