త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

APP Results | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల.. 17 నుంచి స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్

APP Results | తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ( APP ) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ( TSLPRB ) సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలను టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు( VV Srinivasa Rao ) ఒక ప్రకటనలో వెల్లడించారు.

S

Telangana | Published On Oct 12, 2026, 4.10 pm IST

APP Results | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష ఫలితాలు విడుదల.. 17 నుంచి స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్
Advertisement

ఈ ధృవ‌ప‌త్రాలు త‌ప్ప‌నిస‌రి
స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు హాజ‌రు కాక‌పోతే
ఉద్యోగంపై ఆస‌క్తి లేన‌ట్లుగా భావిస్తాం
టీఎస్ఎల్‌పీఆర్‌బీ చైర్మ‌న్ వీవీ శ్రీనివాస్ రావు వెల్ల‌డి

APP Results | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ( APP ) పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ( TSLPRB ) సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలను టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు( VV Srinivasa Rao ) ఒక ప్రకటనలో వెల్లడించారు.

2025 ఆగస్టు 15న వెలువరించిన నోటిఫికేషన్ ప్రకారం.. గతేడాది డిసెంబరు 14న హైదరాబాద్‌ పరిసరాల్లోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో రెండు పేపర్లుగా ఈ రాత పరీక్ష నిర్వహించినట్లు ఛైర్మన్ తెలిపారు. పరీక్ష ప్రాథమిక 'కీ' ని 2025 డిసెంబరు 21న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి, డిసెంబరు 24 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించినట్లు పేర్కొన్నారు. స్వీకరించిన అన్ని అభ్యంతరాలను నిపుణులతో సమగ్రంగా పరిశీలించి, పరిష్కరించిన అనంతరం బోర్డు తుది 'కీ' ని రూపొందించిందని వివరించారు. ఈ ఫైనల్ కీతో పాటు అభ్యర్థుల సమాధానాల (ఓఎంఆర్) డిజిటల్ ప్రతులను బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాత పరీక్ష ఫలితాల షీట్లను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ఖాతాలలో ఉంచామని, అభ్యర్థులు తమ వివరాలతో లాగిన్ అయి ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు.

రాత పరీక్షలో (పేపర్-1, పేపర్-2) అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈ నెల 17న సర్టిఫికేట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసరావు ప్రకటించారు. అర్హత పొందిన అభ్యర్థులు బోర్డు వెబ్‌సైట్ ద్వారా 'కాల్ లెటర్ (ఇంటిమేషన్ లెటర్)' ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఇంటిమేషన్ లెటర్‌లోనే ధ్రువపత్రాల పరిశీలన జరిగే వేదిక, సమయం వివరాలను పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో స్వయంగా హాజరుకావాల్సి ఉంటుందని తెలియజేశారు.

పరిశీలన సమయంలో అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటవుట్, రాత పరీక్ష ఫలితాల షీట్, వెరిఫికేషన్ ఇంటిమేషన్ లెటర్, గుర్తింపు కార్డులతో పాటు పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం ఎస్సెస్సీ/మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యా అర్హతలకు సంబంధించి డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ/బి.ఎల్. సర్టిఫికేట్లు, బార్ కౌన్సిల్ ఎన్‌రోల్‌మెంట్ సర్టిఫికేట్, అలాగే క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్ల న్యాయవాద అనుభవం ఉన్నట్లు సంబంధిత బార్ అసోసియేషన్ లేదా కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ జారీ చేసిన అనుభవ ధ్రువీకరణ పత్రాలను కచ్చితంగా తీసుకురావాలన్నారు. స్థానికత కోసం 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ (ఎంఆర్‌ఓ జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం) చూపించాల్సి ఉంటుందన్నారు.

రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపు పొందే అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా కుల ధ్రువీకరణ పత్రాలను మాత్రమే సమర్పించాలని ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సీ అభ్యర్థులు వర్గీకరణ తెలిపే గ్రూప్-I, II లేదా III సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలని, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 2025 ఏప్రిల్ 1 తర్వాత పొందిన తాజా సర్టిఫికేట్లను జారీ చేయాలని స్పష్టం చేశారు. దివ్యాంగులు , క్రీడాకారులు ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లు, మాజీ సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు వారికి వర్తించే తగిన ఆధార పత్రాలను వెంట తీసుకురావాలని తెలిపారు.
అర్హత సాధించిన అభ్యర్థులు ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకాకపోతే వారికి ఉద్యోగంపై ఆసక్తి లేనట్లుగా భావించి బోర్డు తదుపరి చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఫలితాలు, పరిశీలన ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లేదా ఇతర సమస్యలు ఎదురైనా అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ద్వారా support@tslprb.in కు మెయిల్ చేయవచ్చని లేదా 040-41895151 హెల్ప్‌లైన్ నంబరును సంప్రదించవచ్చని టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ శ్రీనివాసరావు వివరించారు.

Advertisement
Advertisement