త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyclone Akvan | ఏపీపై ‘అక్వాన్’ తుఫాన్ పంజా.. అమరావతికి మళ్లీ ముంపు ముప్పు!

బంగాళాఖాతంలో ‘అక్వాన్’ తుఫాన్ ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. నవంబర్ 20న తీరం దాటే అవకాశం ఉండటంతో అమరావతి సహా పలు జిల్లాలకు భారీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

J

Andhra pradesh | Published On Nov 16, 2026, 8.47 pm IST

Cyclone Akvan | ఏపీపై ‘అక్వాన్’ తుఫాన్ పంజా.. అమరావతికి మళ్లీ ముంపు ముప్పు!

సంక్షిప్త సారాంశం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అక్వాన్’ తుఫాన్‌గా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. నవంబర్ 20న బాపట్ల – మచిలీపట్నం మధ్య తీరం దాటేందుకు 50 శాతం అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 140 నుంచి 150+ కి.మీ వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉండటంతో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు ‘పర్పుల్ అలర్ట్’ జారీ అయింది. మచిలీపట్నానికి ఈశాన్యంగా 100 కి.మీ లోపే అమరావతి ఉండటంతో, రాజధాని ప్రాంతం మరోసారి నీటమునిగే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement
  • ఏపీ వైపు దూసుకొస్తున్న 'అక్వాన్' తుఫాన్
  • నవంబర్ 20న మచిలీపట్నం వద్ద ల్యాండ్‌ఫాల్

Cyclone Akvan | త్రినేత్ర న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌కు మరో పెను తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం (డీప్ డిప్రెషన్) ‘అక్వాన్’ (Akvan) తుఫాన్‌గా బలపడి ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. వాతావరణ నిపుణుల తాజా అంచనాల ప్రకారం, నవంబర్ 20న బాపట్ల – మచిలీపట్నం మధ్య ఈ తుఫాన్ తీరం దాటే (ల్యాండ్‌ఫాల్) అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 140 నుంచి 150 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.

అమరావతిని ‘అక్వాన్’ టార్గెట్ చేస్తుందా?

వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం, తుఫాన్ ఎక్కడైతే తీరం దాటుతుందో, దానికి ఈశాన్య (నార్త్-ఈస్ట్) దిశలో 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో తీవ్ర బీభత్సం సృష్టిస్తుంది. ‘అక్వాన్’ తుఫాన్ మచిలీపట్నం సమీపంలో తీరం దాటితే, అక్కడికి ఈశాన్యంగా 100 కిలోమీటర్ల లోపు దూరంలోనే ఏపీ రాజధాని అమరావతి ఉంది. దీనివల్ల అమరావతి, దాని పరిసర ప్రాంతాలపై తుఫాన్ తీవ్రంగా విరుచుకుపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే ఇటీవల వచ్చిన ‘అర్నాబ్’, ‘మురుసు’ తుఫాన్ల ధాటికి అమరావతి ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. భారీ మోటార్లతో నీటిని తోడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ నష్టం నుంచి కోలుకోకముందే ఇప్పుడు ‘అక్వాన్’ తుఫాన్ విరుచుకుపడితే అమరావతి మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకోవడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

తుఫాన్ గమనం.. ఎక్కడెక్కడ ఎంత ప్రభావం?

నవంబర్ 16 నాటి శాటిలైట్ అంచనాల ప్రకారం, ఈ తుఫాన్ నవంబర్ 18, 19 తేదీల్లో తీరం వైపు కదులుతూ నవంబర్ 20న పూర్తిస్థాయిలో విరుచుకుపడనుంది. తుఫాన్ తీరం దాటే ప్రాంతాలపై మూడు రకాల అంచనాలను పేర్కొన్నారు.

నవంబర్ 20 (నెల్లూరు – మచిలీపట్నం మధ్య): తీరం దాటేందుకు అత్యధికంగా 50 శాతం అవకాశం ఉంది.

నవంబర్ 19 (చెన్నై – నెల్లూరు మధ్య): తీరం దాటేందుకు 30 శాతం అవకాశం ఉంది.

నవంబర్ 21 (మచిలీపట్నం – విశాఖపట్నం మధ్య): తీరం దాటేందుకు 20 శాతం అవకాశం ఉంది.

జిల్లాల వారీగా వాతావరణ హెచ్చరికలు (ఏపీ, తెలంగాణ)

‘వైజాగ్ వెదర్‌మ్యాన్’ నవంబర్ 16న విడుదల చేసిన తాజా మ్యాప్ ప్రకారం, ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలపైనా ‘అక్వాన్’ ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.

పర్పుల్ అలర్ట్ (150+ కి.మీ వేగంతో గాలులు, అత్యంత భారీ వర్షాలు): ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అత్యంత తీవ్రమైన ప్రభావం ఉండనుంది.

రెడ్ అలర్ట్ (50-80 కి.మీ వేగంతో గాలులు, భారీ నుంచి అతిభారీ వర్షాలు): ఏపీలోని ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. అలాగే తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోనూ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆరెంజ్ అలర్ట్ (40-60 కి.మీ వేగంతో గాలులు, మోస్తరు వర్షాలు): ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాలతో పాటు తెలంగాణలోని నల్గొండ, యాదాద్రి, జనగాం, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.

ఎల్లో అలర్ట్ (తేలికపాటి వర్షాలు): ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా, తెలంగాణలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement