త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UN | యువశక్తి దేశంపై ఇంత‌టి నిరాధార‌మైన ఆరోప‌ణ‌లా..? ఐరాస నివేదిక‌పై భార‌త్ ఆగ్ర‌హం

UN | భార‌త్‌లో మానసిక ఆరోగ్యం, లింగ సమానత్వం వంటి అంశాలపై మాట్లాడుతున్న యువ‌త ప్ర‌భుత్వం నుంచి వివ‌క్ష, అణ‌చివేత‌ను ఎదుర్కొంటోందంటూ ఐక్యరాజ్యసమితి స్పెషల్ రిపోర్టర్ గీనా రోమెరో (Gina Romero) చేసిన ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది.

D

National | Published On Oct 17, 2026, 2.28 pm IST

UN | యువశక్తి దేశంపై ఇంత‌టి నిరాధార‌మైన ఆరోప‌ణ‌లా..? ఐరాస నివేదిక‌పై భార‌త్ ఆగ్ర‌హం
Advertisement

UN | త్రినేత్ర న్యూస్ : భార‌త్‌లో మానసిక ఆరోగ్యం, లింగ సమానత్వం వంటి అంశాలపై మాట్లాడుతున్న యువ‌త ప్ర‌భుత్వం నుంచి వివ‌క్ష, అణ‌చివేత‌ను ఎదుర్కొంటోందంటూ ఐక్యరాజ్యసమితి స్పెషల్ రిపోర్టర్ గీనా రోమెరో (Gina Romero) చేసిన ఆరోప‌ణ‌ల‌ను భార‌త్ తీవ్రంగా ఖండించింది. ఆమె చేసిన ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని భార‌త దౌత్య‌వేత్త అనుజ్ స్వరూప్ (Anuj Swarup) స్ప‌ష్టం చేశారు. ఎలాంటి ధృవీక‌ర‌ణ లేని త‌ప్పుడు క‌థ‌నాల ఆధారంగానే ఆమె ఈ ఆరోప‌ణ‌లు చేశార‌ని మండిప‌డ్డారు.

ఐరాస సర్వప్రతినిధి సభ మూడో కమిటీ సమావేశంలో (UNGA) ఈ అంశంపై అనుజ్ స్వరూప్ మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద యువశక్తి ఉన్న దేశంపై ఇంతటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. కోట్లాది మంది యువతకు సంబంధించిన అంశంపై మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలు ఉండాలని స్పష్టం చేశారు. పేరు కూడా తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ నివేదిక తయారు చేశారని మండిప‌డ్డారు. ఆధారాలు లేని ఆరోపణలను ఐక్యరాజ్యసమితి నివేదికలో చేర్చడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఇలాంటి ఏకపక్ష, బాధ్యతారహిత నివేదికలు ఐక్యరాజ్యసమితి, దాని సంస్థల విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛతో పాటు శాంతియుతంగా సమావేశాలు నిర్వహించడం, సంఘాలు ఏర్పాటు చేసుకోవడం వంటి హక్కులను కల్పిస్తోందని అనుజ్ స్వ‌రూప్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. స్వతంత్ర న్యాయవ్యవస్థ, స్వేచ్ఛాయుత మీడియా, జాతీయ మానవ హక్కుల కమిషన్ వంటి వ్యవస్థలు ఈ హక్కులకు రక్షణగా నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ యువత చేపట్టిన ఎన్నో నిరసనలకు భారత్ వేదికైందని అనుజ్ స్వరూప్ ఈ సంద‌ర్భంగా ఉద‌హ‌రించారు.

గీనా రోమెరో త‌న నివేదికలో భారత యువత సృష్టించిన వ్యంగ్య రాజకీయ ఉద్యమాన్ని కూడా ప్రస్తావించారు. దీనిపై అనుజ్జ్ స్పందిస్తూ.. ప్రభుత్వ తీరును ప్ర‌శ్నిస్తూ ఓ వ్యంగ్య రాజ‌కీయ‌పార్టీ రాజధానిలో ప్రదర్శన నిర్వహించి, ఆ తర్వాత జాతీయ స్థాయి అగ్రనేతలతో నేరుగా చర్చలు జరిపిన విష‌యాన్ని గుర్తు చేశారు. "ఏ అణచివేత రాజ్యంలోనైనా యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించి, రాజధానిలో మార్చ్ చేసి, చివరకు సీనియర్ నేతలతో చర్చలు జరుపుతుందా..?" అని అనుజ్ స్వరూప్ ప్రశ్నించారు. అంతేకాదు, పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థులు నిరసనలు తెలిపినప్పుడు ప్రభుత్వం ఎంతో నిర్మాణాత్మకంగా స్పందించిందని పేర్కొన్నారు. నింద‌లు వేసే ముందు నిర్ధారించుకోవాల‌ని గీనా రోమెరోకు అనుజ్ చుర‌క‌లంటించారు.

గీనా రోమెరో ఆరోపణ‌లు..

భార‌త ప్ర‌భుత్వంపై గీనా రోమెరో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. భార‌త్‌లో శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న యువ‌త‌పై ప్ర‌భుత్వం బ‌ల‌ప్ర‌యోగం చేస్తోంద‌ని, వారిని నిర్బంధిస్తోందంటూ ఆరోపించారు. యువ‌త ప్ర‌భుత్వం నుంచి వివ‌క్ష, అణ‌చివేత‌ను ఎదుర్కొంటోంద‌ని విమ‌ర్శించారు. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న సుమారు 2,500 మందికి పైగా నిరసనకారులను మారుమూల నిర్బంధ కేంద్రాలకు తరలించారని పేర్కొన్నారు. కొంద‌రిని హింసించార‌ని, లైంగిక వేధింపుల‌కు గురి చేశార‌ని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, నిరసనకారుల ఫోన్లను స్వాధీనం చేసుకుని, నిరసనలకు సంబంధించిన సమాచారాన్ని తొలగించడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని ఆమె విమర్శించారు.

Also Read..

పిల్ల‌ల‌కు ఇంట‌ర్నెట్ యాక్సెస్ ఉండాలి.. సుప్రీం కోర్టు కీల‌క ఆదేశాలు

మార్కో రూబియో పర్యటన వేళ భారత్‌లో నిరసనలపై అమెరికా ఎంపీల లేఖాస్త్రం.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

న‌వంబ‌ర్ 7న‌ మహాధర్నాకు నిరుద్యోగ యువత పిలుపు

Advertisement
Advertisement