త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navaratri Brahmotsavam Special | 157 దేశాల కరెన్సీతో వెంకన్న హుండీ కళకళ!

Navaratri Brahmotsavam Special | తిరుమల శ్రీవారి హుండీ.. భక్తుల విశ్వాసానికి ప్రతీక. భక్తులు తమ శక్తికొద్దీ సమర్పించే కానుకలతో నిత్యం కళకళలాడే ఈ హుండీలో దేశీయ కరెన్సీతోపాటు విదేశీ నగదూ భారీగానే చేరుతోంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి ఆసియా దేశాల వరకు.. యూరప్‌ నుంచి మధ్యప్రాచ్యం వరకు పలు దేశాల నోట్లు, నాణేలు గోవిందుడి ఖజానాకు చేరుతున్నాయి.

P

Devotional | Published On Oct 14, 2026, 7.35 am IST

Navaratri Brahmotsavam Special | 157 దేశాల కరెన్సీతో వెంకన్న హుండీ కళకళ!
Advertisement
  • సరిహద్దులు దాటిన గోవిందుడి వైభవం..
  • పదేళ్లలో విదేశీ కరెన్సీతో రూ.201.65 కోట్ల ఆదాయం
  • అమెరికా డాలర్ల నుంచి పాక్‌ కరెన్సీ వరకు..
  • కానుకల రూపంలో ప్రపంచ దేశాల నగదు

Navaratri Brahmotsavam Special | తిరుమల శ్రీవారి హుండీ.. భక్తుల విశ్వాసానికి ప్రతీక. భక్తులు తమ శక్తికొద్దీ సమర్పించే కానుకలతో నిత్యం కళకళలాడే ఈ హుండీలో దేశీయ కరెన్సీతోపాటు విదేశీ నగదూ భారీగానే చేరుతోంది. అగ్రరాజ్యం అమెరికా నుంచి ఆసియా దేశాల వరకు.. యూరప్‌ నుంచి మధ్యప్రాచ్యం వరకు పలు దేశాల నోట్లు, నాణేలు గోవిందుడి ఖజానాకు చేరుతున్నాయి. ఇప్పటివరకు 157కుపైగా దేశాలకు చెందిన కరెన్సీని టీటీడీ అధికారులు గుర్తించడం విశేషం. 2015 నుంచి 2025 మార్చి వరకు విదేశీ నోట్లు, నాణేల మార్పిడి ద్వారా టీటీడీకి ఏకంగా రూ.201.65 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. కలియుగ వైకుంఠనాథుడి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందనడానికి ఈ కానుకలే నిదర్శనం.

1980 నుంచి విదేశీ కరెన్సీ ప్రవాహం

తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు నగదుతోపాటు బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం, వస్త్రాలు, బియ్యం, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, డీడీలు, చెక్కులు తదితర కానుకలు సమర్పిస్తుంటారు. వీటికి తోడు విదేశీ కరెన్సీ కూడా హుండీకి చేరుతోంది. 1980 నుంచి ఇతర దేశాల నోట్లు, నాణేలు తరచూ లభించడం మొదలైంది. 2007 వరకు పరిమిత సంఖ్యలో దేశాల కరెన్సీ కనిపించగా.. ఆ తర్వాత విదేశీ నగదు రాక గణనీయంగా పెరిగింది. 2021 నాటికి 157కుపైగా దేశాలకు చెందిన కరెన్సీ హుండీలో చేరినట్లు లెక్కింపు రికార్డులు వెల్లడించాయి.

అమెరికా, మలేషియా, సింగపూర్‌ కరెన్సీ అధికం

శ్రీవారి హుండీలో అమెరికా డాలర్లు, మలేషియా, సింగపూర్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కరెన్సీ ఎక్కువగా లభిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటితోపాటు బ్రిటిష్‌ పౌండ్లు, యూరోలు, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల కరెన్సీ కూడా కానుకల రూపంలో చేరుతోంది. పాకిస్తాన్‌కు చెందిన నోట్లు, నాణేలు సైతం హుండీలో లభించడం గమనార్హం. పరకామణి లెక్కింపుల సందర్భంగా వీటి వివరాలు రికార్డుల్లో నమోదవుతున్నాయి.

ఏటా రూ.కోట్ల ఆదాయం

విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా సైతం టీటీడీకి భారీ ఆదాయం సమకూరుతోంది. 2004లో సుమారు 10 టన్నుల విదేశీ కరెన్సీని విక్రయించడం ద్వారా దాదాపు రూ.కోటి ఆదాయం లభించింది. 2015లో విదేశీ కరెన్సీ ద్వారా రూ.44.81 కోట్ల ఆదాయం సమకూరినట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. 2016లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.వెయ్యి కోట్ల మార్కును దాటిన సమయంలో విదేశీ కరెన్సీ వాటా రూ.50.63 కోట్లుగా నమోదైంది. కరోనా సంక్షోభ కాలమైన 2020–21లోనూ విదేశీ కరెన్సీ రూపంలో రూ.1.92 కోట్లు హుండీకి చేరడం విశేషం. 2015 నుంచి 2025 మార్చి వరకు విదేశీ నోట్లు, నాణేల ద్వారా రూ.201,65,97,829 ఆదాయం వచ్చినట్లు అందుబాటులో ఉన్న రికార్డులు సూచిస్తున్నాయి. అంటే పదేళ్లలో సగటున ఏటా రూ.20 కోట్లకుపైగా ఆదాయం సమకూరినట్లయింది.

వేలం ద్వారా కరెన్సీ మార్పిడి

విదేశీ కరెన్సీని నేరుగా వినియోగించడం సాధ్యం కాకపోవడంతో టీటీడీ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన మనీ ఛేంజర్లకు వేలం ద్వారా విక్రయిస్తోంది. తద్వారా వాటిని భారతీయ కరెన్సీగా మార్చుకుని ఆదాయం పొందుతోంది. గతంలో విదేశీ నాణేలను బరువు ఆధారంగా విక్రయించేవారు. 2003 తర్వాత ఆయా దేశాల నామముద్రలు, విలువలను పరిగణనలోకి తీసుకునే పద్ధతిలో విక్రయాలు చేపట్టారు. విదేశీ విరాళాల నిర్వహణకు సంబంధించి ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలపై గతంలో వివాదం కూడా తలెత్తింది. హుండీలో భక్తులు సమర్పించే కానుకలను సాధారణ విదేశీ విరాళాలుగా కాకుండా స్వామివారికి సమర్పించిన కానుకలుగా పరిగణించే అంశంపై వివరణలు వ‌చ్చాయి. అనంతరం నిబంధనలకు అనుగుణంగా విదేశీ కరెన్సీ మార్పిడి ప్రక్రియ కొనసాగుతోంది.

భక్తికి సరిహద్దులు లేవు..

దేశాలు, భాషలు, సంస్కృతులు వేరైనా శ్రీవేంకటేశ్వరస్వామిపై భక్తి మాత్రం అందరినీ ఒక్కటి చేస్తోంది. వివిధ దేశాల కరెన్సీ హుండీకి చేరడం వెనుక ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన శ్రీవారి భక్తజన సందోహం కనిపిస్తోంది. ప్రతి నోటు, ప్రతి నాణెం వెనుక ఓ భక్తుడి విశ్వాసం, ఓ మొక్కు, ఓ ప్రార్థన దాగి ఉన్నాయి. అందుకే తిరుమల హుండీ కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు.. సరిహద్దులు దాటిన గోవిందుడి వైభవానికి, భక్తుల అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది.

Advertisement
Advertisement