త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brahmotsavalu 2026 | తిరుమల వెంకన్న తొమ్మిది రోజుల ఉత్సవం వెనుక వెయ్యేళ్ల చరిత్ర..!

Brahmotsavalu 2026 | తొమ్మిది రోజుల ఉత్సవం.. కానీ వెనుక వెయ్యేళ్ల చరిత్ర! తిరుమల మాడ వీధుల్లో నేడు కనిపించే బ్రహ్మోత్సవ వైభవానికి ప్రతి అడుగులోనూ ఓ చారిత్రక ఆనవాలు ఉంది. ఆలయ గోడలపై చెక్కిన శాసనాలు.. రాజులు, రాణులు, సామంతులు, భక్తుల దానధర్మాలు.. ఆలయ పరిపాలనలో వచ్చిన మార్పులు.. ఆగమ సంప్రదాయాలు.. కాలానుగుణంగా చేరిన ఉత్సవాలు.. ఇలా ఎన్నో పరిణామాలు కలగలిసి నేటి బ్రహ్మోత్సవ వైభవానికి రూపమిచ్చాయి.

P

Devotional | Published On Sep 13, 2026, 9.20 am IST

Brahmotsavalu 2026 | తిరుమల వెంకన్న తొమ్మిది రోజుల ఉత్సవం వెనుక వెయ్యేళ్ల చరిత్ర..!
Advertisement
  • శాసనాల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాల విశిష్టత
  • వెయ్యేళ్లకుపైగా కొనసాగుతున్న ఉత్సవ సంప్రదాయం
  • రాజుల కాలం నుంచి టీటీడీ నిర్వహణ వరకు.. మారుతూ వచ్చిన వైభవం

Brahmotsavalu 2026 | తొమ్మిది రోజుల ఉత్సవం.. కానీ వెనుక వెయ్యేళ్ల చరిత్ర! తిరుమల మాడ వీధుల్లో నేడు కనిపించే బ్రహ్మోత్సవ వైభవానికి ప్రతి అడుగులోనూ ఓ చారిత్రక ఆనవాలు ఉంది. ఆలయ గోడలపై చెక్కిన శాసనాలు.. రాజులు, రాణులు, సామంతులు, భక్తుల దానధర్మాలు.. ఆలయ పరిపాలనలో వచ్చిన మార్పులు.. ఆగమ సంప్రదాయాలు.. కాలానుగుణంగా చేరిన ఉత్సవాలు.. ఇలా ఎన్నో పరిణామాలు కలగలిసి నేటి బ్రహ్మోత్సవ వైభవానికి రూపమిచ్చాయి. ఈ చరిత్రకు పురాణ కథనాలతో పాటు తిరుమల ఆలయంలోని శాసనాలు కూడా కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయి. ఆలయ ప్రాకారాల గోడలపై చెక్కిన శాసనాలు, టీటీడీ ప్రచురించిన శాసన సంపుటాలు, చారిత్రక గ్రంథాలు.. శ్రీవారి ఉత్సవాల క్రమానుగత పరిణామాన్ని కళ్లకు కడుతున్నాయి.

బ్రహ్మతో ప్రారంభమైందని విశ్వాసం

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. వేంకటాద్రిపై శ్రీనివాసుడు వెలసిన సందర్భంగా బ్రహ్మదేవుడు స్వామివారికి ఉత్సవాలు నిర్వహించాడని పురాణ కథనం. అందుకే వీటికి ‘బ్రహ్మోత్సవాలు’ అనే పేరు వచ్చిందని విశ్వాసం. అయితే, చారిత్రక ఆధారాల విషయానికి వస్తే.. శాసనాలు మరింత స్పష్టమైన చిత్రాన్ని అందిస్తున్నాయి. సామాన్యశకం 966 సంవత్సరం తిరుమల ఉత్సవాల చరిత్రలో ముఖ్యమైన మైలురాయిగా చెప్పొచ్చు. పల్లవ వంశానికి చెందిన రాణి సామవై పెరుందేవి శ్రీ వేంకటేశ్వరస్వామివారికి వెండి భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించింది. ఆభరణాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు అవసరమైన భూములను కూడా దానం చేసింది. ఆమెకు సంబంధించిన దానశాసనం తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారం ఉత్తర గోడపై ఉంది. ఈ శాసనం ద్వారా 10వ శతాబ్దానికే స్వామివారి ఉత్సవాలు ఒక నిర్దిష్ట వ్యవస్థతో జరుగుతున్నట్లు తెలుస్తోంది. పురట్టాసి మాసంలో ప్రధాన బ్రహ్మోత్సవంతో పాటు మార్గళి మాసంలో మరో బ్రహ్మోత్సవం నిర్వహించేలా సామవై ఏర్పాట్లు చేసినట్లు శాసనం తెలియజేస్తోంది. ఆమె సమర్పించిన భోగ శ్రీనివాసమూర్తి కూడా ఆలయ ఉత్సవ సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని సంపాదించింది.

