త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TPCC President Mahesh Kumar Goud | మూడేండ్లలో మేం తెచ్చిన పెట్టుబడులు 7 లక్షల కోట్లు : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

మహబూబ్ నగర్ లో జరిగిన కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్’ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం 3 రోజుల్లో 5.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సాధించింది సున్నా అని విమర్శించారు.

J

Telangana | Published On Apr 7, 2026, 8.32 pm IST

TPCC President Mahesh Kumar Goud | మూడేండ్లలో మేం తెచ్చిన పెట్టుబడులు 7 లక్షల కోట్లు : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

సంక్షిప్త సారాంశం

మహబూబ్ నగర్ డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడుల గురించి వివరిస్తూ, బీఆర్ఎస్ అవినీతిని, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదాపై స్పష్టమైన హామీ ఇచ్చారు.

Advertisement
  • మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్’ గర్జన
  • కేటీఆర్, హరీష్‌లపై ఫైర్
  • కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడినయ్యా
  • టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 

TPCC President Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో, జ్యోతి ప్రజ్వలన అనంతరం నూతన సభ్యులతో టీపీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్,  బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ విశ్వవ్యాప్తం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల వెల్లువ కురుస్తోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. "గత బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ తెచ్చిన పెట్టుబడులు 10 వేల కోట్లు కూడా దాటలేదు. కానీ, మా ప్రభుత్వం కేవలం మూడు రోజుల్లోనే 5.78 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. మొత్తం మీద సుమారు 7 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టాం. ‘ఫోర్త్ సిటీ’ కాన్సెప్ట్‌తో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

TPCC Chief Mahesh Kumar Goud Slams KTR & Harish Rao at Mahabubnagar Congress Meeting

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా

మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. "పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోంది. రేపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తాం" అని హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ ‘ఆర్థిక విధ్వంసం’పై విమర్శలు

పదేళ్ల బీఆర్ఎస్ పాలన విజన్ లేకుండా సాగిందని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. 1.20 లక్షల కోట్లు గోదావరి పాలు చేశారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ప్రాజెక్టులు కట్టారని, ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు నిత్యం అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

TPCC Chief Mahesh Kumar Goud Slams KTR & Harish Rao at Mahabubnagar Congress Meeting

కార్యకర్తలకు పిలుపు

రాజకీయ చైతన్యం కలిగిన పాలమూరు జిల్లాలో ప్రతి కార్యకర్త ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. "కష్టపడితే ఫలితం వస్తుందనడానికి నేనే ఒక ఉదాహరణ. సాధారణ కార్యకర్త స్థాయి నుండి పీసీసీ అధ్యక్షుడిని అయ్యాను" అని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, సీడబ్ల్యూసీ సభ్యులు చల్లా వంశీ చందర్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement