త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Recommendations | బాండ్ల రాబడితో మారిన లెక్కలు.. ఈ 5 స్టాక్స్‌పై ఓ కన్నేయండి..

Stock Recommendations | ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో భారీ న‌ష్టాలు వ‌స్తుండ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కేవ‌లం అమెరికా, ఇరాన్ యుద్ధం మాత్ర‌మే కాకుండా ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌డం, అమెరికా బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల పెట్టుబ‌డిదారులు చాలా మంది త‌మ పెట్టుబ‌డుల‌ను అమెరికా బాండ్ మార్కెట్ల వైపు మ‌ళ్లిస్తున్నారు.

S

Business | Published On Oct 3, 2026, 11.13 am IST

Stock Recommendations | బాండ్ల రాబడితో మారిన లెక్కలు.. ఈ 5 స్టాక్స్‌పై ఓ కన్నేయండి..
Advertisement

Stock Recommendations | ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో భారీ న‌ష్టాలు వ‌స్తుండ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కేవ‌లం అమెరికా, ఇరాన్ యుద్ధం మాత్ర‌మే కాకుండా ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌డం, అమెరికా బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల పెట్టుబ‌డిదారులు చాలా మంది త‌మ పెట్టుబ‌డుల‌ను అమెరికా బాండ్ మార్కెట్ల వైపు మ‌ళ్లిస్తున్నారు. దీంతో అమెరికా ఈక్విటీ మార్కెట్ల‌లోనూ న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. అయితే అమెరికా బాండ్ మార్కెట్లు ఈ స్థాయిలో రాబ‌డుల‌ను అందిస్తాయ‌ని అస‌లు ఎవ‌రూ ఊహించ‌లేదు. దీంతో అనూహ్యంగా పెట్టుబ‌డిదారులు వాటి వైపు మ‌ళ్లుతున్నారు. అయితే స్టాక్ మార్కెట్ల‌లోనూ ఇప్ప‌టికీ కొన్ని ర‌కాల స్టాక్స్ పెట్టుబ‌డిదారుల‌పై సిరులు కురిపిస్తున్నాయి. అందువ‌ల్ల ఈక్విటీ మార్కెట్ల‌ను పూర్తిగా విడిచిపెట్టాల్సిన ప‌నిలేద‌ని చెబుతున్నారు. ప‌త‌నావ‌స్థ‌లోనూ కొన్ని ర‌కాల స్టాక్స్ పెట్టుబ‌డిదారుల‌కు మంచి లాభాల‌ను అందిస్తాయ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఎస్ఆర్ ప్ల‌స్ రిపోర్టు అలాంటి కొన్ని స్టాక్స్ వివ‌రాల‌ను తెలియ‌జేసింది. వీటిని వాచ్‌లిస్ట్‌లో పెట్టుకుని ఓ క‌న్నేసి ఉంచితే స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు వాటిల్లో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

హెచ్‌డీబీ ఫైనాన్స్‌, శ్రీ‌రామ్ ఫైనాన్స్‌..

హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఒక విభిన్నమైన రిటైల్‌-కేంద్రిత నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఈ కంపెనీ ఓమ్ని-ఛానల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా విభిన్న కస్టమర్ వర్గాలకు రుణ ఉత్పత్తులను అందిస్తోంది. ఎంటర్‌ప్రైజ్ లెండింగ్, అసెట్ ఫైనాన్స్, కన్స్యూమర్ ఫైనాన్స్ అనే మూడు ప్రధాన వ్యాపార విభాగాల ద్వారా రుణ ఉత్పత్తులను అందిస్తోంది. ఈ కంపెనీ ప్ర‌స్తుతం లాభాల్లో న‌డుస్తుండ‌గా ప్ర‌స్తుతం షేర్ ధ‌ర రూ.618.20 గా ఉంది. 1 ఏడాదిలో ఈ షేర్‌కు గాను 33 శాతం వృద్ధి సాధ్య‌మ‌ని నివేదిక తెలియ‌జేసింది. టార్గెట్ ధ‌ర‌ను విశ్లేష‌కులు రూ.816గా నిర్ణయించారు. దీనికి 16 మంది విశ్లేష‌కులు బై రేటింగ్ ఇచ్చారు. ఇక శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గతంలో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌గా ఉండేది. ఇది రిటైల్‌ నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. కమర్షియల్ వెహికల్ లోన్స్, టూ-వీలర్ లోన్స్, కార్ లోన్స్, హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, చిన్న వ్యాపార రుణాలు వంటి క్రెడిట్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. ఈ సంస్థ కూడా లాభాల బాట‌లో న‌డుస్తుండ‌గా, ప్ర‌స్తుతం షేర్ ధ‌ర రూ.945గా ఉంది. మ‌రో ఏడాదిలో ఈ షేర్ ధ‌ర 26 శాతం లాభ‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు తెలిపారు. టార్గెట్ ధ‌ర‌ను రూ.1199గా నిర్ణ‌యించారు. 33 మంది అన‌లిస్టులు దీనికి బై రేటింగ్ ఇచ్చారు.