రెండింటి నుంచి ఐదుకు.. అలా పెరిగిన ఉత్సవాలు

తిరుమలలో బ్రహ్మోత్సవాల సంఖ్య కాలక్రమంలో పెరుగుతూ వచ్చింది. చోళుల కాలంలో కొత్త ఉత్సవాలు చేరాయి. వీర నరసింహ యాదవరాయ కాలానికి పాంగుని బ్రహ్మోత్సవం ఆపాదించబడింది. సామాన్యశకం 1254లో విజయ గండగోపాలదేవుని కాలంలో చిత్తిరై బ్రహ్మోత్సవం ప్రారంభమైనట్లు ఆధారాలున్నాయి. తర్వాత 1300–1330 మధ్యకాలంలో యాదవరాయుల ఆధ్వర్యంలో ఆడి బ్రహ్మోత్సవం కూడా చేరింది. దీంతో విజయనగర సామ్రాజ్య ఆవిర్భావానికి ముందే తిరుమలలో సంవత్సరానికి ఐదు బ్రహ్మోత్సవాలు జరిగే స్థాయికి సంప్రదాయం విస్తరించింది.

విజయనగర కాలంలో ఉత్సవాలకు కొత్త వైభవం

తిరుమల ఉత్సవ చరిత్రలో విజయనగర సామ్రాజ్య కాలాన్ని కీలక దశగా పేర్కొనవచ్చు. సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు వంశాల పాలనలో స్వామివారి ఆలయానికి రాజపోషణ విస్తరించింది. కొత్త ఉత్సవాలు చేరడంతో పాటు అప్పటికే ఉన్న ఉత్సవాల నిర్వహణకు మరింత ప్రాధాన్యం లభించింది. 15వ శతాబ్దానికి వచ్చేసరికి సంవత్సరంలో అనేక బ్రహ్మోత్సవాలు నిర్వహించే స్థాయికి తిరుమల చేరింది. విజయనగర సామ్రాజ్య చివరి దశలో అయితే శాసనాల్లో ఏడాదికి పది బ్రహ్మోత్సవాల వరకు ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. 1539 నుంచి 1616 మధ్యకాలపు శాసనాలు దీనికి ఆధారాలుగా నిలుస్తున్నాయి. దీంతో నేటి ప్రధాన బ్రహ్మోత్సవం వెనుక ఒకప్పుడు ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు నిర్వహించిన సుదీర్ఘ సంప్రదాయం ఉందని తెలుస్తోంది.

కృష్ణదేవరాయల సేవలూ ప్రత్యేకమే

తిరుమల చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల సేవలు చిరస్మరణీయం. శాసనాల ప్రకారం 1513 ఫిబ్రవరి 10న ఆయన తొలిసారి తిరుమలను దర్శించినట్లు తెలుస్తోంది. తన జన్మమాసమైన తై మాసంలో 1513లో మరో బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. స్వామివారికి ఆయన సమర్పించిన ఆభరణాలు, ఇతర కానుకలతో పాటు ఉత్సవాల విస్తరణలోనూ ఆయన పాత్ర ఉందని ఇది స్పష్టం చేస్తోంది. కృష్ణదేవరాయల అనంతరం అచ్యుతరాయల పాలనలోనూ తిరుమల ఉత్సవాలకు రాజపోషణ కొనసాగింది. 1533లో కార్తీక బ్రహ్మోత్సవానికి సంబంధించిన ప్రస్తావన శాసనాల్లో కనిపించగా.. 1534లో ఈ ఉత్సవానికి విరాళం అందించినట్లు మరో శాసనం పేర్కొంటోంది. అదే సమయంలో 1539లో తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం ఏర్పడింది. దీంతో వార్షిక బ్రహ్మోత్సవాల సంఖ్య మరింత పెరిగింది. కాలానుగుణంగా కొన్ని ఉత్సవాలు కొత్తగా చేరడం.. కొన్ని మార్పులకు లోనవడం.. మరికొన్ని క్రమంగా కనుమరుగవడం.. ఇలా తిరుమల ఉత్సవ సంప్రదాయం నిరంతరం పరిణామం చెందుతూ వచ్చింది.

మలయప్పస్వామి.. ఉత్సవాలకు కేంద్రబిందువు

బ్రహ్మోత్సవాల పరిణామంలో ఉత్సవమూర్తి మార్పు కూడా అత్యంత కీలక ఘట్టం. 1339 ప్రాంతం నుంచి మలయప్పస్వామివారు ఉత్సవమూర్తిగా ఉన్నట్లు శాసన ఆధారాలు సూచిస్తున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారికి వివాహోత్సవాలు, ఇతర ఉత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది. నేడు బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలకు మలయప్పస్వామివారే కేంద్రంగా ఉండటానికి చారిత్రక నేపథ్యం ఇదే.

మహంతుల పాలన నుంచి టీటీడీ వరకు

కాలక్రమంలో తిరుమల ఆలయ పరిపాలనలోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 1843లో ఆలయ నిర్వహణ బాధ్యతలు హథీరాంజీ మఠాధిపతుల ఆధీనంలోని మహంతులకు అప్పగించబడ్డాయి. ఈ వ్యవస్థ 1933 వరకు కొనసాగింది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడటంతో మహంతుల పాలనకు ముగింపు పలికి.. ఆలయాల నిర్వహణ కొత్త సంస్థాగత వ్యవస్థలోకి వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మోత్సవాల నిర్వహణ కూడా మరింత విస్తృత రూపం సంతరించుకుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా వసతి, రవాణా, భద్రత, వైద్య సేవలు, అన్నప్రసాదం, సమాచార వ్యవస్థ, ప్రత్యక్ష ప్రసారాలు తదితర విభాగాలను సమన్వయం చేస్తూ టీటీడీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.

శాసనాల్లో చరిత్ర

  • సామాన్యశకం 966 – పల్లవ రాణి సామవై పెరుందేవి దానశాసనం. భోగ శ్రీనివాసమూర్తి సమర్పణ, భూములు, ఆభరణాల దానం. పురట్టాసి, మార్గళి ఉత్సవాలు షురూ.
  • 1209–1263 – వీర నరసింహ యాదవరాయ కాలానికి పాంగుని బ్రహ్మోత్సవం ఆపాదన.
  • 1254 – విజయ గండగోపాలదేవుని కాలంలో చిత్తిరై బ్రహ్మోత్సవం.
  • 1300–1330 – యాదవరాయుల కాలంలో ఆడి బ్రహ్మోత్సవం చేరిక.
  • 1339 ప్రాంతం – మలయప్పస్వామి ఉత్సవమూర్తిగా ప్రాచుర్యంలోకి వచ్చిన దశ.
  • 14–15వ శతాబ్దాలు – విజయనగర పాలకుల కాలంలో బ్రహ్మోత్సవాల సంఖ్య, వైభవం గణనీయంగా విస్తరణ.
  • 1513 – శ్రీకృష్ణదేవరాయలు తై మాసంలో కొత్త బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేసిన కాలం.
  • 1533–1534 – కార్తీకై బ్రహ్మోత్సవానికి శాసన ఆధారాలు.
  • 1539 – తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం. వార్షిక బ్రహ్మోత్సవాల సంఖ్య పది దశకు చేరిన కాలం.
  • 1803 – మెకంజీ సర్వేలో తిరుమలలో 28 ఉత్సవాల ప్రస్తావన.
  • 1843 – హథీరాంజీ మఠ మహంతుల ఆధీనంలోకి ఆలయ పరిపాలన.
  • 1933 – తిరుమల తిరుపతి దేవస్థానముల ఏర్పాటు. మహంతుల పరిపాలనకు ముగింపు.
Advertisement
Advertisement