త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chilkur Balaji Temple | వ‌ర్షాలు కుర‌వాల‌ని చిలుకూరు బాలాజీ ఆలయంలో ‘వేణునాదం’..!

Chilkur Balaji Temple | సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చారిత్రాత్మక చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం ప్రత్యేకంగా “వేణునాదం” కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యేష్ఠ అమావాస్య, రోహిణి నక్షత్రం క‌లిసిరావ‌డంతో దివ్య వేణుగాన సేవను ఆలయ నిర్వాహకులు నిర్వహించారు.

P

Devotional | Published On Jun 14, 2026, 8.57 pm IST

Chilkur Balaji Temple | వ‌ర్షాలు కుర‌వాల‌ని చిలుకూరు బాలాజీ ఆలయంలో ‘వేణునాదం’..!
Advertisement

Chilkur Balaji Temple | సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చారిత్రాత్మక చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం ప్రత్యేకంగా “వేణునాదం” కార్యక్రమాన్ని నిర్వహించారు. జ్యేష్ఠ అమావాస్య, రోహిణి నక్షత్రం క‌లిసిరావ‌డంతో దివ్య వేణుగాన సేవను ఆలయ నిర్వాహకులు నిర్వహించారు. సనాతన సంప్రదాయంలో జ్యేష్ఠ అమావాస్య, రోహిణి నక్షత్రం కలయికను వ్యవసాయ సౌభాగ్యం, ప్రకృతి అనుగ్రహం, సమృద్ధిగా వర్షాలు కురిసే సూచకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో సమాజ శ్రేయస్సు, ప్రకృతి సమతుల్యత, రైతాంగ సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో వేణు విద్వాంసుడు అనంత కృష్ణ తన మధురమైన వేణుగానంతో భక్తులను ఆకట్టుకున్నారు. ఆయనకు వెంకట నాగ సాయి శర్మ మృదంగంపై, పవన్ సింగ్ వయోలిన్‌తో స‌హ‌కారం అందించారు. సంగీతం, భక్తి, ఆధ్యాత్మికత మేళవింపుగా సాగిన ఈ కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆధ్యాత్మిక వెల్లివిరిసింది.

రైతులకు అనుకూలంగా వర్షాలు కురవాలని, భూగర్భ జలాలు పెర‌గాల‌ని, ఎండల తీవ్రత తగ్గి ప్రజలకు ఉపశమనం కలగాలని ఈ సందర్భంగా సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే ప్రకృతి సంపదలు పరిరక్షించబడుతూ పర్యావరణ సమతుల్యత నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి వాణిజ్య అంశాలు, ప్రవేశ రుసుములు, ప్రచార ఉద్దేశాలు లేకుండా పూర్తిగా నిష్కామ ప్రార్థన రూపంలో నిర్వహించడం విశేషం. సంగీతాన్ని దైవారాధనకు శ్రేష్ఠ సాధనంగా భావించే సనాతన సంప్రదాయానికి అనుగుణంగా నిర్వహించిన “వేణునాదం” ద్వారా ప్రకృతి, మానవ సమాజం మధ్య సామరస్యాన్ని కోరుతూ భక్తులు ప్రార్థనలు చేశారు. కార్యక్రమం ముగింపులో “సర్వే జనాః సుఖినో భవంతు”, “లోకాః సమస్తాః సుఖినో భవంతు” మంగళాశాసనాలతో ప్రత్యేక పూజ‌లు చేశారు. సమస్త ప్రజలు, పశుపక్ష్యాదులు, ప్రకృతి సంపదలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి భూమి పచ్చదనంతో కళకళలాడాలని చిలుకూరు బాలాజీ దేవాలయం ఆకాంక్షించింది.

Advertisement
Advertisement