త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Movie Review | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ రివ్యూ – రాజ‌మౌళి కొడుకు సినిమా ఎలా ఉందంటే?

తెలుగు సినిమాల్లో హీరో అంటే ఫైట్లు చేయాలి...హీరోయిన్‌తో పాట‌లు పాడాలి..ఎలివేష‌న్లు ఇచ్చుకోవాల‌నే రొటీన్ ఫార్ములాకు భిన్నంగా డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సాగ‌తుంది. ఐడియా బాగుంది...కానీ ఆచ‌ర‌ణ‌లోనే ద‌ర్శ‌కుడు చాలా ట్ర‌బుల్ ప‌డ్డాడు...ఆడియెన్స్‌ను పెట్టాడు...

N

Entertainment | Published On Oct 2, 2026, 11.24 am IST

Movie Review | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ రివ్యూ – రాజ‌మౌళి కొడుకు సినిమా ఎలా ఉందంటే?
Advertisement

Movie Review | డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా చూస్తే అవ‌స‌రాలు, స్వార్థం కోసం అడ్డ‌దారులు తొక్కే పాత్ర‌లు త‌ప్ప హీరోలు, విల‌న్లు ఎవ‌రూ లేరు ఈ క‌థ‌లో.... అంటూ సాయికుమార్ చెప్పిన ఓ డైలాగ్ గుర్తొస్తుంది. తెలుగు సినిమాల్లో హీరో అంటే ఫైట్లు చేయాలి...హీరోయిన్‌తో పాట‌లు పాడాలి..ఎలివేష‌న్లు ఇచ్చుకోవాల‌న్న‌ది బ‌లంగా ముద్ర‌ప‌డిపోయింది. ఇవేవీ లేకుండా లేకుండా క‌మ‌ర్షియ‌ల్ చేస్తే ఎలా ఉంటుంద‌నే ద‌ర్శ‌కుడి ఆలోచ‌న బాగుంది.

అత‌డి ఐడియాకు రాజ‌మౌళి లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడి స‌పోర్ట్‌, ఫ‌హాద్ ఫాజిల్ లాంటి టాలెంటెడ్ యాక్ట‌ర్ దొరికితే....నిజంగానే సినిమాతో ఏదో అద్భుతం చేసి ఉంటార‌ని ఆడియెన్స్ ఆశ‌ప‌డ‌టం స‌హ‌జం. కానీ ఆ ఆశ అడియాశే...అని ఆడియెన్స్‌కు అర్థం కావ‌డానికి ఎక్కువ టైమ్ ప‌ట్ట‌దు. ట్ర‌బుల్స్ హీరోకు కాదు...ఆడియెన్స్‌కే అని చివ‌రి వ‌ర‌కు ప‌దే ప‌దే ఈ సినిమా గుర్తుచేస్తుంది.

మ‌నీనే ముఖ్యం....

మాన‌వ సంబంధాల కంటే మ‌నీనే ముఖ్య‌మ‌ని న‌మ్ముతుంటాడు సూరి. అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. స్నేహితుడు మ‌ల్లేష్ త‌ప్ప సూరికి ఎవ‌రూ ఉండ‌రు. అస్లాం అనే రౌడీని మోసం చేసి డ‌బ్బు కొట్టేయాల‌ని ప్లాన్ చేస్తాడు సూరి. కానీ ఆ ప్లాన్ బెడిసికొడుతుంది. అస్లాంకు దొరికిపోతాడు. చంప‌కుండా వ‌దిలేయాలంటే త‌న‌కు ఇర‌వై ఐదు ల‌క్ష‌లు ఇవ్వాల‌ని అస్లాం వార్నింగ్ ఇస్తాడు. అందుకు సూరి ఒప్పుకుంటాడు. డ‌బ్బు కోసం దివ్య అనే చిన్నారిని కిడ్నాప్ చేస్తాడు. దివ్య వాల‌కం, ఆమె మాట‌లు చూసి వారికి బాగా డ‌బ్బుంద‌ని గ్ర‌హిస్తాడు సూరి. కానీ సూరి ఒక‌టి అనుకుంటే రిజ‌ల్ట్ మ‌రోలా వ‌స్తుంది. దివ్య మ‌నిషి కాద‌ని... ఆత్మ అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది.
సూరికి త‌ప్ప ఆమె ఎవ‌రికి క‌నిపించ‌దు. త‌న త‌ల్లిదండ్రులు క‌నిపించ‌కుండాపోయార‌ని, వారిని క‌నిపెట్ట‌డంలో సాయం చేయ‌మ‌ని సూరిని కోరుతుంది. త‌న‌కున్న ప‌వ‌ర్స్‌తో సూరిని క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కిస్తుంది దివ్య‌. కానీ సూరి మాత్రం దివ్య‌ను మోసం చేసి పారిపోవాల‌ని అనుకుంటాడు. ఈ క్ర‌మంలో పోలీసుల‌కు చిక్కుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? దివ్య త‌ల్లిదండ్రులు ఏమ‌య్యారు? మ‌ల్లేష్ మంచిత‌నం సూరిలో ఎలా మార్పును తీసుకొచ్చింది? దివ్య‌కు ఇచ్చిన మాట‌ను ఎలా నిల‌బెట్టుకున్నాడు? పోలీసుల‌తో క‌లిసి సూరిని వెంటాడుతున్న ప్ర‌తాప్ ఎవ‌రు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ప‌దేళ్లు ట్రావెల్‌....

