త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Congress | అసమ్మతి జ్వాలలు ఆగేనా?

Telangana Congress | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనకు చేరువవుతున్న సమయంలో అంతర్గత విభేదాలు పెరగడం పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి పనులకు నిధులు, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన తరుణంలో సొంత పార్టీ నేతల విమర్శలు నాయకత్వానికి సవాలుగా మారుతున్నాయి.

S

Telangana | Published On Nov 21, 2026, 7.58 pm IST

Telangana Congress | అసమ్మతి జ్వాలలు ఆగేనా?
Advertisement

తెలంగాణ కాంగ్రెస్‌లో 
రోజురోజుకూ ముదురుతున్న ముసలం
సొంత పార్టీ నుంచే సీఎం రేవంత్ కు సెగ
నిధుల కోసం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
అవినీతిపై సొంత నేతల ఆరోపణలు..
సీఎం వ్యాఖ్యలతో మరింత రాజుకున్న వివాదం..
రంగంలోకి కాంగ్రెస్ అధిష్ఠానం!

Telangana Congress | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనకు చేరువవుతున్న సమయంలో అంతర్గత విభేదాలు పెరగడం పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొన్నది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి పనులకు నిధులు, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన తరుణంలో సొంత పార్టీ నేతల విమర్శలు నాయకత్వానికి సవాలుగా మారుతున్నాయి. ఈ అసమ్మతి వెనుక కేవలం నిధుల సమస్యలే ఉన్నాయా? పార్టీ పదవులు, రాజకీయ ప్రాధాన్యం, నియోజకవర్గాల్లో ఆధిపత్యం వంటి అంశాలు కూడా కారణమవుతున్నాయా? అన్న చర్చ సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం కారణంగానే నాయకులు బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. అయితే విమర్శలు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరినప్పుడు అవి ప్రభుత్వ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశముంది.

అధిష్టానానికి తలనొప్పి

తాజాగా అసమ్మతి నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి మరింత వేడెక్కింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మొదలుపెట్టిన విమర్శల పర్వం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి చేరింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఆరోపణలు ప్రభుత్వ పనితీరుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు కూడా పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారాయి.మరోవైపు అసమ్మతి నేతలపై క్రమశిక్షణ చర్యలకు కాంగ్రెస్ సిద్ధమవుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోంది? ఈ విభేదాలు నాయకత్వ పోరుకు దారితీస్తాయా? అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ధిక్కార స్వరం.. కురుక్షేత్రం

తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి ప్రధాన కేంద్రంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మారారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదంటూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపైనా విమర్శలు చేశారు.కొడంగల్ వంటి నియోజకవర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ మునుగోడును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. రోడ్లు, సాగునీటి పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి అవసరం లేదని, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని స్పష్టం చేశారు.నిధుల విషయంలో వివక్ష కొనసాగితే మరో కురుక్షేత్రం తప్పదంటూ ఆయన చేసిన హెచ్చరిక కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం రేపింది.

పిచ్చికుక్కల వ్యాఖ్యలతో మరింత వేడి

అసమ్మతి ఎమ్మెల్యేల విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో విమర్శకులను ఉద్దేశించి సీఎం చేసిన పిచ్చికుక్కలంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.దీనిపై రాజగోపాల్‌రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, అధికారంలో ఉన్నామనే కారణంతో అహంకారపూరితంగా మాట్లాడకూడదని సూచించారు.అయితే కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. అంటే పార్టీని వదిలిపెట్టకుండా, పార్టీలోనే ఉంటూ ప్రభుత్వ నాయకత్వాన్ని ప్రశ్నించే వైఖరిని ఆయన కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.

అనిరుధ్ రెడ్డి అవినీతి ఆరోపణలు.. ప్రభుత్వానికి కొత్త చిక్కులు

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరతీశాయి. ప్రభుత్వ అధికారుల అవినీతి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆయన ఆరోపించారు.వారసత్వ ఆస్తి బదిలీకి సంబంధించిన ఒక పని కోసం తాను సూచించినా అధికారులు పట్టించుకోలేదని, అదే వ్యక్తి రూ.15 వేల లంచం ఇచ్చిన తర్వాత పని పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపునకు 10 నుంచి 20 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని కూడా ఆరోపించారు. చిన్న రోడ్డు పనులకు సంబంధించిన బిల్లుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారు.

మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు

కాంగ్రెస్‌లో వివాదాలు కేవలం ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల మధ్యనే పరిమితం కాలేదు. మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య ఢిల్లీలో చోటుచేసుకున్న వివాదం కూడా పార్టీ నాయకత్వానికి సమస్యగా మారింది. పార్టీ సంస్థాగత పదవుల నియామకాల విషయంలో మొదలైన విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్లు వార్తలు వచ్చాయి. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రయత్నించినప్పటికీ, గాంధీభవన్ సమావేశానికి ఇద్దరూ హాజరుకాలేదు.ఈ వ్యవహారంపై అధిష్ఠానానికి నివేదిక సిద్ధం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

అసమ్మతిపై ఏం తేలుస్తారో ?

తాజా పరిణామాలను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రాజగోపాల్‌రెడ్డి, అనిరుద్‌రెడ్డి వ్యాఖ్యలను అధిష్ఠానం పరిశీలిస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు.సరైన సమయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సంకేతాలిచ్చారు. గతంలో కొండా సురేఖ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌లో అందరికీ ఒకే విధమైన నియమాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. అయితే అసమ్మతిని క్రమశిక్షణ చర్యలతో అణచివేయాలా? లేక ఎమ్మెల్యేల ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలా? అన్నది నాయకత్వం ముందున్న కీలక ప్రశ్న.మరోవైపు నూతన తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి బీఎం సందీప్‌తో నవంబర్ 23న సమావేశం కావాలని తనకు సమాచారం అందిందని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తనను సంప్రదించినట్లు తెలిపారు.

చల్లారుతుందా.. మరింత రాజుకుంటుందా?

తెలంగాణ కాంగ్రెస్ ముందున్న సమస్య ఇప్పుడు కేవలం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల అసంతృప్తి మాత్రమే కాదు. నిధుల పంపిణీలో సమానత్వం, ప్రభుత్వంలో జవాబుదారీతనం, పార్టీ నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వానికి అధిష్ఠానం మద్దతు కొనసాగుతున్నప్పటికీ, సొంత పార్టీ నుంచి వస్తున్న విమర్శలను ఎలా ఎదుర్కొంటారన్నది కీలకంగా మారింది.అసమ్మతి నేతలను పిలిపించి బుజ్జగిస్తారా? వారి ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తారా? లేక క్రమశిక్షణ చర్యలతో కట్టడి చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే

Advertisement
Advertisement