లోడ్ అవుతోంది...


Suitcase | టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? మీ ట్రిప్ కోసం మంచి సూట్ కేసు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఏ రంగు సూట్‌కేసు తీసుకోవాలో ఒకసారి ఆలోచించుకోండి. సాధారణంగా చాలామంది బ్లాక్ కలర్ సూట్‌కేసులనే ఎక్కువగా ఎంచుకుంటుంటారు. కానీ దాని వల్ల అనేక ఇబ్బందులు తప్పవు. చూడ్డానికి బ్లాక్ కలర్ బ్యాగులు అందంగా, ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ అవి మన ప్రయాణంలో లేనిపోని తలనొప్పి తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా చాలామంది సూట్‌కేసు కానీ.. లగేజీ బ్యాగు కానీ కొనుగోలు చేసినప్పుడు బ్లాక్ కలర్‌నే ప్రిఫర్ చేస్తుంటారు. అంతర్జాతీయంగా పేరొందిన లగేజి బ్రాండ్ ఎమినెంట్ నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయే సూట్‌కేసుల్లో 40 శాతం వరకు బ్యాగులు బ్లాక్ కలర్వేనంట. ఇలా ఇన్ని ఒకే రంగు బ్యాగులు ఉండటం వల్ల ప్రయాణాలు చేసినప్పుడు తిప్పలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో గందరగోళానికి గురై.. టైమ్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. హార్డ్ సైడెడ్ బ్లాక్ సూట్‌కేసులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణం.. అందుకే అవే ఎక్కువగా మిస్ అయ్యే అవకాశం ఉంటుందని అమెరికాకు చెందిన సమ్మర్ క్యాంప్ వైల్డ్ ప్యాక్స్‌కు చెందిన ట్రావెల్ ఎక్స్పర్ట్ జేమీ ఫ్రేజర్ తెలిపారు. ఒకేలా కనిపించే వందల బ్యాగుల మధ్య మీ బ్యాగు గుర్తించడం చాలా కష్టమవుతుందని పేర్కొన్నారు. రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో ఒకదానికొకటి కలిసి పోవడం వల్ల మన బ్యాగును వెతుక్కోవడానికే సమయం పోతుందని.. లేదంటే ఒకరి లగేజిని మరొకరు తీసుకెళ్లడం వంటి సమస్యలు తరచూ జరుగుతున్నాయని హెచ్చరించారు. ఇలా బ్యాగులు మారిపోయినప్పుడు వ్యక్తిగతంగా కలిసి బ్యాగులను తీసుకోవచ్చు. కానీ దానికే టైమ్ ఎక్కువగా పోతుంది. లగేజీ కనిపించడం లేదనే టెన్షన్ పెరిగి మూడ్ కూడా పాడవుతుంది. దీనివల్ల మొత్తం ట్రిప్‌నే డిస్ట్రబ్ అయ్యే అవకాశం ఉంటుంది.
- బ్లాక్ కలర్‌కు బదులు ఇతర ప్రకాశవంతమైన రంగుల్లో ఉన్న సూట్‌కేసులను ఎంచుకోవాలి. ఎరుపు, పసుపు, బ్లూ కలర్ వంటివి కూడా బెస్ట్ ఆప్షన్.
- విభిన్న కలర్‌తో పాటు డిజైన్ లేదా ప్యాటర్న్ ప్రత్యేకంగా ఉన్న బ్యాగులు అయితే సులువుగా గుర్తుపట్టవచ్చు.
ఒకవేళ ఇప్పటికే బ్లాక్ కలర్ సూట్ కేసు ఉన్నప్పటికీ ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ట్రావెల్ నిపుణులు చెబుతున్నారు.
- లగేజీ బ్యాగ్‌కు స్పెషల్ ట్యాగ్‌లను పెట్టుకోవాలి. వాటిపై పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ వంటివి మెన్షన్ చేసుకోవాలి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పూర్తి చిరునామా ఇవ్వకపోవడమే మంచిది.
- ఇప్పటికే బ్లాక్ కలర్ సూట్‌కేసు/బ్యాగ్ ఉంటే దాన్ని ప్రత్యేకంగా మార్చుకోవాలి. అంటే రంగురంలు రిబ్బన్లు, స్టిక్కర్లు అతికించి కస్టమైజ్ చేసుకోవడం వల్ల ఎన్ని బ్యాగుల మధ్యలోనైనా మీ లగేజీని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam