త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wife Drugging Rape Case | భార్యకు తెలియకుండా 20 ఏళ్లుగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన భర్త

భార్యకు తెలియకుండా 20 ఏళ్లుగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు యూకేకు చెందిన భర్త కోర్టులో అంగీకరించాడు. బాధితురాలి సమక్షంలోనే నేరాన్ని ఒప్పుకున్నాడు.

J

Crime | Published On Sep 15, 2026, 5.06 pm IST

Wife Drugging Rape Case | భార్యకు తెలియకుండా 20 ఏళ్లుగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన భర్త

సంక్షిప్త సారాంశం

బ్రిటన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి 20 ఏళ్లకు పైగా లైంగిక దాడికి పాల్పడినట్లు కోర్టు ఎదుట ఒప్పుకున్నాడు. 2004 నుంచి 2025 మధ్య కాలంలో అత్యాచారం, మత్తుమందు ఇవ్వడం సహా దాదాపు 60 తీవ్ర నేరాలకు పాల్పడినట్లు నిందితుడు న్యాయమూర్తి ఎదుట అంగీకరించాడు. కోర్టు విచారణ సమయంలో బాధితురాలు తన కుటుంబ సభ్యుల మద్దతుతో పబ్లిక్ గ్యాలరీలో కూర్చుని ప్రత్యక్షంగా చూసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 12 మంది నిందితులు తమపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించగా, విచారణ కొనసాగుతోంది.

Advertisement
  • 20 ఏళ్లుగా భార్యకు మత్తుమందు ఇచ్చి ఘోరాలు
  • కోర్టులో నిజాలు ఒప్పుకున్న భర్త

Wife Drugging Rape Case | త్రినేత్ర.న్యూస్ : బ్రిటన్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 20 ఏళ్లకు పైగా తన భార్యకు ఆమెకు తెలియకుండానే ఆహారంలో మత్తుమందు (డ్రగ్స్) కలిపిచ్చి.. నిరంతరం లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ భర్త న్యాయస్థానం ఎదుట ఒప్పుకున్నాడు. గ్రేటర్ మాంచెస్టర్‌లోని స్టాక్‌పోర్ట్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు మాంచెస్టర్ మిన్‌షుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టులో హాజరై తన తప్పులను బహిరంగంగా అంగీకరించాడు. చట్టపరంగా బాధితురాలి గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు.

2004 నుంచి 2025 వరకు సాగిన ఈ దారుణాల్లో అత్యాచారం, లైంగిక దాడి, ఉద్దేశపూర్వకంగా మత్తుమందు ఇవ్వడం సహా మొత్తం 60 తీవ్ర నేరాలకు పాల్పడినట్లు ఆ వ్యక్తి కోర్టులో నేరాంగీకారం చేశాడు. నిందితుడు న్యాయమూర్తి ముందు నిలబడి భావోద్వేగానికి గురవుతూ ప్రతి నేరారోపణకు "నేరం చేశాను" (Guilty) అని అంగీకరించిన సమయంలో.. బాధితురాలు తన కుటుంబ సభ్యుల మద్దతుతో కోర్టు గ్యాలరీలోనే కూర్చుని ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసింది.

ఫోటోలు తీసి ఇతరులతో పంచుకున్న వైనం

తన భార్య అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆమెకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను తీసి ఇతరులతో పంచుకున్నట్లు నిందితుడు గతంలోనే ఒప్పుకున్నాడు. ఈ అకృత్యాల కేసులో ప్రధాన నిందితుడితో పాటు 28 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న మరో 12 మందిపై కూడా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అయితే, ఆ 12 మంది మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నిరాకరించారు. ఇప్పటికే 13వ నిందితుడు తన తప్పును అంగీకరించగా, మిగిలిన వారిపై విచారణ కొనసాగుతోంది.

బాధితురాలికి అండగా ఉంటాం: పోలీసులు

ఈ కేసు అత్యంత సంక్లిష్టమైనదని, బాధితురాలికి పూర్తి స్థాయి న్యాయం, వైద్య, మానసిక సహాయం అందేలా చూస్తున్నామని గ్రేటర్ మాంచెస్టర్ అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ రిక్ జాక్సన్ తెలిపారు. డ్రగ్స్ ఆధారిత లైంగిక వేధింపుల బారిన పడిన వారు ఎవరైనా ఉంటే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని.. స్పష్టమైన ఆధారాలు లేకపోయినా అలాంటి ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ దారుణాలపై రాబోయే వారాల్లోనూ న్యాయస్థానంలో తుది విచారణ కొనసాగనుంది.

Advertisement
Advertisement