త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GST Council 57th Meeting | వ్యాపారులకు బిగ్ రిలీఫ్: జీఎస్టీ అధికారుల అరెస్ట్ పవర్స్ రద్దు.. ప్రాసిక్యూషన్ లిమిట్ రూ.5 కోట్లకు పెంపు

వ్యాపారులకు ఊరట! జీఎస్టీ అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు.. ప్రాసిక్యూషన్ పరిమితి రూ.5 కోట్లకు పెంపు. పూర్తి వివరాలివే!

J

Business | Published On Oct 8, 2026, 7.31 pm IST

GST Council 57th Meeting | వ్యాపారులకు బిగ్ రిలీఫ్: జీఎస్టీ అధికారుల అరెస్ట్ పవర్స్ రద్దు.. ప్రాసిక్యూషన్ లిమిట్ రూ.5 కోట్లకు పెంపు
Advertisement
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో ముగిసిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
  • జీఎస్టీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవు
  • ప్రక్రియల సరళీకరణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పైనే ప్రధాన దృష్టి
  • అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు
  • ప్రాసిక్యూషన్ ప్రారంభించే పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంపు
  • ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించే చిన్న వ్యాపారులకు నిబంధనల సులభతరం
  • జనరల్ పెనాల్టీ రూ.25,000 నుంచి రూ.10,000కు తగ్గింపు

GST Council 57th Meeting | త్రినేత్ర న్యూస్ : దేశవ్యాప్తంగా వ్యాపార రంగానికి ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో గురువారం జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిబంధనలకు సంబంధించి పలు భారీ సంస్కరణలకు ఆమోదం లభించింది. ట్యాక్స్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, వ్యాపారులు ఏళ్ల తరబడి కోరుతున్న ప్రక్రియల సరళీకరణపై కౌన్సిల్ స్పష్టమైన ముద్ర వేసింది.

ఈ సమావేశంలో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం.. జీఎస్టీ అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను రద్దు చేయడం. గతంలో పన్ను ఎగవేత లేదా చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలపై అధికారుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై ఎవరైనా పన్ను చెల్లింపుదారుడు రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేసినా, పొరపాట్లు దొర్లినా లేదా చెల్లింపు ఆలస్యమైనా.. పన్ను రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా మాత్రమే విధిస్తారు తప్ప అంతకుమించి వేధింపులు ఉండవు.

అంతేకాకుండా, క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు ఉన్న కనీస పరిమితిని రూ.1 కోటి నుంచి ఏకంగా రూ.5 కోట్లకు పెంచారు. కనీస శిక్ష (minimum punishment) నిబంధనను కూడా రద్దు చేస్తూ, కేసుకు సంబంధించి జరిమానా విధించాలా లేక జైలు శిక్షా అనేది పూర్తిగా న్యాయస్థానాల విచక్షణకే వదిలేశారు. నిర్దిష్టంగా ఎలాంటి పెనాల్టీ వర్తించని కేసుల్లో జనరల్ పెనాల్టీని రూ.25,000 నుంచి రూ.10,000కు తగ్గించారు.

ఆన్‌లైన్ వాణిజ్యం వేగంగా విస్తరిస్తున్న వేళ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఉత్పత్తులను విక్రయించే చిన్న వర్తకులకు కౌన్సిల్ శుభవార్త చెప్పింది. చిన్న వ్యాపారులపై కంప్లయన్స్ భారాన్ని తగ్గించేలా నిబంధనలను సులభతరం చేసింది.

సమావేశం అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. "ఈ సమావేశంలో ట్యాక్స్ రేట్ల మార్పు కంటే.. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం (Ease of Doing Business), ప్రక్రియల్లో పారదర్శకతను పెంచడంపైనే ప్రధానంగా దృష్టి సారించాం" అని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement