త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Poison Plot | మొహర్రం ఊరేగింపులో ఎలుకల మందుతో మారణహోమానికి స్కెచ్.. ముంబైలో 15 వేల విషపు క్యాప్సూల్స్ సీజ్

ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా జనాలకు పంపిణీ చేయడానికి తీసుకొచ్చిన 14,900 ఎలుకల మందు క్యాప్సూల్స్‌ను పోలీసులు సీజ్ చేసి, ఒక వ్యాపారిని అరెస్ట్ చేశారు.

J

Crime | Published On Jun 27, 2026, 7.18 pm IST

Mumbai Poison Plot | మొహర్రం ఊరేగింపులో ఎలుకల మందుతో మారణహోమానికి స్కెచ్.. ముంబైలో 15 వేల విషపు క్యాప్సూల్స్ సీజ్
Advertisement
  • ముంబైలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకున్న భారీ కుట్రను భగ్నం చేసిన పోలీసులు
  • పుణెకు చెందిన ఫయాజ్ ప్రేమ్‌జీ అనే వ్యాపారి నుంచి 14,900 విషపు క్యాప్సూల్స్ సీజ్
  • 50 కిలోల ఎలుకల మందు (జింక్ ఫాస్ఫైడ్) కొనుగోలు చేసి, క్యాప్సూల్స్‌లో నింపినట్లు గుర్తింపు
  • నిందితుడు గత ఏడాది కాలంలోనే 19 సార్లు ఇరాన్, ఇరాక్ దేశాల్లో పర్యటించినట్లు వెల్లడి

Mumbai Poison Plot | త్రినేత్ర.న్యూస్ : ముంబై (Mumbai) నగరంలో పోలీసులు ఒక పెను ప్రమాదాన్ని తప్పించారు. మొహర్రం (Muharram) ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని భారీ ప్రాణనష్టం కలిగించేందుకు పన్నిన ఒక భయంకరమైన కుట్రను భగ్నం చేశారు. ఎలుకల మందు (Rat poison) నింపిన సుమారు 14,900 క్యాప్సూల్స్‌ను పంపిణీ చేయడానికి సిద్ధమైన పుణెకు చెందిన ఒక వ్యాపారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

అసలేం జరిగింది?

ముంబైలోని జేజే, బైకుల్లా ప్రాంతాల్లో మొహర్రం ఊరేగింపు జరుగుతుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు.. అక్కడే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

నిందితుడు ఎవరు? ప్లాన్ ఏంటి?

అరెస్టయిన వ్యక్తిని పుణెలోని విమాన్ నగర్‌కు చెందిన ఫయాజ్ ప్రేమ్‌జీగా గుర్తించారు. ఇతను పుణెలో పెయింట్ బిజినెస్ చేస్తుంటాడు. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్‌లో ఉంటూ ఈ కుట్రకు ప్లాన్ చేశాడు. సుమారు 50 కిలోల 'జింక్ ఫాస్ఫైడ్' (Zinc phosphide) అనే ఎలుకల మందును కొనుగోలు చేసి, రోజుల తరబడి స్వయంగా దాన్ని క్యాప్సూల్స్‌లో నింపాడు. ఒక్కో క్యాప్సూల్‌లో సుమారు ఒక గ్రాము విషాన్ని నింపినట్లు పోలీసులు గుర్తించారు.

దాదాపు 30 వేల క్యాప్సూల్స్ తయారు చేయాలని ప్లాన్ చేయగా, 14,900 క్యాప్సూల్స్‌తో ఉండగానే పోలీసులకు చిక్కాడు. మొహర్రం ఊరేగింపులో జనాలకు వీటిని పంపిణీ చేసి మారణహోమం సృష్టించాలనేదే తన లక్ష్యమని అతడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఇరాన్, ఇరాక్ పర్యటనలపై అనుమానాలు

విచారణలో ఫయాజ్ గురించి సంచలన విషయాలు తెలిశాయి. 2019 నుంచి 2025 మధ్య కాలంలో అతడు పలుమార్లు ఇరాన్, ఇరాక్ దేశాలకు వెళ్లాడు. ముఖ్యంగా గత ఏడాది కాలంలోనే ఏకంగా 19 సార్లు ఆయా దేశాల్లో పర్యటించాడు. ఫయాజ్ సోదరి ప్రస్తుతం ఇరాన్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తుండగా, అతని తల్లి కూడా అక్కడే ఉన్నట్లు తేలింది. భార్యకు విడాకులు ఇచ్చిన ఫయాజ్.. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. ఇతను షియా ఖోజా ముస్లిం వర్గానికి చెందినవాడు కావడం గమనార్హం.

లోతైన దర్యాప్తు

ముంబై పోలీసులు ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 109, 110, 123 కింద హత్యాయత్నం, విషప్రయోగం కేసులు నమోదు చేశారు. అతని మొబైల్ ఫోన్, డిజిటల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఇదంతా అతనొక్కడే చేశాడా? లేక దీని వెనుక ఏదైనా పెద్ద ఉగ్రవాద నెట్‌వర్క్ (Network) ఉందా? అనే కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. సరైన సమయంలో పోలీసులు స్పందించడంతో ముంబైలో ఒక పెను విషాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement