త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thrissur Pooram 2026 | త్రిస్సూర్ పూరం 2026: ఈ ఏడాది వేడుకల్లో కీలక మార్పులు.. ఎలా వెళ్లాలి? చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలేంటి?

కేరళలో అత్యంత వైభవంగా జరిగే 'త్రిస్సూర్ పూరం' 2026 ఏప్రిల్ 26న జరగనుంది. అయితే ఇటీవల జరిగిన బాణసంచా ప్రమాదం కారణంగా ఈసారి వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూరం షెడ్యూల్, ప్రయాణ వివరాలు, హైదరాబాద్, ఏపీల నుంచి ఎలా వెళ్లాలి, త్రిస్సూర్ చుట్టుపక్కల సందర్శించాల్సిన పర్యాటక ప్రాంతాల పూర్తి వివరాలు మీకోసం.

J

Tourism | Published On Apr 25, 2026, 8.48 pm IST

Thrissur Pooram 2026 | త్రిస్సూర్ పూరం 2026: ఈ ఏడాది వేడుకల్లో కీలక మార్పులు.. ఎలా వెళ్లాలి? చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలేంటి?
Advertisement

Thrissur Pooram 2026 | త్రినేత్ర.న్యూస్ : కేరళలోని చారిత్రక వడక్కున్నాథన్ ఆలయంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే 'త్రిస్సూర్ పూరం' (Thrissur Pooram) పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 2026 సంవత్సరానికి గాను ఈ మహా వేడుక ఏప్రిల్ 26 (ఆదివారం) న జరగనుంది. శనివారం నాడు విలంబరం (ప్రకటన) తో ఈ వేడుకలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అయితే, ముండత్తికోడ్ (Mundathikode) లో ఇటీవల జరిగిన బాణసంచా ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంతో, ఈ ఏడాది పండుగను ఆర్భాటాలు లేకుండా, కేవలం సంప్రదాయబద్ధంగా మాత్రమే నిర్వహిస్తున్నారు.

త్రిస్సూర్ పూరం 2026 షెడ్యూల్, ముఖ్య ఘట్టాలు

ఈ పండుగ సుమారు 36 గంటల పాటు కొనసాగుతుంది. ప్రధాన ఘట్టాలు ఏప్రిల్ 26న జరుగుతాయి.

ఏప్రిల్ 20 (సోమవారం): కొడియెట్టం (ధ్వజారోహణ)తో వేడుకలు మొదలయ్యాయి.

ఏప్రిల్ 25 (శనివారం): పూరం విలంబరం (దక్షిణ గోపురం తెరిచే కార్యక్రమం) జరిగింది. నైతలక్కవిలమ్మ విగ్రహాన్ని మోసుకెళ్తూ ఎర్నాకులం శివకుమార్ అనే ఏనుగు ఈ ఘట్టాన్ని పూర్తి చేసింది.

ఏప్రిల్ 26 (ఆదివారం): ప్రధాన పూరం రోజు. ఉదయం 11:30 కు మదతిల్ వరవు పంచవాద్యం, మధ్యాహ్నం 2:30 కు ఇలంజితర మేళం, సాయంత్రం 5:30 కు కుడమట్టం (రంగురంగుల గొడుగుల ప్రదర్శన) జరుగుతాయి.

ఏప్రిల్ 27 (సోమవారం): ఉపాచారం చొల్లి పిరియల్ (వీడ్కోలు) తో పండుగ ముగుస్తుంది.

Thrissur Pooram 2026 Schedule Major Changes Travel Guide and Nearby Tourist Places

2026 వేడుకల్లో ప్రధాన మార్పులు

భద్రతా కారణాలు, ఉన్నత స్థాయి అధికారుల నిర్ణయాల మేరకు ఈసారి పలు ఆంక్షలు విధించారు.

బాణసంచా రద్దు: ఈ వేడుకలో అత్యంత ఆకర్షణీయమైన మెయిన్ ఫైర్ వర్క్స్ (వేడికెట్టు), శాంపిల్ ఫైర్ వర్క్స్ రెండింటినీ పూర్తిగా రద్దు చేశారు.

తగ్గించిన కుడమట్టం సమయం: ఏనుగులపై ఉండి గొడుగులు మార్చే కుడమట్టం వేడుక జరుగుతుంది, కానీ రద్దీని నియంత్రించేందుకు దీని సమయాన్ని సుమారు 15 నిమిషాలకు కుదించారు.

కేవలం సంప్రదాయ ఆచారాలు: వేడుకల స్థాయి తగ్గించినప్పటికీ, ఏనుగుల ఊరేగింపులు, మేళాలు యథాతథంగా కొనసాగుతాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి త్రిస్సూర్ ఎలా చేరుకోవాలి?

తెలంగాణ (హైదరాబాద్), ఆంధ్రప్రదేశ్ నుంచి త్రిస్సూర్ వెళ్లేందుకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పండుగ రద్దీ దృష్ట్యా ముందస్తుగా హోటల్స్ బుక్ చేసుకోవడం ఉత్తమం.