ప‌దేళ్ల నుంచి ఈ క‌థ‌తో డైరెక్ట‌ర్ ట్రావెల్ అయ్యాడ‌ని ప్ర‌మోష‌న్స్‌లో కార్తికేయ అన్నాడు. నిజంగానే సినిమా చూస్తుంటే ఎప్పుడో ప‌దేళ్ల క్రితం రావాల్సిన సినిమా...ఇప్పుడు రిలీజైన అనుభూతి క‌లుగుతుంది. హీరోకు మాత్ర‌మే క‌నిపించే ఓ ఆత్మ‌... ఆ ద‌య్యానికి ఓ ట్రాజెడీ స్టోరీ.... క‌థానాయ‌కుడిగా సాయంతో ఆ క‌ష్టం నుంచి గ‌ట్టెక్క‌డం అనే పాయింట్‌తో తెలుగులో చాలానే సినిమాలు వ‌చ్చాయి. ఈ పాయింట్‌ను మ‌న డైరెక్ట‌ర్లు అనేక కోణాల్లో తిప్పి తిప్పి తీసేశారు. ఇదే పాయింట్‌తో డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ క‌థ సాగుతుంది.

మాయ‌గాడు...

హీరో మాయ‌గాడు. త‌న తెలివితేట‌ల‌తో పోలీసుల‌ను, రౌడీల‌ను బోల్తా కొట్టించ‌గ‌లడ‌ని డైరెక్ట‌ర్ ప‌రిచ‌యం చేశారు. కానీ త‌న ప‌క్క‌న ఉన్న చిన్నారి ద‌య్య‌మా, మ‌నిషా... అన్న‌ది గుర్తుప‌ట్ట‌క‌పోవ‌డం విడ్డూరంగా అనిపిస్తుంది. ఓ లాకెట్ ఉంటేనే హీరోకు ఆత్మ క‌నిపిస్తుంద‌ని డైరెక్ట‌ర్ లాజిక్ పెట్టాడు. ఆ విష‌యం పోలీసుల‌కు చెబితే...వాళ్లే దివ్య త‌ల్లిదండ్రుల‌ను కాపాడుతారు క‌దా.. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలానే లాజిక్‌లెస్ సీన్లు క‌నిపిస్తాయి. హార‌ర్ కామెడీ క‌దా...లాజిక్‌ల‌తో ప‌నేం ఉండ‌ద‌ని డైరెక్ట‌ర్ మ‌రీ ఎక్కువ స్వేచ్ఛ తీసుకున్నాడ‌ని అనిపిస్తుంది.

ఫ‌హాద్ ఫాజిల్ డ‌బ్బింగ్‌...

డోంట్ ట్ర‌బుల్‌ది ట్ర‌బుల్ స్ట్రెయిట్ తెలుగు సినిమానే...కానీ ఫ‌హాద్ ఫాజిల్ ఓన్ డ‌బ్బింగ్ వ‌ల్ల...మ‌ల‌యాళం సినిమాను తెలుగులో చూస్తున్న‌ట్లుగా అనిపిస్తుంది. చాలా చోట్ల అత‌డి యాస సెట్ట‌వ్వ‌లేదు.

వ‌న్ మెన్ ఆర్మీ...

సినిమా కోసం వ‌న్‌మెన్ ఆర్మీలా ఫ‌హాద్ ఫాజిల్ క‌ష్ట‌ప‌డ్డాడు. కామెడీ చేశాడు. ఎమోష‌న్స్ పండించాడు. కానీ ఔట్‌డేటెడ్ స్టోరీ కార‌ణంగా అత‌డి క‌ష్టం వృథాగానే మారిపోయింది. సారా పాలేక‌ర్ న‌టన ఒకే. చిన్నారి ద‌య్యంలో ఉండాల్సిన అల్ల‌రిత‌నం, హుషారు పాత్ర‌లో మిస్స‌య్యాయి. మ‌హేష్ మంజ్రేక‌ర్‌, సౌర‌భ్ స‌చ్‌దేవ్‌, సుబ్బ‌రాజు, వెంక‌టేష్ కాకుమాను లాంటి ప్ర‌తిభావంతులైన న‌టుల‌ను డైరెక్ట‌ర్ స‌రిగ్గా వాడుకోలేదు.

ఈ మ‌ధ్య కాలంలో స్టార్స్ స‌పోర్ట్ ఈ సినిమాకు దొరికినంత దేనికి దొర‌క‌లేదు. ఎన్టీఆర్‌, సూర్య ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌డం, మ‌హేష్‌బాబు పాజిటివ్ రివ్యూ ఇవ్వ‌డం.. క‌థ విని ఎమోష‌న‌ల్ అయ్యాన‌ని రాజ‌మౌళి అన‌డం.... సినిమా చూస్తున్న‌ప్పుడు ఇవ‌న్నీ గుర్తొస్తాయి. ఈ క‌థ‌తో ద‌ర్శ‌కుడు అంద‌రిని ఎలా ఒప్పించాడు...వారికి ఇందులో ఏం న‌చ్చింది అనే అనుమానం క‌లుగుతుంది.
ఓవ‌రాల్‌గా డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్స్‌...ఆడియెన్స్‌కు ట్ర‌బుల్‌....

Advertisement
Advertisement