త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మన్ను తిన్న పాము లెక్క కదులవు మెదులవు

Harish Rao | గోదావ‌రి-కావేరి లింకు పేరుతో చంద్ర‌బాబు తెలంగాణ‌పై పెద్ద కుట్ర‌లు చేస్తున్నార‌ని.. మ‌న్ను తిన్న పాము లెక్క సీఎం రేవంత్‌ క‌ద‌ల‌డు, మెద‌ల‌డ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు.

S

Telangana | Published On Oct 17, 2026, 2.54 pm IST

Harish Rao | మన్ను తిన్న పాము లెక్క కదులవు మెదులవు
Advertisement
  • గోదావరి-కావేరీ లింకు పేరుతో బాబు తెలంగాణపై పెద్ద కుట్ర చేస్తున్న‌డు
  • లేఖల మీద లేఖలు రాస్తున్నడు.. ఢిల్లీలో మీటింగులు అటెండ్ అవుతున్నడు
  • సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఫైర్‌

Harish Rao | త్రినేత్ర న్యూస్: గోదావ‌రి-కావేరి లింకు పేరుతో చంద్ర‌బాబు తెలంగాణ‌పై పెద్ద కుట్ర‌లు చేస్తున్నార‌ని.. మ‌న్ను తిన్న పాము లెక్క సీఎం రేవంత్‌ క‌ద‌ల‌డు, మెద‌ల‌డ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. లేఖ‌ల మీద లేఖ‌లు రాస్తూ బాబు ఢిల్లీలో మీటింగులు అటెండ్ అవుతున్నాడ‌న్నారు. దేవాదుల, కన్నెపల్లి, కల్వకుర్తిలో 24 గంటల పాటు మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎందుకు ఎత్తలేదని మండిపడ్డారు. పంపుల వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తే నీ ఫెయిల్యూర్ ఏంటో తెలుస్తుంద‌న్నారు. కల్వకుర్తిలో 35 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉంటే 13 టీఎంసీలు ఎత్తి మిగిలిన నీళ్లు ఏపీకి ధారాదత్తం చేశార‌ని ఆరోపించారు. తాను రుజువు చేయడానికి రెడీగా ఉన్నాన‌ని.. పోదాం పదా అని సవాల్ విసిరారు. తెలంగాణ భ‌వ‌న్ శనివారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ రేవంత్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తెలంగాణ కంటే ఏపీలో త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైనా అక్క‌డ ఎల్‌నినో ప్రభావం లేద‌న్నారు.

నవంబర్ 3న ఢిల్లీలో NWDA మీటింగ్ జరగబోతున్నది. ఎజెండా కూడా విడుదలైంది. గోదావరి కావేరీ లింకును ఈ ఎజెండాలో చేర్చుతూ అన్ని రాష్ట్రాలకు పంపారు. గోదావరి-కావేరీ లింకు పేరుతో తెలంగాణపై పెద్ద కుట్ర జరగుతున్నది. తెలంగాణ నీటి హక్కులకు మరణశాసనం రాస్తున్నారు. అడ్డుకోవాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కుట్రకు మద్దతు పలుకుతూ చారిత్రక ద్రోహానికి పాల్పడుతున్నడు. చంద్రబాబు ఈనెల‌ 7న గోదావరి-కావేరీ లింకును పోలవరం నుంచి చేపట్టాలని, ఎజెండాలో చేర్చాలని లేఖ రాసారు. లేఖ రాయగానే ఎజెండాలో పొందుపర్చడం, నవంబర్ 3న మీటింగ్ పెట్టడం జరుగుతున్నది.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కుక్కిన పేనుల్లా పడి ఉన్న తెలంగాణ ద్రోహులంతా ఇవాళ మళ్ళా నిద్రలేచారు. పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టుతో గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రాకు తరలించేందుకు విష కూటమిలా తయారయ్యారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడిన మరుక్షణం నుంచే, ఏపీ సీఎం చంద్రబాబు గోదావరీ జలాల దోపిడీ మొదలు పెట్టిండు. కోవర్టు రేవంతు తెలంగాణ నీటి హక్కులు నిండా ముంచుతున్నడు.