విమాన మార్గం : హైదరాబాద్ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్) నుంచి కొచ్చి (Kochi) కి నేరుగా విమానాలు ఉన్నాయి. ప్రయాణ సమయం సుమారు గంటా నలభై నిమిషాలు. అక్కడి నుంచి క్యాబ్ లేదా అలువా స్టేషన్ నుంచి రైలు ద్వారా గంటలో త్రిస్సూర్ చేరుకోవచ్చు. వైజాగ్ నుంచి వచ్చే వారు హైదరాబాద్ లేదా బెంగళూరు మీదుగా కొచ్చి చేరుకోవచ్చు.

రైలు మార్గం: సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ (17230) నేరుగా త్రిస్సూర్ (TCR) వెళుతుంది. విజయవాడ వాసులు కూడా ఈ రైలును ఉపయోగించుకోవచ్చు. వాళ్లు గుంటూరు వెళ్లి ఆ రైలు ఎక్కాల్సి ఉంటుంది. వైజాగ్ నుంచి విశాఖపట్నం-కొల్లాం ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది.

బస్సు మార్గం: హైదరాబాద్ (అమీర్‌పేట్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల) నుంచి త్రిస్సూర్ కు ట్రావెల్స్ వంటి ప్రైవేట్ స్లీపర్ బస్సులు ఉన్నాయి. ప్రయాణానికి సుమారు 18 గంటలు పడుతుంది.

Thrissur Pooram 2026 Schedule Major Changes Travel Guide and Nearby Tourist Places

త్రిస్సూర్ చుట్టుపక్కల సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు

మీరు పూరం వేడుకలకు వెళ్తున్నట్లయితే, సమీపంలోని ఈ అద్భుతమైన ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.

ప్రకృతి అందాలు, జలపాతాలు

అతిరప్పిల్లి జలపాతం (Athirappilly Waterfalls): "నయాగరా ఆఫ్ ఇండియా" గా పిలిచే కేరళలోని అతిపెద్ద జలపాతం ఇది. త్రిస్సూర్ కు 60 కి.మీ దూరంలో ఉంది. చాలకుడి వరకు బస్సులో వెళ్లి అక్కడినుంచి లోకల్ బస్సు ద్వారా వెళ్లొచ్చు. దీనికి సమీపంలోనే తక్కువ రద్దీ ఉండే వజచల్, చార్పా జలపాతాలు కూడా ఉన్నాయి.

పీచి డ్యామ్ (Peechi Dam): నగరం నుంచి 22 కి.మీ దూరంలో ఉన్న ఈ డ్యామ్ వద్ద బోటింగ్ చేయవచ్చు. అందమైన బొటానికల్ గార్డెన్, వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఉన్నాయి.

ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలు

గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం (Guruvayur Temple): దేశంలోని ముఖ్యమైన శ్రీకృష్ణ దేవాలయాల్లో ఒకటైన ఈ గుడి త్రిస్సూర్ కు 27 కి.మీ దూరంలో ఉంది. త్రిస్సూర్ నుంచి బస్సులు, లోకల్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

ఆనకోట ఏనుగుల క్యాంప్ (Anakkotta): గురువాయూర్ సమీపంలో ఉన్న ఈ కేంద్రంలో ఆలయ ఉత్సవాల్లో పాల్గొనే సుమారు 60 ఏనుగులను సంరక్షిస్తున్నారు.

అవర్ లేడీ ఆఫ్ డోలర్స్ బసిలికా (Our Lady of Dolours Basilica): త్రిస్సూర్ నగర నడిబొడ్డున ఉన్న ఆసియాలోని ఎత్తైన చర్చిలలో ఇది ఒకటి.

కళలు, వారసత్వం

కేరళ కళామండలం (Kerala Kalamandalam): త్రిస్సూర్ కు 30 కి.మీ దూరంలో చెరుతురుతిలో ఉన్న ఈ సంస్థ, కథాకళి వంటి సాంప్రదాయ కళలను సంరక్షించడంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

శక్తన్ తంపురాన్ ప్యాలెస్ (Shakthan Thampuran Palace): కేరళ, డచ్ ఆర్కిటెక్చర్ తో నిర్మించిన ఈ రాజభవనం ప్రస్తుతం మ్యూజియంగా ఉంది.

బీచ్‌లు, వ్యూ పాయింట్లు

విలంగన్ హిల్స్ (Vilangan Hills): నగరం నుంచి 9 కి.మీ దూరంలో ఉన్న ఈ కొండల పైనుంచి త్రిస్సూర్ నగర అందాలను, అద్భుతమైన సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు.

స్నేహతీరం బీచ్ (Snehatheeram): కుటుంబ సమేతంగా గడపడానికి అనువైన పరిశుభ్రమైన బీచ్ ఇది. నగరానికి 25 కి.మీ దూరంలో ఉంది.

Advertisement
Advertisement