టాటా క‌మ్యూనికేష‌న్స్‌, పిడిలైట్ ఇండ‌స్ట్రీస్‌..

టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ సేవలను అందించే వ్యాపారంలో ఉంది. కంపెనీకి వాయిస్ సొల్యూషన్స్, డేటా అండ్ మేనేజ్డ్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ అనే విభాగాలు ఉన్నాయి. ఈ కంపెనీ సైతం అధిక వృద్ధి రేటును కొన‌సాగిస్తోంది. ప్రస్తుతం షేర్ ధ‌ర రూ.1683 ఉండ‌గా ఏడాదిలో 24 శాతం లాభ ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నివేదిక తెలిపింది. ఈ షేర్ టార్గెట్ ధ‌ర‌ను రూ.2103గా నిర్ణ‌యించారు. 8 మంది విశ్లేష‌కులు దీనికి బై రేటింగ్ ఇచ్చారు. ఇక పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వినియోగదారుల, పారిశ్రామిక స్పెషాలిటీ కెమికల్స్ వ్యాపారంలో ఉంది. కంపెనీ కన్స్యూమర్ అండ్ బజార్, బిజినెస్ టు బిజినెస్ అనే రెండు విభాగాల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ కూడా వృద్ధిని అధిక శాతంతో కొన‌సాగిస్తోంది. ప్ర‌స్తుతం పిడిటైల్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ షేర్ ధ‌ర రూ.1464 ఉండ‌గా, ఏడాదిలో 21 శాతం లాభం వ‌చ్చే చాన్స్ ఉంద‌ని చెప్పారు. 19 మంది విశ్లేష‌కులు దీనికి బై రేటింగ్ ఇవ్వ‌గా, ఏడాదిలో టార్గెట్ ధ‌రను రూ.1785గా నిర్ణ‌యించారు.

హిటాచీ ఎన‌ర్జీ..

హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఒక పవర్ టెక్నాలజీ కంపెనీ. మొత్తం పవర్ వాల్యూ చైన్‌కు సంబంధించిన గ్రిడ్ పోర్ట్‌ఫోలియోను అందించే వ్యాపారంలో ఇది ఉంది. కేబుల్ యాక్సెసరీస్, కెపాసిటర్లు, ఫిల్టర్లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్, కూలింగ్ సిస్టమ్స్, డిస్‌కనెక్టర్లు, ఎనర్జీ ప్లానింగ్ అండ్ ట్రేడింగ్, ఎనర్జీ స్టోరేజ్, జనరేటర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, సెమీకండక్టర్లు, సబ్‌స్టేషన్ ఆటోమేషన్, ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్, సబ్‌స్టేషన్స్ అండ్ ఎలక్ట్రిఫికేషన్, సర్జ్ అరెస్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ట్రాన్స్‌ఫార్మర్ ఇన్సులేషన్ అండ్ కాంపోనెంట్స్, హై వోల్టేజ్ స్విచ్‌గేర్ అండ్ బ్రేకర్లు వంటి ఉత్పత్తులు, సిస్టమ్స్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ కంపెనీ సైతం లాభాల బాట‌లో న‌డుస్తోంది. ప్రస్తుతం షేర్ ధ‌ర రూ.31,290 ఉండ‌గా, ఏడాదిలో 14 శాతం లాభం పొందే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. టార్గెట్ ధ‌ర‌ను రూ.35,664గా నిర్ణ‌యించారు. 18 మంది విశ్లేష‌కులు దీనికి బై రేటింగ్ ఇచ్చారు. అయితే ఈ స్టాక్స్ పెట్టుబడుల‌కు సూచ‌న‌లు కాద‌ని గ‌మ‌నించాలి. పెట్టుబ‌డిదారులు త‌మ సొంత ప‌రిజ్ఞానంతో లేదా నిపుణుల సూచ‌న‌ల‌తో మాత్ర‌మే పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబ‌డులు పెట్టేముందు మార్కెట్ స్థితిగ‌తుల‌ను పూర్తిగా అంచ‌నా వేయ‌డం కూడా ముఖ్య‌మే.

Advertisement
Advertisement