త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Faridabad OYO Hotel Case | కాలేజీకని చెప్పి ప్రియుడితో ఓయో హోటల్‌కు.. మరుసటి రోజు విగతజీవిగా 19 ఏళ్ల విద్యార్థిని!

కాలేజీకని చెప్పి ప్రియుడితో ఓయో హోటల్‌కు వెళ్లిన డీయూ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. రూమ్‌లో దొరికిన ఓ లెటర్ కేసును కొత్త మలుపు తిప్పింది.

J

Crime | Published On Nov 25, 2026, 8.51 am IST

Faridabad OYO Hotel Case | కాలేజీకని చెప్పి ప్రియుడితో ఓయో హోటల్‌కు.. మరుసటి రోజు విగతజీవిగా 19 ఏళ్ల విద్యార్థిని!

సంక్షిప్త సారాంశం

కాలేజీకి వెళ్తున్నానని చెప్పి నవంబర్ 23న ఇంటి నుంచి బయలుదేరిన 19 ఏళ్ల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, తన ప్రియుడు విపిన్ యాదవ్‌తో కలిసి ఫరీదాబాద్‌లోని ఓయో హోటల్‌కు వెళ్లింది. మరుసటి రోజు (మంగళవారం) హోటల్ గదిలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించగా, నోరు, ముక్కు నుంచి నురుగు రావడాన్ని సిబ్బంది గుర్తించారు. ఘటనా స్థలంలో ఎలుకల మందు డబ్బాతో పాటు, తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ప్రియుడు రాసిన ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 10 గంటలకే హోటల్ నుంచి నడుచుకుంటూ పరారైన ప్రియుడిపై హత్య కేసు (BNS సెక్షన్ 103(1)) నమోదు చేసిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Advertisement
  • రూమ్‌లో లభించిన ఆ లెటర్‌తో సంచలన ట్విస్ట్

Faridabad OYO Hotel Case | త్రినేత్ర న్యూస్ : హర్యానాలోని ఫరీదాబాద్‌లో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ (DU)కి చెందిన 19 ఏళ్ల బీకామ్ విద్యార్థిని ఫరీదాబాద్ సెక్టార్ 37 (సరాయ్ ఖ్వాజా ప్రాంతం)లోని ఒక ఓయో (OYO) హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం (నవంబర్ 24) వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

అసలేం జరిగింది?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌లోని ధౌజ్ గ్రామానికి చెందిన యువతి ఢిల్లీ యూనివర్సిటీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది. పొరుగింట్లో ఉండే విపిన్ యాదవ్ (26) అనే యువకుడితో ఆమె ప్రేమలో ఉంది. సోమవారం (నవంబర్ 23) ఉదయం 9 గంటల సమయంలో కాలేజీకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి ఆమె ఇంటి నుంచి బయలుదేరింది. అయితే, కాలేజీకి బదులుగా విపిన్ యాదవ్‌తో కలిసి బైక్‌పై సెక్టార్ 37లోని 'హోటల్ జోయా గ్రాండ్'కు వెళ్లి, ఉదయం 10-11 గంటల మధ్య రూమ్ తీసుకుంది.

ఫోన్ స్విచ్ ఆఫ్.. మరుసటి రోజు మృతదేహంగా

సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో యువతి చివరిసారిగా తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడింది. సాయంత్రం 4 గంటల తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది.

ఇదిలా ఉండగా, మంగళవారం గది ఖాళీ చేసే సమయం దాటినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. డూప్లికేట్ తాళం చెవితో తలుపు తెరిచి చూడగా, మంచంపై యువతి విగతజీవిగా పడి ఉంది. వెంటనే వారు సరాయ్ ఖ్వాజా పోలీసులకు సమాచారం అందించారు.

ఎలుకల మందు డబ్బా.. ప్రియుడి సూసైడ్ నోట్

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా, యువతి నోరు, ముక్కు నుంచి నురుగు వచ్చి ఉన్నట్లు గుర్తించారు. గదిలో తనిఖీలు చేయగా యువతి కాలేజీ బ్యాగ్, ఒక చిన్న ఎలుకల మందు డబ్బాతో పాటు ఒక లెటర్ లభించింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు యువతి ప్రియుడు విపిన్ యాదవ్ రాసిన సూసైడ్ నోట్ అది అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.

బైక్ వదిలేసి పరార్.. హత్య కేసు నమోదు

హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో విపిన్ యాదవ్ ఒక్కడే హోటల్ నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయినట్లు రికార్డయింది. తన బైక్‌ను హోటల్ కిందే వదిలేసి అతడు పరారవగా, పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేశారు.

విపిన్ యాదవ్ తన కుమార్తెను హత్య చేసి పారిపోయాడని యువతి తండ్రి ఆరోపించారు. దీంతో మిస్సింగ్ ఎఫ్ఐఆర్‌కు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) (హత్య) కింద అభియోగాలను జోడించి, విపిన్‌పై కేసు నమోదు చేసినట్లు ఫరీదాబాద్ పోలీస్ పీఆర్వో యశ్‌పాల్ యాదవ్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, బుధవారం మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement