త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arribada Begins | ప్రకృతి అద్భుతం ‘అరిబాడా’.. ఒడిశా తీరంలో లక్షలాది ఆలివ్ రిడ్లే తాబేళ్ల కోలాహలం!

ఒడిశా తీరంలో అరుదైన ప్రకృతి అద్భుతం మొదలైంది. అంతరించిపోతున్న అరుదైన 'ఆలివ్ రిడ్లే' తాబేళ్లు ఇసుకలో గుడ్లు పెట్టేందుకు లక్షలాదిగా తీరానికి చేరుకుంటున్నాయి. ఈ సామూహిక ఘట్టాన్ని 'అరిబాడా' అని పిలుస్తారు.

J

Viral news | Published On Mar 15, 2026, 9.30 pm IST

Arribada Begins | ప్రకృతి అద్భుతం ‘అరిబాడా’.. ఒడిశా తీరంలో లక్షలాది ఆలివ్ రిడ్లే తాబేళ్ల కోలాహలం!
Advertisement

Arribada Begins | త్రినేత్ర.న్యూస్ : ప్రకృతి ప్రసాదించిన అత్యంత అద్భుతమైన దృశ్యాల్లో ఒకటి ఒడిశా తీరంలో ఆవిష్కృతమైంది. అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న అరుదైన 'ఆలివ్ రిడ్లే' (Olive Ridley) తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సముద్రం నుంచి లక్షలాదిగా ఒడ్డుకు చేరుకుంటున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక గూడు (Mass Nesting) ప్రక్రియగా పేరొందిన ఈ అరుదైన ఘట్టం ఒడిశా తీరంలో లాంఛనంగా ప్రారంభమైంది.

అసలేమిటీ 'అరిబాడా'?

లక్షలాదిగా తాబేళ్లు ఒకేసారి సముద్ర గర్భం నుంచి గుంపులు గుంపులుగా తీరానికి వచ్చి ఇసుకలో గుడ్లు పెట్టే అత్యంత అరుదైన ప్రకృతి దృశ్యాన్ని 'అరిబాడా' (Arribada) అని పిలుస్తారు. ఈ అద్భుతమైన ప్రక్రియ ఏటా ఒడిశా తీరంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒడిశా రాష్ట్రానికే తలమానికంగా, ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే దృశ్యంగా నిలుస్తోంది.

https://x.com/manas_muduli/status/2033064588196065752

రుషికుల్య తీరానికి క్యూ

గంజాం జిల్లాలోని ప్రసిద్ధ రుషికుల్య (Rushikulya rookery) తీరానికి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ తాబేళ్లు రావడం మొదలుపెట్టాయి. తమ సంతతిని సురక్షితంగా వృద్ధి చేసుకునేందుకు అత్యంత అనువైన ప్రదేశంగా ఈ తీరాన్ని ఎంచుకుని, ప్రతి ఏడాదీ అవి వేల కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఇక్కడికి వస్తుంటాయి. ఆడ తాబేళ్లు ఇసుకలో గుంటలు తవ్వి వందలాది గుడ్లు పెట్టి, వాటిపై ఇసుకను కప్పి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. కొద్దిరోజుల తర్వాత ఆ గుడ్ల నుంచి పిల్ల తాబేళ్లు బయటకు వచ్చి సముద్రంలోకి పయనిస్తాయి.

గతేడాది 9 లక్షలు

ఈ అద్భుతమైన దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులు ఆసక్తి చూపుతారు. కాగా, గత ఏడాది ఇదే బీచ్‌లో రికార్డు స్థాయిలో దాదాపు 9 లక్షల తాబేళ్లు గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో తాబేళ్లు తరలివస్తాయని అటవీ శాఖ అధికారులు, పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. వాటికి ఎటువంటి హాని కలగకుండా తీరప్రాంతంలో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు.

https://x.com/manas_muduli/status/2033061732621627675

 

Advertisement
Advertisement