త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jayaprakash Narayan | డీలిమిటేషన్ బిల్లులో పెద్ద లోపం.. ప్రధాని మోదీకి జయప్రకాశ్ నారాయణ్ లేఖ!

డీలిమిటేషన్ బిల్లులో రాష్ట్రాల సీట్లు ఫ్రీజ్ చేయడం మంచిదే కానీ, అంతర్గత సరిహద్దులను 2051 వరకు ఆపేస్తే పట్టణ ప్రాంతాలకు 220 సీట్ల నష్టం జరుగుతుందని జేపీ మోదీకి లేఖ రాశారు.

J

National | Published On Nov 29, 2026, 10.09 pm IST

Jayaprakash Narayan | డీలిమిటేషన్ బిల్లులో పెద్ద లోపం.. ప్రధాని మోదీకి జయప్రకాశ్ నారాయణ్ లేఖ!

సంక్షిప్త సారాంశం

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు రానున్న వేళ, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (FDR) ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ప్రధాని నరేంద్ర మోదీకి కీలక లేఖ, పాలసీ నోట్ పంపారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచుతూ రాష్ట్రాల సీట్ల వాటాను 2051 వరకు ఫ్రీజ్ చేయడాన్ని స్వాగతిస్తూనే, రాష్ట్రాల అంతర్గత నియోజకవర్గాల సరిహద్దులను సైతం 2051 వరకు ఫ్రీజ్ చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న భారత్‌లో 2011 జనగణన ఆధారంగా సరిహద్దులను ఫ్రీజ్ చేస్తే.. 2026లోనే పట్టణ ప్రాంతాలకు 41 లోక్‌సభ సీట్లు, 2050 నాటికి ఏకంగా 160 నుంచి 220 సీట్ల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని గణాంకాలతో వివరించారు. రాష్ట్రాల మొత్తం సీట్ల సంఖ్యను 2051 వరకు ఫ్రీజ్ చేస్తూనే, ప్రతి పదేళ్లకోసారి తాజా జనగణన ఆధారంగా రాష్ట్రాల లోపల నియోజకవర్గాల సరిహద్దులను సవరించేలా బిల్లులో మార్పులు చేయాలని జేపీ కోరారు.

Advertisement
  • డీలిమిటేషన్ బిల్లులో కీలక సవరణలు చేయండి
  • సరిహద్దులను 2051 వరకు ఫ్రీజ్ చేస్తే పట్టణాలకు 220 సీట్ల నష్టం
  • ప్రధాని మోదీకి జేపీ లేఖ

Jayaprakash Narayan | త్రినేత్ర న్యూస్ : సోమవారం (నవంబర్ 30) నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో.. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (FDR) ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆదివారం (నవంబర్ 29) ఒక కీలక లేఖ రాశారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచుతూ, రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని 2051 వరకు ఫ్రీజ్ చేయడంపై జాతీయ ఏకాభిప్రాయం సాధించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాన రాజకీయ పార్టీలను ఆయన అభినందించారు. అయితే, ప్రతిపాదిత '132వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026' ముసాయిదాలో రాష్ట్రాల లోపల ఉండే నియోజకవర్గాల సరిహద్దులను సైతం 2051 వరకు ఫ్రీజ్ చేసే నిబంధన వల్ల పట్టణ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

ఈ లేఖతో పాటు సమగ్ర విశ్లేషణతో కూడిన పాలసీ నోట్‌ను ఆదివారం కేంద్ర కేబినెట్ మంత్రులందరికీ, ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలకు పంపిస్తున్నామని, సోమవారం పార్లమెంట్ సభ్యులందరికీ (MPs) అందజేయనున్నామని జేపీ వెల్లడించారు.

రాష్ట్రాల సీట్ల ఫ్రీజ్ వేరు.. అంతర్గత సరిహద్దుల మార్పు వేరు

జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు పార్లమెంట్ ప్రాతినిధ్యంలో ఎలాంటి నష్టం కలగకుండా 2051 వరకు రాష్ట్రాల సీట్ల వాటాను ఫ్రీజ్ చేయడం సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని, మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేస్తుందని జేపీ ప్రశంసించారు.

అయితే, డీలిమిటేషన్ ప్రక్రియలో రెండు వేర్వేరు అంశాలను విడివిడిగా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించాలి?

ఆ రాష్ట్రంలోని నియోజకవర్గాల మధ్య ఆ సీట్లను ఎలా విభజించాలి?

రాష్ట్రాలకు కేటాయించే మొత్తం సీట్ల సంఖ్యను 2051 వరకు ఫ్రీజ్ చేసినంత మాత్రాన.. జనాభా మార్పులు, పట్టణ వలసలకు అనుగుణంగా రాష్ట్రం లోపల లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను సవరించే ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదని జేపీ పేర్కొన్నారు.

పట్టణ ప్రాంతాలకు 220 సీట్ల నష్టం ఎలా జరుగుతుందంటే?

భారతదేశం రాబోయే మూడు దశాబ్దాల్లో అత్యంత వేగంగా పట్టణీకరణ (Urbanization) చెందుతోందని జేపీ తన లేఖలో గణాంకాలతో వివరించారు. 2001లో దేశ జనాభాలో పట్టణ ప్రాంతాల వాటా 27.81 శాతంగా ఉండగా, 2011 నాటికి అది 31.16 శాతానికి పెరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MOHUD) అంచనాల ప్రకారం ప్రస్తుతం (2026లో) పట్టణ జనాభా వాటా సుమారు 36 శాతానికి చేరుకుంది.

