త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు హైకోర్టు బ్రేక్‌

అక్టోబ‌ర్ 11న జ‌ర‌గాల్సిన డ్యాన్స‌ర్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌పై తెలంగాణ హైకోర్టు కీల‌క ఆదేశాలు జారి చేసింది. అసోసియేష‌న్‌లోని స‌మ‌స్య ప‌రిష్కారం కాకుండా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి వీలులేద‌ని ఆదేశాలు జారీ చేసింది.

N

Entertainment | Published On Oct 9, 2026, 11.44 am IST

Tollywood | డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు హైకోర్టు బ్రేక్‌
Advertisement

Tollywood | తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 11న జ‌ర‌గాల్సిన‌ ఎన్నికలను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేసింది. ఎన్నికలకు ముందే వివాదాన్ని విచారించకుండా, ఎన్నికల అనంతరం విచారణకు తేదీ నిర్ణయించడంపై ట్రయల్ కోర్టు తీరును తప్పుబట్టింది.

ఫెడ‌రేష‌న్ నిర్ణ‌యం...

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెప్టెంబర్ 23న డ్యాన్స‌ర్స్‌ అసోసియేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై డ్యాన్స‌ర్స్‌ అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సెప్టెంబర్ 24న ఫెడరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, 2026–2028 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం డిసెంబర్ 6, 2027 వరకు ఉందని, ఈ నేపథ్యంలో ఫెడరేషన్ జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ సుమలతా దేవి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అసోసియేషన్ కార్యవర్గాన్ని కొనసాగించడంతో పాటు, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ సివిల్ దావా దాఖలు చేశారు. ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ పిటిష‌న్ వేశారు. అయితే, ట్రయల్ కోర్టు అత్యవసర నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది. ఎన్నికలు అక్టోబర్ 11న జరగాల్సి ఉన్నప్పటికీ, వాటిని నిలిపివేయాల‌ని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు.

తెలంగాణ హైకోర్టు...

ట్ర‌య‌ల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషనర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 8న విచారణ చేపట్టిన జస్టిస్ ఎం.బి. లక్ష్మి ధర్మాసనం, ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో మధ్యంతర పిటిష‌న్‌ నిరాకరించడానికి గల కారణాలు స్పష్టంగా లేవని పేర్కొంది.

విచార‌ణ తేదీ...

ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 24నే జారీ అయిందని, అక్టోబర్ 11న ఎన్నికలు జరగనున్నాయని తెలిసినప్పటికీ, విచారణను నవంబర్ 3కి వాయిదా వేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఎన్నికలకు ముందే కేసును విచారించేలా అక్టోబర్ 11లోపు విచారణ తేదీని నిర్ణయించడం కనీసం ట్రయల్ కోర్టు చేయాల్సిన పని అని స్పష్టం చేసింది.

ఎన్నిక‌లు ర‌ద్దు...

ఎన్నికలు పూర్తయిన తర్వాత కేసును విచారిస్తే, పిటిషనర్ కోరుతున్న న్యాయపరమైన పరిష్కారం ల‌భించ‌ద‌ని హైకోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో కేసును నవంబర్ 3కి వాయిదా వేయడానికి సరైన ఆధారం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.
ఫెడరేషన్ తరఫున ప్రతివాది కోర్టుకు హాజరై తన వాదనలు వినిపించే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. ప్రతివాదికి వ్యక్తిగత నోటీసుతో సహా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.అక్టోబర్ 30కి ఈ కేసును విచారణకు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

 

Advertisement
Advertisement