బాబు ఎత్తుల‌ను చిత్తు చేస్తున్నం

గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మొద్దు నిద్రలో ఉంటే, ఆ ఎత్తులను బీఆర్ఎస్ చిత్తు చేస్తూ వస్తున్నది. గోదావరిలో 200 టీఎంసీలు తీసుకుపోయేందుకు తొలుత పోలవరం-బనకచర్లను తెరమీదికి తీసుకొచ్చారు. ఆ తర్వాత నల్లమలసాగర్‌గా పేరు మార్చారు. ఇప్పుడు కేంద్రంతో ఒప్పించి దానిని గోదావరి-కావేరి నదుల అనుసంధానం పేరిట బనకచర్లకు మార్గం సుగమం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

చంద్రబాబు ఇప్పుడు గోదావరి-కావేరి ముసుగులో మూడో ప్రతిపాదనకు తీసుకువచ్చారు. నేరుగా పోలవరం నుంచి బొల్లపల్లి, నాగార్జున సాగర్ సోమశిల ద్వారా కావేరికి నీళ్లు తరలించే ప్లాన్ చేసిండు. గోదావరి బనకచర్ల, గోదావరి నల్లమల సాగర్ ఫెయిల్ కావడంతో మొత్తం తెలంగాణ నదీ జలాలను కబలించే కుట్ర. అడ్డుకోవాల్సిన రేవంత్ రెడ్డి పూర్తిగా దాసోహం చేస్తున్నడు. పోలవరం నుంచి కావేరికి నేరుగా కలిపి అనుసంధానంలో తెలంగాణ లేకుండా చేసారు.

భ‌విష్య‌త్ త‌రాలు నిన్ను క్ష‌మించ‌వు

కేసీఆర్‌ హెచ్చరించినట్టు.. ‘కత్తి పరాయి వాడిదే కానీ.. పొడిచే చెయ్యి’ మనోడిదే! ఆ ‘చెయ్యి’ తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్నది. ఆ చెయ్యి.. మన ఎవుసం కూలగొట్టి, పరాయి పల్లకీ మోస్తున్నది. తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెడుతున్నది. గురుదక్షిణ అని నువ్వు అనుకుంటున్నవు, కానీ ఇది అంతకు మించిన జాతి ద్రోహం. నువ్వు చేస్తున్న జల ద్రోహానికి భవిష్యత్ తరాలు కూడా నిన్ను క్షమించవు రేవంత్ రెడ్డి.

నీటి హక్కులే లేకుండా చేస్తున్నడు

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మేం అనేక సార్లు హెచ్చరించినం. చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని చెప్పినం. మా గురువు మా గురువు అంటూ గోదావరి జలాలను వదలిపెట్టిండు. ఇప్పుడేమైంది.. అసలుకే ఎసరు వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి.. ఇన్నాళ్లూ మనకు నీళ్లు ఉన్నా.. నీటి హక్కులు ఉన్నా వినియోగించలేదు. ఇప్పుడు ఏకంగా నీటి హక్కులే లేకుండా చేస్తున్నడు. ఇప్పటికే రిజర్వాయర్లలో నీటి నిల్వ లేదు, పంట పోలాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుందని 9 నెలల నుంచి మొత్తుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైన రేవంత్ రెడ్డి నేడు ఎల్ నినో పేరు చెప్పి చేతులెత్తేసిండు.

రైతులు, ప్రజలను మీ సావు మీరు సావండి అంటున్నడు. ఇంక ఈ మొనగాడు మొన్న ఏమన్నడు.. ‘ఏదైనా కొనగలం కానీ నీళ్లను కొనలేం అంటున్నడు’. మరి అంతటి ప్రాధాన్యం గల నీళ్ల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నవు రేవంత్ రెడ్డి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మొదటి నుంచి చెబుతున్నాం. చనిపోయిన పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాడారు.

దేవాదులలో నీళ్లు వస్తున్నయి. పది మోటార్లు నడవాల్సిన చోట మూడే ఎందుకు నడుపుతున్నావు అని నిలదీసినం. తెలంగాణ భవన్ లో మాట్లాడినం, వరంగల్ జిల్లాలో మాట్లాడినం. ఈరోజు పైసలు పెట్టి ఏదైనా కొనొచ్చు, నీళ్లు కొనలేం అంటున్నడు. దేవాదులలో పదికి పది మోటార్లు ఎందుకు నడపలేదు. ఈరోజు వరంగల్ లో కరువు వచ్చేది కాదు కదా. నువ్వు వదిలి పెడితే చంద్రబాబు ఒడిసి పట్టిండు, ఏపీలో కరువు లేదు
తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం ఏపీలో నమొదైంది. కానీ అక్కడ క్రాప్ హాలిడే లేదు, ఇక్కడ మాత్రం పంటలు వేయొద్దు అంటున్నవు.