ఒకవేళ 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టి, 2051 వరకు నియోజకవర్గాల సరిహద్దులను ఫ్రీజ్ చేస్తే పట్టణ ఓటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని FDR నివేదిక స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం 2026లోనే డిజిటలైజేషన్, ఆధునిక టెక్నాలజీ సాయంతో తాజా జనగణన డేటాను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, 2011 లెక్కలపై ఆధారపడితే పట్టణ ప్రాంతాలు తక్షణమే 41 లోక్‌సభ సీట్లను కోల్పోతాయని జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, 2050 నాటికి పట్టణ జనాభా 50 శాతం (MOHUD అంచనా) నుంచి 57 శాతం (ప్రపంచ బ్యాంకు అంచనా) వరకు పెరగనుందని, అప్పటివరకు సరిహద్దులను ఫ్రీజ్ చేస్తే లోక్‌సభలో 160 నుంచి 220 సీట్ల మేర పట్టణ ప్రాంతాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందని హెచ్చరించారు. రాష్ట్రాల అసెంబ్లీలలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు.

పట్టణ ఓటర్లకు న్యాయబద్ధమైన వాటా ఎందుకు ముఖ్యం?

ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ పెరిగే కొద్దీ యువత, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి నగరాలకు వలస వెళ్తుందని జేపీ పేర్కొన్నారు. పట్టణ ఓటర్లు ప్రభుత్వాల పనితీరును, ప్రజాప్రతినిధుల సామర్థ్యాన్ని బేరీజు వేసుకుని ఓటు వేస్తారని తెలిపారు. డబ్బు, తాయిలాలు లేదా కుల, మతపరమైన విభజన రాజకీయాలకు వీరు తక్కువగా ప్రభావితమవుతారని, మౌలిక సదుపాయాలు, ప్రజా సేవల నాణ్యత, విద్య, వైద్యం, ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. కాబట్టి జనాభా దామాషా ప్రకారం పట్టణ ప్రాంతాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం వల్ల ప్రజాస్వామ్యం మరింత పరిణతి చెందుతుందని, జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగ సవరణ బిల్లులో ఉన్న రెండు సాంకేతిక లోపాలు

ప్రతిపాదిత '132వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026', 'డీలిమిటేషన్ (రెండో) బిల్లు-2026'లలో ఉన్న రెండు కీలక లోపాలను FDR పాలసీ నోట్ ఎత్తిచూపింది.

చట్టం అమలు తేదీతో ముడిపెట్టడం: ఆర్టికల్ 81(3), 170(2)లతో పాటు డీలిమిటేషన్ బిల్లులోని సెక్షన్ 2(e) ప్రకారం.. చట్టం అమల్లోకి వచ్చే నాటికి ప్రచురితమైన జనగణన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొనడం వల్ల ప్రక్రియ ఆటోమేటిక్‌గా 2011 సెన్సస్‌కే పరిమితమవుతుంది.

శాశ్వత ఫ్రీజ్ విధించడం: ఆర్టికల్ 82, 170(3)లకు చేస్తున్న సవరణల వల్ల రాష్ట్రాల మధ్య సీట్లతో పాటు, రాష్ట్రాల లోపల నియోజకవర్గాల సరిహద్దులు కూడా 2051 వరకు ఫ్రీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా, ప్రతి సెన్సస్ తర్వాత ఎప్పటికప్పుడు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసే నిబంధనను తొలగించి, కేవలం ఒక్కసారి మాత్రమే కమిషన్ వేసేలా మార్చడం వల్ల పదేళ్లకోసారి జరిగే అంతర్గత సవరణలకు రాజ్యాంగబద్ధమైన ఆధారం లేకుండా పోతోందని జేపీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి జేపీ చేసిన 3 ప్రధాన సూచనలు

ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ బిల్లులో ఈ కింది మూడు మార్పులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జయప్రకాశ్ నారాయణ్ కోరారు.

తాజా సెన్సస్ వినియోగం: 2011 జనగణనపైనే ఆధారపడకుండా, డీలిమిటేషన్ జరిగే సమయానికి అందుబాటులో ఉన్న తాజా సెన్సస్ గణాంకాలను వీలైనంత వరకు ఉపయోగించాలి.

రాష్ట్రాల సీట్ల ఫ్రీజ్ కొనసాగింపు: ప్రతి రాష్ట్రం తన ప్రస్తుత పార్లమెంటరీ ప్రాతినిధ్య వాటాను నిలుపుకునేలా, 2051 వరకు రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల కేటాయింపుపై ఫ్రీజ్‌ను యథాతథంగా కొనసాగించాలి.

పదేళ్లకోసారి అంతర్గత డీలిమిటేషన్: ప్రతి రాష్ట్రానికి కేటాయించిన మొత్తం సీట్ల సంఖ్యను ఫ్రీజ్ చేస్తూనే, ప్రతి పదేళ్లకోసారి ప్రచురితమయ్యే తాజా జనగణన ఆధారంగా రాష్ట్రాల లోపల లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజన (Intra-State Delimitation) జరిగేలా నిబంధనలను పునరుద్ధరించాలి.

Advertisement
Advertisement