Bharathi Raja | కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ భారతీరాజా ఆరోగ్య పరిస్థితిపై తమిళ సినీ వర్గాల్లో అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల భారతీరాజా అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబసభ్యులు ఆయన్ని హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం చెన్నై అంజీకరైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గత కొన్నాళ్లుగా భారతీరాజా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారట. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. భారతీరాజా హెల్త్ కండీషన్ క్రిటికల్‌గానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దిగ్గజ దర్శకుడి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో చాలా పుకార్లు వస్తున్నాయి. ఆయన చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్‌ను భారతీరాజా కుమార్తె జనని కొట్టిపడేసింది. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను నమ్మవద్దని, అవన్నీ వదంతులేనని తెలిపింది. తన తండ్రి కోలుకుంటున్నారని, త్వరలోనే ఆయన క్షేమంగా అందరికి ముందుకు వస్తారని జనని తెలిపింది. ఐసీయూలో ట్రీట్మెంట్.... మరోవైపు డాక్టర్లు కూడా భారతీరాజా హెల్త్ కండీషన్‌పై ఓ బులెటిన్ రిలీజ్ చేశారు. ఐసీయూలో ఉంచి భారతీరాజాకు ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని, చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు. తమిళంలో దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు భారతీరాజా. 16 వయనిదిలే సినిమాతో డైరెక్టర్‌గా భారతీరాజా సినీ జర్నీ మొదలైంది. కమల్‌హాసన్, రజనీకాంత్, విజయ్ కాంత్, చిరంజీవి పాటు అగ్ర హీరోలందరితో సినిమాలు చేశారు. తెలుగులో సీతాకోకచిలుక, ఆరాధనతో పాటు మరికొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌గానే యాకుండా యాక్టర్‌గా యాభైకిపైగా సినిమాల్లో నటించారు.