దేవాదులలో 10 మోటార్లు నడిపితే చెరువులు, చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు నిండేవి కరువు ఉండేది కాదు శ్రీశైలంలో నిల్వ నీళ్లు ఉన్నా లిఫ్ట్ చేయలేదు. 5 మోటార్లు ఉన్న కల్వకుర్తిలో 3 మోటార్లు 7,8 గంటలు నడిపావు నువ్వు వదిలిపెడితే చంద్రబాబు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు తీసుకువెళ్లాడు. ఏపీలో జలహారతి, తెలంగాణలో కన్నీళ్ల హారతి. పాలమూరుకు, తెలంగాణకు కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ తెచ్చిన కరువు.

కన్నెపల్లిలో మోటార్లు నడపాలని డిమాండ్ చేస్తే నడపలేదు. ఎన్డీఎస్ఏ పేరు చెప్పి కాలయాపన చేసినవు నీళ్లు లిఫ్ట్ చేయడం రాష్ట్ర నిర్ణయం మాకు సంబంధం లేదు అని హైకోర్టులో ఎన్డీఎస్ఏ అఫిడవిట్ వేసి చెంప చెల్లుమనేలా చెప్పింది. సీడబ్లుపీఆర్ఎస్ తన నివేదికలో అన్నారం, సుందిళ్ల అద్బుతంగా ఉన్నాయని చెప్పాయి. కన్నెపల్లిలో కట్క ఒత్తితే నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా, బారాణ తెలంగాణకు, హైదరాబాద్ కు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా రాజకీయాలు చేస్తూ లేని కరువు తెచ్చినావు రేవంత్ రెడ్డి.

కల్వకుర్తిలో 35 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉంటే 13 టీఎంసీలు నడిపనవు మిగిలిన నీళ్లు ఏపీకి ధారాదత్తం చేసినవు. నేను రుజువు చేయడానికి రెడీగా ఉన్నా పోదాం పదా.. నువ్వు చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి గోదావరి జలాలను తరలించుకుపోయే లింకు విషయంలో చంద్రబాబు లేఖల మీద లేఖలు రాస్తున్నడు. ఢిల్లీలో మీటింగులు అటెండ్ అవుతున్నడు. నువ్వేం చేస్తున్నవు, రాతి బొమ్మ లెక్క నిలబడి చూస్తున్నవు. మన్ను తిన్న పాము లెక్క కదులవు మెదులవు.

ఈనెల 7న చంద్రబాబు పాటిల్ కు లేఖ రాసిండు. చంద్రబాబు రాసిన లేఖ గోదావరిలో తెలంగాణ హక్కులకు మరణశాసనం. నదుల అనుసంధానం పేరిట మన రాష్ట్రానికి జరుగుతున్న దుర్మార్గానికి అధికారిక దస్త్రం.

లేఖ మూడో పాయింట్: ’’గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు నీటిని మళ్లించే వనరుగా ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ ను గతంలో NWDA ప్రతిపాదించింది.. ఈ ప్రతిపాదన ప్రకారం నీటిని డైవర్ట్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం. ఎలాంటి లాభం లేదు. పోలవరం, ఇతర ప్రాజెక్టుల నీటి వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతుంద’’ని లేఖలో రాసిండు.

పదేళ్ల క్రితం జరిగిన నిర్ణయాన్ని ఇప్పుడు వ్యతిరేకిస్తారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రతిపాదిస్తే ఇది సాధ్యం అయ్యింది. ఏ రాష్ట్రానికి ఎంత నీళ్లు అనేది ఆరోజు జరిగిన మీటింగ్ లో నిర్ణయించారు. గోదావరి పరివాహక ప్రాంతాలకు ఆ మెమరాండం కూడా పంపడం జరిగింది.. తెలంగాణ నుంచి తీసుకుపోవాలని అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నయి. ఇచ్చంపల్లి నుంచి తీసుకుపోయేందుకు.. 10.06.2024 నాడు జరిగిన మీటింగ్ లో మధ్యప్రదేశ్, 11.06.2024 మీటింగ్ లో తమిళనాడు,. 03.09,2026 నాడు కర్ణాటక, పుదుచ్చెరిలు ఒప్పుకున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం తెలంగాణకు ప్రయోజనం వద్దు అంటున్నడు.

లేఖలో ఆరో పాయింట్: చంద్రబాబు ఇంకేం అంటడు.. గోదావరి నుంచి తరలించిన నీటిని నేరుగా నాగార్జున సాగర్ రిజర్వాయర్ లోకి వదలడానికి బదులుగా, బొల్లపల్లి రిజర్వాయర్ ను వినియోగించాలని అంటడు. 150 టీఎంసీలు నింపుకుంట అంటడు. మరి తెలంగాణ హక్కులు ఏం కావాలి. సమక్క నుంచి నాగార్జున సాగర్ మీదుగా తీసుకువెళ్తే తెలంగాణకు నీళ్లు వస్తయి, కరువు వస్తే మనం వాడుకోవచ్చు. మనకు నీటి హక్కులు ఉంటయి. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ మీదుగా నదుల అనుసంధానం జరగాలని కేంద్రం ఒప్పుకున్నది, సరిహద్దు రాష్ట్రాలు ఒప్పుకున్నయి.

మేము ముందు నుంచి ఒకటే చెబుతున్నాం.. ఇచ్చంపల్లి కావేరీ లింకు విషయంలో.. మా రాష్ట్రానికి 968టీఎంసీలకు మాకు అనుమతి ఇవ్వాలి, తీసుకుపోయే నీళ్లలో 50శాతం మాకు ఇవ్వాలి, మా నీళ్లు ఒక్క చుక్క ముట్టుకోకుండా ముందుకు వెళ్తే నదుల అనుసంధానంకు ఒప్పుకుంటామని స్పష్టంగా చెప్పినం. ఇప్పుడేం జరుగుతున్నది అసలు ఇచ్చంపల్లి వద్దు, పోలవరం మార్చాలి అంటున్నరు. నాగార్జున సాగర్ మీదుగా వద్దు బొల్లపల్లి తీసుకుపోతం అంటున్నరు.

మనకు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? 139 టీఎంసీలు పెండింగ్ లో ఉన్నయి. వార్దా, సమ్మక్క, మూడో టీఎంసీలు కాంగ్రెస్ చేతగాని తనం వల్ల వాపస్ వచ్చింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ మీదుగా పోతే 2,38,236 ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీళ్లు వస్తయి. ఇది ఆనాటి కేంద్రం ఎంఓయూలో నే స్పష్టంగా ఉంది. ఇప్పుడు ప్రతిపాదన మార్చితే తెలంగాణ పరిశ్రమలకు నీళ్లు, తాగు నీరు, సాగు నీరు పరిస్థితి ఏమిటి? మొదట ఉండే రాష్ట్రం తెలంగాణ మన వాటా మనకు రాకుండా చేస్తున్నారు. చంద్రబాబు లేఖ రాసి పది రోజులు అవుతున్నా నీకు సోయి రాదు పెదవి విప్పవు.

విన్ విన్ సిట్యుయేషన్ ఎలా అవుతుంది

అసలు ఇంటర్ లింకింగ్ నుంచి సమ్మక్క సాగర్ ను ఎందుకు తీసేస్తున్నరు. గతంలో సమ్మక్క సాగర్ కు 45 టీఎంసీ అనుమతి ఇవ్వొద్దు, మా పోలవరంకు నష్టం అవుతుంది అని ఏపీ లేఖ రాసింది. వాళ్లు వెంటనే డీపీఆర్ వాపస్ పంపారు. లేఖలో గోదావరి- కావేరీ లింకు విన్ విన్ సిట్యుయేషన్ అంటున్న చంద్రబాబు.. ఏ విధంగా విన్ విన్ సిట్యుయేషన్ అవుతుంది.. చంద్రబాబు చెబుతారా? రేవంత్ చెబుతారా? కేంద్రం చెబుతుందా.. తెలంగాణకు నష్టం చేసే ఈ ప్రతిపాదన ఎలా విన్ విన్ సిట్యుయేషన్ అవుతుంది.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొన్న ఏపీకి వచ్చిండు. చేయి చేయి కలుపుదాం దక్షాణిదికి మేలు చేసుకుందాం అని మాట్లాడుకున్నరు. అసలు ఏం జరుగుతుందో తెలుసా రేవంత్ రెడ్డి. కర్ణాటకను ఒప్పించేందుకు చంద్రబాబు ఆఫర్ ఇచ్చిండు. మేం కింద గోదావరి నీళ్లు వాడుకుంటం, పైన ఆల్మట్టిలో 16 టీఎంసీలు ఆపుకో. కానీ పోలవరం లింకుకు ఒప్పుకో అంటున్నడు.

