త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brahmotsavam | వైభ‌వంగా గ‌రుడ సేవ‌.. గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిన తిరుమ‌ల గిరులు

Brahmotsavam | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ శనివారం వైభవంగా జరిగింది. గరుడవాహనంపై మలయప్ప స్వామివారు మాడవీధుల్లో విహరించగా.. స్వామివారి దర్శనం కోసం తిరుమల కొండకు భారీగా తరలివచ్చిన భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి.

P

Devotional | Published On Sep 19, 2026, 9.10 pm IST

Brahmotsavam | వైభ‌వంగా గ‌రుడ సేవ‌.. గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిన తిరుమ‌ల గిరులు
Advertisement

Brahmotsavam | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ శనివారం వైభవంగా జరిగింది. గరుడవాహనంపై మలయప్ప స్వామివారు మాడవీధుల్లో విహరించగా.. స్వామివారి దర్శనం కోసం తిరుమల కొండకు భారీగా తరలివచ్చిన భక్తులతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో ఏర్పాటు చేసిన గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. అడుగడుగునా ‘గోవిందా.. గోవిందా’ నామస్మరణలు మార్మోగాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వాహన మండపం నుంచి గరుడవాహన సేవ ప్రారంభమైంది. సర్వాంగ సుందరంగా అలంకరించిన మలయప్ప స్వామివారిని గరుడవాహనంపై ఆశీనులను చేశారు. వజ్ర వైఢూర్యాలు, విలువైన ఆభరణాలతో ఉత్సవమూర్తి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. శ్రీవిల్లిపుత్తూరు నుంచి తీసుకొచ్చిన గోదాదేవి అమ్మవారికి అలంకరించిన పూలమాలను స్వామివారికి సమర్పించారు. తమిళనాడులోని చెన్నై నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక ఛత్రాలను స్వామివారి వాహనసేవలో వినియోగించారు. గరుడవాహనంపై స్వామివారు కొలువుదీరగానే వాహన మండపం పరిసరాలు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగాయి. గ‌రుడ వాహ‌నంపై నుంచి స్వామివారిని వీక్షించి భ‌క్తులు ప‌ర‌వ‌శించిపోయారు.

మాడవీధుల్లో కనువిందు

గరుడవాహనంపై విహరించిన శ్రీవారికి మాడవీధుల్లోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు దర్శనం చేసుకునేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. వాహనాన్ని వివిధ ప్రాంతాల వైపు తిప్పుతూ భక్తులకు సులభంగా దర్శనం కల్పించారు. వాహనసేవ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో ముద్దాడ ర‌విచంద్ర, పాలకమండలి సభ్యులు, ప్రొటోకాల్‌ వీఐపీలు స్వామివారికి హారతి సమర్పించారు. గరుడసేవను పురస్కరించుకుని దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాలు సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తిరుమల మాడవీధులు, కొండ పరిసరాలు జనసంద్రంగా మారాయి. గరుడసేవకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ, పోలీసు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమల, తిరుపతిలో సుమారు వేల సంఖ్య‌లో మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రద్దీ నియంత్రణ చర్యలు చేపట్టారు.

గరుడసేవకు ప్రత్యేక ప్రాధాన్యం

బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు విశిష్ట స్థానం ఉంది. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో ఐదో రోజు నిర్వహించే ఈ సేవను దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటారు. గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు వాహనంగా, సేవకుడిగా ఉండటంతో గరుడవాహన సేవకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడిందని వైష్ణవ సంప్రదాయం చెబుతోంది. ఇతర వాహనసేవల్లో ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామివారు దర్శనమిస్తే.. గరుడసేవలో స్వామివారు ఒక్కరే గరుడవాహనంపై విహరించడం ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆనందనిలయంలోని ధ్రువమూర్తికి అలంకరించే కొన్ని ప్రత్యేక ఆభరణాలను మలయప్ప స్వామివారికి అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. గరుడసేవను పురాణాల్లో అత్యంత పుణ్యప్రదమైన సేవగా పేర్కొంటారు. ఈ సేవను తిలకించేందుకు ముక్కోటి దేవతలు సైతం తిరుమలకు వస్తారనే విశ్వాసం భక్తుల్లో ఉంది. దీంతో శనివారం జరిగిన గరుడవాహన సేవకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనంతో భక్తజనం పరవశించింది.

Advertisement
Advertisement