త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Diwali 2026 | నరక బాధలకు చెక్‌.. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక నరక చతుర్దశి

Diwali 2026 | చెడుపై మంచి విజయం.. చీకటిపై వెలుగుల గెలుపు.. భక్తి, భక్తిభావం, ఆనందోత్సాహాల కలయికే దీపావళి పర్వదినం. ఈసారి నరక చతుర్దశి, దీపావళి ఒకే రోజు రావడంతో పండుగకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. నరకాసురుడి సంహారానికి ప్రతీకగా నరక చతుర్దశిని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగించే వేడుకగా దీపావళిని జరుపుకుంటారు.

P

Devotional | Published On Nov 8, 2026, 6.01 am IST

Diwali 2026 | నరక బాధలకు చెక్‌.. చెడుపై మంచి గెలుపునకు ప్రతీక నరక చతుర్దశి
Advertisement
  • తెల్లవారుజామునే అభ్యంగన స్నానాలు..
  • యముడికి దీపదానం, తర్పణాలతో విశేష పూజలు
  • నరకాసురుడి సంహారంతో పండుగకు ఆరంభం..
  • మనసులోని దుర్గుణాలను తొలగించుకోవడమే అసలైన పండుగ సందేశం

Diwali 2026 | చెడుపై మంచి విజయం.. చీకటిపై వెలుగుల గెలుపు.. భక్తి, భక్తిభావం, ఆనందోత్సాహాల కలయికే దీపావళి పర్వదినం. ఈసారి నరక చతుర్దశి, దీపావళి ఒకే రోజు రావడంతో పండుగకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. నరకాసురుడి సంహారానికి ప్రతీకగా నరక చతుర్దశిని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగించే వేడుకగా దీపావళిని జరుపుకుంటారు. తెల్లవారుజామున అభ్యంగన స్నానాలు, యమ తర్పణాలు, దీపదానాలతో మొదలై.. సాయంత్రం లక్ష్మీపూజలు, దీపాలంకరణలతో ఇళ్లన్నీ వెలుగులతో నిండిపోనున్నాయి. పురాణ ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక సందేశం కలగలిసిన ఈ పర్వదినం చెడును విడిచి మంచిని ఆచరించాలనే గొప్ప సందేశాన్ని అందిస్తోంది. వీటిని ఆచరించడం వల్ల పాపాలు తొలగి, నరక బాధల నుంచి విముక్తి లభిస్తుందని పురాణ విశ్వాసం.

నరకాసురుడి అంతమే పండుగకు నాంది

నరక చతుర్దశి వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. భూదేవి కుమారుడైన నరకాసురుడు అపారమైన శక్తి, అధికార గర్వంతో లోకాలను పీడించసాగాడు. దేవతలను హింసించడమే కాకుండా అనేక మంది స్త్రీలను బందీలుగా మార్చి వారి స్వేచ్ఛను హరించాడు. అతని అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధం చేసి నరకాసురుడిని సంహరించాడు. తన మరణానికి ముందు నరకాసురుడు ప్రజలంతా ఆ రోజును ఆనందంగా పండుగలా జరుపుకోవాలని కోరినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. దీంతో అతడి సంహారాన్ని చెడుపై మంచి విజయంగా భావిస్తూ నరక చతుర్దశిని జరుపుకోవ‌డం ఉన‌వాయితీగా వ‌స్తోంది. నరకాసురుడి చెర నుంచి స్త్రీలకు విముక్తి కల్పించిన ఈ ఘట్టం స్త్రీ స్వేచ్ఛకు ప్రతీకగా కూడా నిలుస్తోంది.

తెల్లవారుజామున అభ్యంగన స్నానం ఎందుకు?

నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ పవిత్ర సమయంలో నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, స్నానానికి ఉపయోగించే నీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున చేసే అభ్యంగన స్నానానికి విశేష ప్రాధాన్యం ఉంది. స్నానం చేసే సమయంలో తల చుట్టూ దీపం తిప్పడం, అనంతరం దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. నరకాసురుడి వధకు ముందు శ్రీకృష్ణుడు ప్రసాదించిన వరం కారణంగా ఈ రోజున స్నానం చేసినవారికి పాప విముక్తి కలుగుతుందని భ‌క్తుల విశ్వాసం.

యముడికి తర్పణం.. పితృదేవతలకు దీపదానం

నరక చతుర్దశిని ప్రేత చతుర్దశి అని సైతం పిలుస్తారు. ఈ రోజున యమధర్మరాజును స్మరించి పూజించడం, ఆయనకు తర్పణం ఇవ్వడం విశేష ఫలప్రదమని పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానం అనంతరం దక్షిణాభిముఖంగా నిలబడి నువ్వులతో మూడుసార్లు యముడికి తర్పణం సమర్పించడం ఆచారం. అలాగే యమధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేయాలని 'వ్రత చూడామణి' పేర్కొంటోంది. చతుర్దశి రోజున నరకలోకవాసుల కోసం దీపాలు వెలిగిస్తే వారి పితృదేవతలకు నరకం నుంచి విముక్తి కలిగి స్వర్గప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. సూర్యాస్తమయం తర్వాత ఇంటి ముంగిట, పడకగదిలో దీపాలు వెలిగించడం ఈ పర్వదినంలోని మరో విశేషం. యముడిని పూజించి, మినుములతో చేసిన పదార్థాలను స్వీకరించడం కూడా సంప్రదాయంలో భాగంగా కొనసాగుతోంది.

నరక చతుర్దశి.. దీపావళికి అనుబంధం

నరక చతుర్దశి మరుసటి రోజే దీపావళి అమావాస్య. ఒకటి నరకాసురుడి సంహారాన్ని గుర్తుచేస్తే.. మరొకటి చీకటిపై వెలుగు విజయాన్ని చాటుతుంది. నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానాలు, యమ తర్పణాలు, దీపదానాలతో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించి, ఇంటిల్లిపాదీ దీపాలు వెలిగిస్తూ సిరిసంపదలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటారు. ఇలా ఈ రెండు పర్వదినాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విడదీయలేని భాగంగా నిలిచాయి.

అదే అస‌లైన సందేశం..

నరక చతుర్దశి వెనుక మరో గొప్ప ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. మనిషిలోని అహంకారం, అసూయ, ద్వేషం, అత్యాశ వంటి దుర్గుణాలే నరకానికి దారితీసే భావాలని పెద్దలు వివరిస్తారు. వాటిని భగవద్భక్తి అనే ఆయుధంతో జయించి సత్ప్రవర్తనతో జీవించాలని ఈ పండుగ సూచిస్తుంది. నరకాసురుడి సంహారం అంటే కేవలం ఒక రాక్షసుడి అంతం మాత్రమే కాదు.. మనలోని చెడును అంతం చేసుకోవడానికి ఇచ్చిన సందేశం కూడా. ఇంటి ముందు దీపాలు వెలిగించడంతోపాటు మనసులోని అజ్ఞానాంధకారాన్ని తొలగించుకున్నప్పుడే నరక చతుర్దశి పర్వదినానికి నిజమైన సార్థకత చేకూరుతుంది.

Advertisement
Advertisement