అల్రెడీ పోలవరం డైవర్షన్ లో 21 టీఎంసీలు, ఇప్పుడు 16 టీఎంసీలు అంటే 37 టీఎంసీలు కృష్ణాలో ఆగితే పాలమూరు జిల్లాకు నష్టం. ఎల్ నినో నేపథ్యంలో నీళ్ల ప్రాధాన్యం అర్థమైన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకు నోరు మెదపడం లేదు? ప్రపంచంలో నీళ్ల యుద్దాలు జరుగుతాయి అంటున్నరు. మీరు, నేను శాశ్వతం కాదు, తెలంగాణ శాశ్వతం. రాష్ట్ర హక్కులను కాలరాసే హక్కు నీకు లేదు రేవంత్ రెడ్డి

జాతీయ ప్రయోజనాలు అంటే ఒక రాష్ట్రానికి మేలు జరగటం కాదు. ఇచ్చంపల్లి నుంచి లింకు ప్రాజెక్టు వెళ్తే అన్ని రాష్ట్రాలకు ఉపయోగం. కానీ కేంద్రం ఏం చేస్తున్నది. చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తారా? 16 మంది ఎంపీలు ఉండి గడ్డి పీకుతున్నారా. ఈ ప్రతిపాదన కేంద్రం ఒప్పుకుంటే తెలంగాణ జాతికిశ్వాశ్వతంగా ద్రోహం చేసినట్లే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం? మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి. రేవంత్ గురు దక్షిణ చెల్లిస్తుంటే, బీజేపీ ఎందుకు స్పందించడం లేదు? కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు తెలంగాణ హక్కులను కాపాడే బాధ్యత లేదా?

కేఎల్ రావు గారు గొప్పవారు అని ఏపీ వాళ్లు కీర్తిస్తారు. ఆ కేఎల్ రావు గారే గోదావరి కావేరీ లింకు ఇచ్చంపల్లి మీదుగా తీసుకుపోవాలని చెప్పారు. వారు చెప్పినా వినరా? ఏపీ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలు అవుతాయా? చంద్రబాబు ఎంపీలను చేతిలో పెట్టుకొని ఆడిస్తే కేంద్రం ఆడుతుందా? తెలంగాణ జాతికి మోసం చేస్తాం అంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఊరుకునే గడ్డ కాదు, ఎలాంటి పోరాటినికైనా సిద్దం. ఈ ప్రతిపాదనలు వెంటనే ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు ఎందుకు తెలంగాణకు నష్టం చేకూరేలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు ఎందుకు దెబ్బ తీస్తున్నారు. బాధ్యత లేని వాడు సీఎం అయితే ఎట్లుంటదో తెలంగాణ బెస్ట్ ఉదాహరణ. మాకు ఏపీ, తమిళనాడు మీద ద్వేశం లేదు కానీ మాకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం.

సర్ ప్లస్ వాటర్ ఉందంటున్న చంద్రబాబు గారు. అసలు సర్ ప్లస్ వాటర్ ఎంతుంది, తెలంగాణ వాటా ఎంత అది తేలకుండా వాడుకుంటాం అంటే ఏమన్నట్లు మా తెలంగాణ పరిస్థితి ఏమిటి? సర్ ప్లస్ వాటర్ మీద ప్రాజెక్టు అనుమతించరు. అసలు గోదావరి కావేరీ నీళ్లు ఎక్కడివి అంటే.. చత్తీస్ గడ్ వినియోగించని 148 టీఎంసీలు. వీటిని గోదావరి కావేరీ లింకుకు వాడుతం అన్నరు. ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోని 148 టీఎంసీలను మళ్లించాలనే లక్ష్యంతో NWDA గోదావరి కావేరి లింకు ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.

ఈ మళ్లించే 148 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 43, ఏపీకి 44, తమిళనాడుకు 42.5, పుదుచ్చేరికి 2.5, కర్ణాటక రాష్ర్టానికి 16 టీఎంసీలను పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నీళ్లన్నీ నువ్వే తీసుకుపోతే తెలంగాణ ఏం కావాలి. నేషనల్ ప్రాజెక్టు అంటున్నరు. మాకు నష్టం చేసేది నేషనల్ ప్రాజెక్టు ఎలా అవుతుంది. కాళేశ్వరం, పాలమూరు నేషనల్ ప్రాజెక్టు అడిగితే మాకు ఇవ్వలేదు. తెలంగాణకు ఒక్క నేషనల్ ప్రాజెక్టు వద్దా?

కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కోవాలి. రేవంత్ నోరు విప్పాలి. ఆనాడు ఉద్యమకారులపై రైఫిల్ ఎక్కుపెట్టినోడు… చంద్రబాబుతో కలిసి తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని, కూలగొట్టబోతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయినోడు ముఖ్యమంత్రి రేవంతు. నిజమైన కాంగ్రెస్ నాయకులారా.. తెలంగాణ గడ్డకు పచ్చ కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని ఇప్పటికైనా అడ్డుకోండి. ఇకనైనా బాబుకు చేసే బానిసత్వం మానుకోవాలనీ, తెలంగాణ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్ళతో పెకలిస్తాం, బీజేపీకి బుద్ది చెబుతాం అని హెచ్చరిస్తున్నాం.

ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement