త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Racism in US | ‘నీ దేశానికి వెళ్లిపో.. వెళ్లి పంది కూర తిను’.. అమెరికాలో భారతీయ సంతతి మహిళపై జాత్యహంకార దాడి

అమెరికాలోని ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న భారతీయ మహిళపై ఓ కస్టమర్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. 'నీ దేశానికి వెళ్లిపో' అంటూ దూషించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

J

Viral news | Published On Jun 14, 2026, 3.00 am IST

Racism in US | ‘నీ దేశానికి వెళ్లిపో.. వెళ్లి పంది కూర తిను’.. అమెరికాలో భారతీయ సంతతి మహిళపై జాత్యహంకార దాడి

సంక్షిప్త సారాంశం

అమెరికా కనెక్టికట్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న సరినా గుప్తా అనే భారతీయ సంతతి మహిళపై ఓ కస్టమర్ జాత్యహంకార (Racist) దాడికి పాల్పడింది. చెకౌట్ కౌంటర్‌ వద్ద కాస్త ఆలస్యం కావడంతో సహనం కోల్పోయిన ఆ కస్టమర్.. 'నీ దేశానికి వెళ్లిపో.. అమెరికాలో ఉండొద్దు' అంటూ బూతులు తిట్టింది. ఈ ఘటనను సరినా గుప్తా తన ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన మహిళ ఒక నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించిన ఆ యాజమాన్యం.. ఆమె ప్రవర్తనను తీవ్రంగా ఖండించింది.

Advertisement

Racism in US | త్రినేత్ర.న్యూస్ : అమెరికాలో (US) భారతీయులపై జాత్యహంకార దాడులు (Racist attacks) ఆగడం లేదు. తాజాగా కనెక్టికట్ రాష్ట్రం స్టాంఫోర్డ్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో భారతీయ సంతతికి చెందిన సరినా గుప్తా అనే మహిళకు తీవ్ర అవమానం ఎదురైంది. ఓ కస్టమర్ ఆమెను ఉద్దేశించి 'నీ దేశానికి వెళ్లిపో.. అసలు అమెరికాలో ఉండొద్దు' అంటూ తీవ్ర పదజాలంతో దూషించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

అసలు సూపర్‌మార్కెట్‌లో ఏం జరిగింది?

సరినా గుప్తా ఆ సూపర్‌మార్కెట్‌లోని చెకౌట్ కౌంటర్ (Checkout counter) వద్ద పనిచేస్తున్నారు. రిటర్న్స్ ప్రాసెస్ చేస్తున్న సమయంలో కాస్త ఆలస్యం కావడంతో క్యూలో ఉన్న ఒక మహిళా కస్టమర్ సహనం కోల్పోయింది. మరో కౌంటర్‌కు వెళ్లాల్సిందిగా సరినా సూచించడంతో ఆమె ఒక్కసారిగా రెచ్చిపోయింది. ఎలాంటి కవ్వింపు లేకుండానే ఆ కస్టమర్ తనపై జాత్యహంకార పదజాలంతో విరుచుకుపడిందని సరినా ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఈ అనూహ్య ఘటనతో షాక్‌కు గురైన సరినా.. వెంటనే తన ఫోన్ తీసి ఆ కస్టమర్ వ్యవహారశైలిని రికార్డ్ చేశారు. దాదాపు ఐదు నిమిషాల పాటు సాగిన ఆ వీడియోలో.. ఆ మహిళ "అమెరికాలో ఉండొద్దు.. నీ దేశానికి వెళ్లి ఆ బేకాన్ (Bacon - పంది కూర) తిను" అంటూ బూతులు తిడుతూ నానా యాగీ చేసింది. ఈ వీడియోను టిక్‌టాక్ (TikTok), ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ (Viral) అయింది.

పబ్లిక్‌గా ఒకరిని ఇలా ఎలా దూషిస్తారంటూ నెటిజన్లు ఆ మహిళపై మండిపడుతున్నారు. "బయట అందరి ముందు ఒకరిని ఇలా తిట్టే ధైర్యం ఎలా వస్తుంది? మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం?" అంటూ సరినా ఆవేదన వ్యక్తం చేశారు. అంతగా రెచ్చిపోయిన ఆ మహిళ వృత్తిరీత్యా ఒక నర్సుగా పనిచేస్తోందని తెలిసి తాను మరింత ఆశ్చర్యపోయానని ఆమె తెలిపారు.

యాజమాన్యం సీరియస్

మరోవైపు, ఈ వీడియో వైరల్ కావడంతో ఆ మహిళ పనిచేస్తున్న నాథనియేల్ విథెరల్ (Nathaniel Witherell) నర్సింగ్ హోమ్ యాజమాన్యం స్పందించింది. ఆ వీడియోలో ఉన్నది తమ ఉద్యోగేనని నిర్ధారించిన సంస్థ.. ఆమె ప్రవర్తనను తీవ్రంగా ఖండించింది. "ఆ వీడియోలోని వ్యాఖ్యలు మా సంస్థ విధానాలను, సంస్కృతిని ప్రతిబింబించవు. విద్వేష ప్రసంగాలు, వివక్షను మా సంస్థ ఏమాత్రం సహించదు (Zero-tolerance policy)" అని స్పష్టం చేస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Advertisement
Advertisement